సత్తెనపల్లి మున్సిపాలిటీ స్థానిక శాసనసభ్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని, అర్ధరహితమైనవని నియోజకవర్గ జనసేన నాయకులు, ప్రముఖ న్యాయవాది కొమ్మిశెట్టి వెంకట సాంబ శివరావుగారు అన్నారు. ఆయన మాట్లాడుతూ అంబటి ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్తెనపల్లిని అభివృద్ధి చేయటానికి అది “ఒక పల్లెటూరు కాదు.. ఒక పట్టణం కాదు”అని వ్యాఖ్యలు చేయటమే కాకుండా అవమానకరంగా మాట్లాడటం చూస్తుంటే అవగాహన లేమిగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ పట్టణాన్ని పల్లెటూరుతో పోల్చిన అంబటిని ఈ నియోజకవర్గ ప్రజలు ఎలా ఎన్నుకున్నారో వారికే తెలియాలని ఆయనన్నారు. సత్తెనపల్లి గ్రామ పంచాయతీగా వున్నప్పుడే శాత వాహన నూలు మిల్లుపరిశ్రమలు బస్ స్టేషన్ తదితర సంస్థలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అనాటి శాసనసభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఈ గ్రామాన్ని మున్సిపాలిటీ చేయించారని, అనంతరం ఎన్నోఅభివృది కార్యక్రమాలు జరిగి నేడు జిల్లాలోనే ఒక ప్రత్యేకతను చాటుకున్న ఈ పట్టణంపై ఎమ్మెల్యే అంబటి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. కోడెల హయాంలో జరిగిన అభివృద్దిని చూసైనా రాంబాబు కసితో పనులు చేయాల్సిందిపోయి ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. గత ప్రభుత్వహయాంలో జరిగిన అభివృద్ధి రాష్ట్రానికి వన్నె తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది శిక్షణా కేంద్రం, కేంద్రీయ విద్యాలయం, మోడల్ పోలీస్‌స్టేషన్, వావిలాల పార్క్, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తారకరామసాగర్ నిర్మాణం, స్టేడియం, గెస్ట్‌హౌస్‌లు, రోడ్లవిస్తరణ, రైల్వేస్టేషన్ రోడ్డు ,ప్రభుత్వ భవనాలు, ఇలా అనేక పనులు జరిగి నేడు అభివృద్ది చెందిన పట్టణాల్లో ఒకటిగా విరజిల్లుతున్న సత్తెనపల్లి పట్టణంపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు.