ఒంగోలు, (జనస్వరం) : వినాయక చవితి పర్వదిన వేడుకలపై వైసీపీ ప్రభుత్వం విధించిన నిబంధనలు భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ప్రకాశం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ఆరోపించారు. ఇళ్లకే పరిమితం చేసుకోవాలని చెబుతూ, ఇందుకు కోవిడ్ నిబంధనలను కారణంగా చూపిస్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను నూటికి నూరు శాతం అమలు చేసిన పక్షంలో ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే ఎవరైనా ఒప్పుకొంటారు. వైసీపీ వాళ్ళు తమ నేతల పుట్టినరోజు వేడుకలను నడివీధుల్లో చేసుకొని నిబంధనలు ఉల్లంఘించలేదా? ఊరు పేరు లేని పదవి తెచ్చుకొన్నవాళ్లకి ఊరేగింపులు తీసి స్వాగతాలు పలికినప్పుడు కోవిడ్ ప్రబలలేదా?వర్ధంతులకు గుంపులు గుంపులుగా వెళ్ళి దండలు వేయలేదా? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఇడుపులపాయలో సమాధి దగ్గర ఏమైనా సోషల్ డిస్టెన్స్ పాటించారా? మాస్క్ కూడా పెట్టుకొని ముఖ్యమంత్రి ఆయన. అలాంటి సీఎం నేతృత్వంలోని ప్రభుత్వం వినాయక చవితిని నిలుపుదల చేసేందుకు కోవిడ్ ప్రోటోకాల్‌ను చెప్పడం విచిత్రంగా ఉంది. వినాయక చవితి నవరాత్రులను చలువ పందిళ్ళు వేసి నిర్వహించుకోవడం ద్వారా సమాజంలో ఐకమత్యం పెరుగుతుంది. సోదర భావం ఏర్పడుతుందనే వాస్తవాన్నిచరిత్ర చెబుతోంది. తెలియని ఈ పాలకులు ఒకసారి స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ బాల గంగాధర్ తిలక్ చరిత్ర చదివితే మంచిదని రియాజ్ గారు అభిప్రాయపడ్డారు. వినాయకచవితి వేడుకలను అడ్డుకోవడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. ప్రజలు మాస్క్ పెట్టుకొని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, శానిటైజర్ రాసుకొని పూజలు చేసుకోవచ్చు అని అనుమతులు ఇస్తే భక్తులకు ఒక వెసులుబాటు ఉంటుంది. అపార్ట్మెంట్స్ లో కూడా చేసుకోరాదు అని చెప్పడం ద్వారా లౌకిక స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసింది. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.