భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విరాట్ తన యో- యో(yo -yo test) స్కోర్‌ను ఆన్‌లైన్‌లో పెట్టడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న భారత జట్టుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో ప్లేయర్లకు బోర్డు యో-యో టెస్టు నిర్వహించింది. ఇందులో పాస్ అయినట్టు కోహ్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దాంతో పాటు తనకు వచ్చిన స్కోరును కూడా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో బీసీసీఐ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తి చేసినట్లు ఓ అధికారి తెలిపారు. అధికారిక సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తేటతెల్లం చేయడం తగదని కోహ్లీని హెచ్చరించినట్లు ఆ అధికారి పేర్కొన్నారు.
‘జట్టుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించకూడదు. శిక్షణ సందర్భంగా దిగిన ఫొటోలను కొందరు ప్లేయర్లు అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో పాటు యో – యో టెస్టు స్కోరు వివరాలు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది బీసీసీఐ కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం. ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చాం’ అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఆసియా కప్‌లో భారత జట్టు వచ్చే నెల 2న తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే!
దుష్ప్రచారంతో…
ఈ నెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. దాంతో, ఎన్‌సీఏలో ఆటగాళ్లకు యో – యో టెస్టు నిర్వహించారు. గురువారం టెస్టుకు హాజరైన కోహ్లీ తనకు 17.2 పాయింట్లు దక్కాయని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. దీంతో బోర్డు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత జట్టుకు ఎంపిక కావాలంటే యోయో టెస్టులో 16.5 పాయింట్లు సాధించాలి. ఫిట్‌నెస్‌లో అందరికీ ఆదర్శంగా నిలిచే కోహ్లీకి 17.2 పాయింట్లు రావడంతో మిగిలిన ప్లేయర్లు ఈ టెస్టులో పాస్ కాలేదనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఈ నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.