నిరంతరం కరువు కాటకాలతో అలమటిస్తున్న రాయలసీమ ప్రజలు గుక్కెడు నీటి కోసం ఆకాశం వైపు, పిటికెడు ముద్ద కోసం పండించే నేల వైపు చూడాల్సిన రోజులు ఎదురవుతున్నాయి. తమ ఆశలు నెరవేరుస్తారని ఎదురుచూస్తున్న రాయలసీమ ప్రజలకు పాలక పక్షము, ప్రతి పక్షము, ఇతర రాజకీయ పార్టీల చేతిలోను మరియు ఇటు వైపుగా ప్రకృతి చేతిలోనూ గత కొన్ని వందల సంవత్సరాలుగా మోసపోతూనే ఉన్నారు. రాయలసీమ నుంచి రాజ్యాధికారులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నా అభివృద్ది మాత్రం శూన్యం. రాయలసీమ ప్రజలు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి, అయితే అతివృష్టి లేదా అనావృష్టి బారిన పడడం లేదా అసలు వర్షమే లేకుండా బతుకుతున్న రోజులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ స్వప్రయోజనాలే పరమావధిగా పాలకులు ఈ సీమపై సవతి ప్రేమ చూపిస్తూ అన్నీ రంగాలలో అణగదొక్కి, చివరకి తాగు నీటికి కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే రాయలసీమ ఎంత వెనుకబడిందో అర్థం చేసుకోవచ్చు. పదిమందికి అన్నం పెట్టె రైతులు కూడా ఇపుడు తమ తమ పొట్టకూటి కోసం తదితర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. నాటి రాయల కాలం నాటి రాయలసీమలో రత్నాలు రాశులుగా పోసిన నేల. కానీ, నేటి రాయలసీమ రాళ్ళు, రప్పలతో కూడుకున్న నేలను చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి రావడానికి సీమ ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోయ్యారా? లేక సీమను ప్రకృతి నాశనం చేసిందా?, లేక సీమ ప్రజలే తమ పౌరుషాలతో ప్యాక్షనిజం చేసి నాశనం చేసుకున్నారా? లేక వనరులుండి ఉపయోగించుకోలేక ప్రభుత్వాలు, మేధావులు, యువత వెనుకబడిపొయ్యారా?
రాజకీయ కోణం దృష్ట్యా ::
70 ఏళ్ల స్వాతంత్రంలో దాదాపు రాయలసీమ నుంచి గద్దెనెక్కిన రాజకీయ నాయకులు స్వార్థంతో తమ ఎదుగుదల చూసుకున్నారే తప్పా, వెనుకబడిన, దీనావస్థితిలో ఉన్న సీమ ప్రాంతాన్ని మచ్చుకైనా గుర్తించుకోలేదు. ప్రారంభ కాలం నుంచి ఇప్పటివరకు ముప్పావు వంతు పాలానాధికారాన్ని రాయలసీమ నాయకులే అనుభవించారు అనడంలో సందేహం లేదు. సీమ ప్రాంతం నుంచి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు అయినవారు ఉన్నారు. వారు తమ ప్రాంత అభివృద్ది గురించి ఆలోచించారా లేక అభివృద్ది చేయకుండా తమ వెనుక ఏదైనా రాజకీయ శక్తులు ఆపాయా? ఆ పెరుమాళ్లకే ఎరుక.. రాయలసీమ అభివృద్దికి రాజకీయ నాయకులు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోలేదు అని చెప్పటానికి చక్కటి ఉదాహరణే శ్రీ భాగ్ ఒడంబడిక (పెద్ద మనుషుల ఒప్పందం). మద్రాసు నుండి విడిపోయిన గ్రేటర్ రాయలసీమను ఆంధ్రాలో కలపడానికి మరియు రాయలసీమ అభివృద్దికి చేపట్టడానికి కొంత మంది పెద్ద మనుషులు తీసుకున్న నిర్ణయమే ” శ్రీ భాగ్ ఒడంబడిక “. ఈ ఒప్పందం 16 నవంబర్ 1937 లో జరిగింది. ఇందులోని ప్రధానాంశాలు.
1. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటయ్యాక రాజధాని లేదా హైకోర్ట్ రాయలసీమలో నిర్మించాలి.
2.కృష్ణా, తుంగబధ్ర జలాలలో ప్రథమ ప్రాధాన్యత రాయలసీమకు ఇవ్వడం.
3.రాయలసీమలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం.
4.శాసనసభలలో ఇరు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం.
ఒక్కసారి పై విషయాలను మనం గమనిస్తే కర్నూలును రాజధానిగా కొంతకాలం మాత్రమే ఉంచి మరొక చోటికి తరలించారు. ఉన్న రాజధానిని పోగొట్టుకోవడమే కాకుండా రాజధానికి సమానంగా మరొక నగరాన్ని రాయలసీమలో అభివృద్ది చేయలేకపోయారు. ఇక నీటి జలాల విషయానికొస్తే అరకొర నీటి పారుదల మాత్రమే కళ్ల ముందు కనిపిస్తోంది. రాయలసీమలో ఉన్నటువంటి పెన్నా నది ఇంతవరకు వరదలు పారడం చూడనేలేదు. ఇక రాయలసీమలో విశ్వవిద్యాలయాలు ఉన్న వాటి అభివృద్ది అంతంత మాత్రమే. శాసనసభలో సంఖ్యారీత్యా ప్రాబల్యం తక్కువగా ఉన్నా, అధికార శాసనం మాత్రం సీమ నాయకులదే ఎక్కువ అని చెప్పుకున్నా, వీరు రాయలసీమ అభివృద్ధికి ఏమాత్రం దోహదపడలేదనే అర్థం అవుతోంది. కొన్ని కారణాల రీత్యా రాజకీయ నాయకుల స్వార్థం వల్ల రాయలసీమ వెనుకబడిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు.
ప్రకృతి వైపరీత్యా దృష్ట్యా ::
రాయలసీమలో కాసులు కురిపించే వనరు సంపద ఎంతా ఉందో, అంతే మొత్తంగా నాశనం చేసే వనరు సంపద కూడా ఉంది. ప్రపంచంలో దొరకనటువంటి ఎర్రచందనం నల్లమల అడవుల్లో దొరుకుతున్నా, కాసుల కోసం పచ్చదనాన్ని నాశనం చేయలేము. అలాగే కాసులు పుట్టించే మైనింగ్ భూములు ఉన్నా, వాటిని తవ్వి రాయలసీమను అనారోగ్య బారిన పడవేయలేము. అలాగని స్వచ్చమైన పంటలు పండిద్దాము అంటే వర్షాభావం కూడా అతి తక్కువలో తక్కువగా ఉంటుంది. దేశంలోనే అత్యల్ప వర్షపాతం రెండో స్థానం అనంతపురం జిల్లా ఉందంటే వర్షాభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాయలసీమ మొత్తం అడవులతోనూ, కొండ గుట్టలతోనూ, పంటలు పండించడానికి వీలు కానీ ఎర్ర, నల్ల నేలలు ఉండడం కూడా ఒకింత దురదృష్టకరమే. ఈవిధంగా కూడా రాయలసీమ వెనుకుబాటుతనానికి ప్రకృతి వైపరీత్యం ఒక కారణం కావొచ్చు.
ప్రజల దృష్ట్యా ::
రాయలసీమలో ఒకానొక కాలంలో ఒకపూటి ముద్ద కోసం చేత్తో కత్తి బట్టారు. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాలకోసం, పౌరుషాల కోసం ఏమి తెలియని అభాగ్యులకు ఒక చేతిలో ముద్ద పెట్టి, మరొక చేతిలో కత్తి పట్టడం నేర్పించారు. ఆ కరువు కాటకాల సమయానికి ముద్ద కోసం కత్తి పట్టక తప్పలేదు, రక్తపాతం ఆపనూ లేదు. కడుపు నింపుకోవడం కోసం పట్టిన కత్తి ఇపుడు పౌరుషాలకు, ఉద్రేకాలకు దారి తీసేలా రక్తపాతం సృష్టించింది. కాలానుగుణంతో పాటు ఫ్యాక్షనిజం తగ్గినా, బయటి వ్యక్తులు సీమ ప్రజల్ని భయంగా చూడడం ఇప్పటికీ ఉంది. రాయలసీమలో ఇప్పుడు లేని ఫ్యాక్షనిజాన్ని సినిమాలలో భయంకరంగా, రక్తపాతం ద్రవించేలా, హింసను సృష్టించేలా సినిమాలు తీయడం వల్లనేమో ఇప్పటికీ రాయలసీమలో లేని ఫ్యాక్షనిజాన్ని ఉన్నట్టుగా అపోహాపడుతూ భయపడుతున్నారు. కానీ, దురదృష్టావశాత్తు రాయలసీమలో కొంత మేర ఫ్యాక్షనిజం ఏర్పడడం వల్ల అభివృద్దిని కొన్ని సంవత్సరాలు వెనుకపడేలా చేసిందని చెప్పుకోవచ్చు.
యువత, మేధావి, ప్రభుత్వాల దృష్ట్యా ::
కొన్ని సర్వేల ప్రకారం రాయలసీమలో నిరుద్యోగిత రేటు 72% శాతం గాను, అక్షరాస్యత రేటు 67% వద్ద ఉంది. యువత కూడా చాలా వరకూ తమ విద్య అభ్యసించండం అయిపోగానే ఉద్యోగాల వేటలో పడుతున్నారు. కానీ, చాలా వరకూ పారిశ్రామికవేతల్లాగా ఎదగలేకపోతున్నారు. ప్రభుత్వాలు, నాయకులు విఫలం అయితే ప్రశ్నించాల్సిన రాయలసీమ మేధావులు కూడా మూగబోతున్నట్టు అనిపిస్తోంది. వారి మౌనం వెనుక కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు ఉండచ్చు, ఉండకపోవచ్చును. ఇపుడు జరిగే కొన్ని అనార్థాలకు మేధావులు ప్రశ్నించకపోతే మరో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాలు తప్పవేమో అనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా వలసలు ఆపి, వలసదారులకు సరియైన ప్రోత్సాహకం అందించడంలో విఫలం అయ్యాయని చెప్పుకోవచ్చు. యువతకు పారిశ్రామికంగా ఎదుగదల, రైతులకు సబ్సిడీల ద్వారా కొత్తరకం పంటలను పరిచయం చేయడం, స్త్ర్రీలకు కుటీర పరిశ్రమలు అందించకపోవడం వల్ల కూడా రాయలసీమ కాస్త వెనుకబడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి, ప్రజల జీవనాధారంగా పారిశ్రామికం పెంపొందించి రాయలసీమ అభివృద్దికి పాటుపడాలని కోరుకుంటున్నాను.
~ నరేష్ సాకే