“ మొండివాడు రాజుకన్నా బలవంతుడు అనేది సామెత. అదే మొండివాడే రాజయితే? ”
ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి సంపూర్ణ ఆధిపత్యం రాకూడదేమో! ఒకవేళ వచ్చినా చట్టసభలలో బలమైన ప్రతిపక్షం తప్పనిసరిగా వుండి తీరాలి, లేకపోతే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లాగే తయారవుతుంది. 2019 లో గౌ| శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేశాక అందరినీ ఆకర్షించింది ఆయన నియమించిన ప్రభుత్వ సలహాదారులు. అత్యధిక మొత్తంలో గౌరవ వేతనాలు ఇచ్చి పెద్ద సంఖ్యలో నియమించిన సలహాదారులు ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు అని అందరూ ఆశించారు. అయితే ఓం ప్రధమంగా ఈ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే, మునుపటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ అనే కట్టడాన్ని కూల్చివేయడం. విమర్శలు ఎదురైనా సరే కృష్ణా నది కరకట్టపైన వున్న అక్రమ కట్టడాలని సమూలంగా నిర్మూలించి ఓ క్రొత్త వొరవడికి శ్రీకారం చుడుతున్నారని అందరూ ఆనందపడ్డారు. తీరా చూస్తే ఆ ఒక్కటీ తప్ప ఈనాటి వరకూ మరో కట్టడం కదపలేదు. గత పాలకులపై వ్యక్తిగత పగలే తప్ప చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వచ్చాయి. అనుభవజ్ఞులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు సలహాదారులుగా వుండి యిలాంటి పనులు ఎలాచేస్తున్నారు అనే వ్యాఖ్యలూ వినవచ్చాయి.
అయితే అక్కడితో ఆగలేదు, ఈ ప్రభుత్వం చేసే అవకతవక పనులని కొందరు కోర్టుకి వెళ్లి ఆపగలిగారు, కొన్నిసార్లు కోర్టులే స్వయంగా కలుగజేసుకొని నివారించాయి. ముప్పయి మందికి పైగా సలహాదారులని నియమించి వారికి నెలనెలా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని చెల్లిస్తున్న ప్రభుత్వం, ఈ ఏణ్ణర్ధంగా చూసుకుంటే నూటికి పైచిలుకు సార్లు కోర్టులతో మొట్టికాయలు తినడం అనేది దేశంలోనే ప్రప్రధమం. ప్రతీ సందర్భాన్ని ప్రస్తావించడం కుదరదు కనుక కొన్ని ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వ మూర్ఖ మొండి వైఖరి పరిశీలిద్దాం.
1. ప్రభుత్వ ప్రజా ఆస్తులకి పార్టీ రంగులు వేయడం :
గతంలో కొన్ని ప్రభుత్వాలు తమ పార్టీ రంగులని స్ఫూరించేలాగా కొన్ని కొన్ని చోట్ల రంగులేయించుకొనేవారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వాటర్ ట్యాంకులు, అన్నా కాంటీనులు లాంటివి ఈ విషయంలో విమర్శలకు గురైనాయి. ఈ ప్రభుత్వం వారు, ప్రభుత్వ కార్యాలయాలు మొదలుకొని గాంధీ విగ్రహాలకు, స్కూళ్లకు, స్మశానాలకు, ఆఖరికి చెత్త కుప్పలకు కూడా తమ పార్టీ రంగులు పులిమేశారు. అడిగిన ప్రతీవారిని గత ప్రభుత్వం ఇదే పని చేస్తే ఎందుకు అడగలేదు అని ఎదురుదాడి చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ సామజిక వుద్యమకారుడు, రైతు ముప్పా వెంకటేశ్వర రావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ రంగులు వేయడానికి దాదాపు 1300 కోట్లు ఖర్చయ్యాయని ఒక అంచనా. కోర్టు ప్రశ్నలకు జవాబిస్తూ అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గత ప్రభుత్వం ‘అన్న కాంటీన్ల’కు, పల్లపాడు పంచాయితీ భవనానికి పసుపు రంగు వేశారని తెలిపారు. ధర్మాసనం ఈ విషయంపై తుది తీర్పు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదిరోజుల్లో రంగులు తొలగించాలని, రాజకీయ పార్టీల రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ పెద్దలు హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ అవే రంగులని ఆమోదించాలని సుప్రీ౦ కోర్టుకు వెళ్లారు. బెంచ్ లో వున్న న్యాయమూర్తి నాగేశ్వరరావు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను వుద్దేశించి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ కాషాయ రంగు వేయడానికి అనుమతిస్తారా అని ప్రశ్నించారు. తుషార్ మెహతా అటువంటివేమీ చేయబోమని తెలిపారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అటువంటిపని ఎలాచేస్తుందని వాఖ్యానించి ఆ పిటిషన్ ను కొట్టివేశారు.
తదుపరి పరిణామాలలో ఇంకొక రంగుని జతచేసి ఇప్పుడు పార్టీ రంగులు కావు అని మభ్య పెట్టే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆదేశాల్ని మరొక్కసారి హైకోర్టు కొట్టేసింది, ప్రభుత్వం ఇంకోసారి సుప్రీం కోర్టుకి వెళితే అక్షింతలు వేసి నాలుగువారాల్లో తొలగించాలని జూన్ లో ఆదేశించింది. కట్ చేస్తే ఈ రోజుకీ వార్డు సచివాలయాలకి, ఇతర కార్యాలయాలకి అవే రంగులు చూడవచ్చు. ఎవరేమన్నా ఎంత ఛీత్కరించినా మొండిగా సిగ్గూ లజ్జా వదిలేసి ప్రవర్తించడం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకి భంగమే.
2. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తొలగించడం:
2004 లో యునెస్కో వారు విడుదల చేసిన రిపోర్టులో ప్రాధమిక విద్యాభ్యాసం పిల్లల మాతృభాషలో చేస్తే వారి మేధోవికాసం, అవగాహనాశక్తి మరింత మెరుగ్గా వుంటాయని తెలిపారు. మన దేశంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ప్రైవేటు స్కూళ్లలో కూడా తెలుగు మాధ్యమం వుండేది. దురదృష్టవశాత్తూ యిప్పుడు కనబడడంలేదు. మనకున్న పరాయిభాషాభిమానం కారణంగా ఇంగ్లీషు అనేది అవసరానికంటే కూడా హోదాకి, దురహంకారానికీ చిహ్నంగా మారిపోయింది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన సంపన్న దేశాలలో చాలావరకు విద్యాభ్యాసం తమ మాతృభాషలోనే జరుగుతుంది. ఉదాహరణకి చైనా, జపాన్, కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా మొదలైన దేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కూడా వారి మాతృభాషలోనే జరుగుతుంది. అంతెందుకు ఉత్తరాది విద్యార్థులు సివిల్స్ పరీక్షలు తమ మాతృభాషలో వ్రాసి విజయం సాధించడం సర్వ సాధారణం.
గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అధికారంలో వున్న వైకాపా వారు అప్పట్లో పెద్ద ఎత్తున గొడవ చేసి తమ మౌత్ పీస్ సాక్షిలో ఇంగ్లీషు మీడియం వలన విద్యార్ధులకి జరిగే నష్టంపై ప్రచారం చేశారు. కానీ తాము అధికారంలోకి రాగానే మొత్తం అన్ని పాఠశాలల్లో తెలుగుమీడియంను తొలగించి ఇంగ్లీషు మీడియం పెట్టేశారు. తలిదండ్రుల్లో ఎక్కువమందికి ఇంగ్లీషు మాధ్యమం అంటే మోజున్న మాట వాస్తవం. కానీ తెలుగు మీడియంలోనే చదవాలనుకుంటున్న విద్యా ర్థుల్ని, వారి తలిదండ్రుల్ని బలవంతంగా ఇంగ్లీషులోకి నెట్టకండి అని మేధావులు, రాజకీయా వేత్తలు, విద్యావంతులు, తలిదండ్రులు చేస్తున్న వేడికోళ్ళని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
పైగా మీపిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? అంటూ అర్ధం లేని యెదురు దాడికి తెగబడింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆ రకంగా వితండవాదం చేయడం బాధాకరం. ఏ మాధ్యమంలో చదువుకోవాలో విద్యార్థులూ వారి తలిదండ్రులూ నిర్ణయించుకోవాలిగానీ జగనో పవనో కాదు అన్న ఇంగితం కరువైపోయింది. అధినేత నుండీ వారి సోషల్ మీడియా ప్రతినిధులవరకూ అడిగిన ప్రతి ఒక్కరిపైనా వ్యక్తిగత దాడులకి వ్యక్తిత్వ హననానికీ పాల్పడ్డారు. ఇదే విషయం పై గత ప్రభుత్వంమీద తీవ్ర విమర్శలు చేసిన బాషా సంఘం అధ్యక్షుడు ఇప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం అత్యంత విచారకరం. కాగా యధావిధిగా కోర్టు ఈ నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. ప్రభుత్వం అత్యుత్సాహంతో పుస్తకాలు ప్రచురించడం లాంటివి చేస్తే ఆ ఖర్చులు సంబంధిత అధికారినుంచి రికవరీ చేస్తాం అనికూడా హెచ్చరించింది. దీనికి బదులుగా తమ సాక్షిలో ప్రభుత్వం సర్వే చేసిందని ఒకసారి, ప్రైవేటు సంస్థతో సర్వే చేయించామని ఒకసారి ప్రజలు ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా వున్నారని నమ్మశక్యం కాని అంకెలతో ప్రచారం చేసింది. కరోనా లాక్ డౌన్ లో సర్వేలు ఎవరు ఎక్కడ చేసారు అంటే సమాధానము వుండదు. ఇక్కడ మరొక్క ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకూ వున్న ఉపాధ్యాయులు తమ కెరియర్ అంతా తెలుగు మాధ్యమంలోనే బోధన చేశారు. వారిలో అత్యధికులు తెలుగు మీడియంలోనే చదువుకున్నవారు. వారిని వున్నపాటుగా కొద్దిపాటి ట్రైనింగ్ యిప్పించి ఆంగ్లంలో చదువు చెప్పమంటే ఏం చెబుతారు? కొత్తగా ఒక్కరిని కూడా ఇంగ్లీషు మాధ్యమంలో బోధించడానికి నియమించకుండా యెలా కానిచేద్దామనుకుంటున్నారు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం వుండదు. ఇప్పటికీ కొన్ని ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో చదువుకొని అటు తెలుగూ ఇటు ఇంగ్లీషూ రెండూ సరిగా రానివారిని చూస్తున్నాం.ప్రాక్టికల్గా ఇన్ని ఇబ్బందులున్నా ప్రభువులు మూర్ఖంగా మొండిగా ముందుకే పోతున్నారు. భువులు మూర్ఖంగా మొండిగా ముందుకే పోతున్నారు.
3. స్థానిక సంస్థల ఎన్నికలు :
గతేడాది రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎలెక్షన్లకి నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియ మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాలూ ఏకగ్రీవంగా అధికారపార్టీకే రావాలని జగన్ రెడ్డి తమ పార్టీ శ్రేణులను ఆదేశించారు. రాష్ట్రం మొత్తం చూస్తుండగానే కిడ్నాపులు చేసి, బెదిరించి, నామినేషన్ పత్రాలు ఎత్తుకుపోయి, కొన్నిచోట్ల కొట్టి మరీ ఇంకెవరినీ నిలబడనీయకుండా ఏకగ్రీవాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రముఖ పర్యావరణ వేత్త, జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య వంటివారు ప్రత్యక్షంగా చూసి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేక పోయింది. SEC కూడా ఈ ఫిర్యాదులని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కొరోనా ప్రబలడం దేశవ్యాప్తంగా ప్రధాని లాక్ డౌన్ ప్రకటించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ అధికారి వీటిని దృష్టిలో వుంచుకొని ఎన్నికలని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం అధికార పార్టీవారికి నచ్చలేదు. బహుశా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యర్ధులని భయపెట్టి సాధించుకున్న ఏకగ్రీవాలు పోతాయనేమో.
మొదటగా ముఖ్యమంత్రి ఎన్నికల సంఘంపై యుద్ధం ప్రకటించారు. SEC కులాన్ని లాగి ప్రతిపక్ష నాయకుడితో సంబంధం అంటగట్టి బురద చల్లారు. ఎలెక్షన్లు పూర్తి చేసేయవచ్చు కొరోనా భయం లేదు అని వాదించారు. పైపెచ్చు SEC అధికారాలపైనా ఆరా తీశారు. తాను అత్యధిక మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రిని నాకువిలువ లేదా అని బాధపడ్డారు. షరా మామూలుగానే కోర్టులకెక్కారు, అక్షింతలు వేయించుకున్నారు.
ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ఇలా ఎన్నో విషయాలలో మొండిగా మూర్ఖంగా ఎవరేమనుకున్నా ఫర్వాలేదనే ధోరణిలో ఈ ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఇలా యెంతకాలం జరుగుతుందో చూడాలి అని ప్రజలు అనుకుంటున్నారు.
By
శ్రీకాంత్
ట్విట్టర్ ఐడి : @sree_n_r