వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టాలి : పవన్ కళ్యాణ్
గోదావరి నదికి వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉంటుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధతతో ఉండాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యణ్ ఒక ప్రకటనలో సూచించారు. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేటప్పటికే గోదావరి జిల్లాల్లోని లంక భూములు, కొన్ని గ్రామాలు నీట మునిగిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం ఆందోళనలో ఉన్న విషయం నా దృష్టికి చేరింది. మరో వైపు ఎగువన ఉన్న భద్రాచలంలో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తతతో తగిన పునరావాస చర్యలు చేపట్టాలి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి తగిన వైద్య, ఆరోగ్య, వసతులు కల్పించాలి.
ఇప్పుడు వస్తున్న వరదలను ప్రత్యేక దృష్టితో చూసి అత్యంత జాగ్రత్తలు అనుసరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పొజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వరద ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. భౌతిక దూరానికి ఆస్కారం ఉండేలా లాంచీలు, మర బోట్లను ఎక్కువ సంఖ్యలో సిద్ధపరచుకోవడంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి. పునరావాస కేంద్రాల సంఖ్యను పెంచి అక్కడ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను. కరోనా వైరస్ విస్తృతికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అలాగే పంటలు నష్టపోతున్న రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని ప్రకటించాలని జనసేనాని కోరారు.