ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమస్యకు మూడు రాజధానుల విధానం విరుగుడా? వినాశనమా? అన్నది కాసేపు కూలంకుషంగా మాట్లాడుకుందాం…
ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ,గుడిలాంటి అసెంబ్లీలో అమరావతి రాజధానిగా మాకు ఆమోదయోగ్యమే, మూడు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడం, ప్రాంతీయ విభేదాలు సృష్టించడం ఇష్టం లేదని అందుకే జగన్ రెడ్డి తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి, గెలిచాక మూడు రాజధానులు అంటూ మాట మార్చడం శాసన సభను అవమానించినట్లే… శాసన సభ విశిష్టతను, గౌరవాన్ని దెబ్బతీయడమే. అసెంబ్లీలో ఇచ్చిన హామీలే నిలబెట్టుకోకపోతే ఇక విశ్వసనీయత ఎక్కడ ఉంది? పరిపాలన అంటే అసెంబ్లీ, చట్టసభలు, హైకోర్టు, పరిపాలన విభాగాలు ఇవన్నీ కలిపితే దాన్ని ప్రభుత్వం అంటారు. మరి ఈనాడు ఈ మూడింటిని ఏ మూల కామూల విడదీసి పరిపాలన చేస్తామంటే అది హాస్యాస్పదం, తెలివి తక్కువ తనానికి నిదర్శనం..
భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ కన్నా భౌగోళికంగా ,జనాభా కన్నా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాలు వేటికి ఆ అవసరం రాలేదు, మరీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఎందుకు వస్తోంది? ఇంత పెద్ద దేశానికే రెండో రాజధాని లేదు. అలాంటిది ఒక చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా? దేశంలో అన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రం హైకోర్టుని సపరేటుగా రాజధాని నగరం నుంచి కాకుండా వేరుగా పెట్టలేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రం హైకోర్టు ను వేరే ప్రాంతంలో పెట్టి, అవసరాల కోసం, ప్రజల సౌకర్యం కోసం వివిధ ప్రాంతాల్లో అదనపు బెంచ్ లను ఏర్పాటు చేసుకున్నారే తప్ప హైకోర్టును, రాజధాని గురించి విడదీయలేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేయలేదు, కానీ హైకోర్టు బెంచ్ లను మాత్రం ఏర్పాటు చేసుకున్నాయి. అంటే ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉంది. అలాగే పాలన సౌలభ్యం కోసం, ప్రజల అవసరాల దృష్ట్యా అదనంగా ఒకటి, రెండు బెంచ్ లను ఏర్పాటు చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 4 రాష్ట్రాలకు ఒకటే హై కోర్టు ఉంది. మిగతా రాష్ట్రాల్లో కేవలం బెంచ్ లు మాత్రమే ఉన్నాయి.
ముఖ్యంగా కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ. ఇప్పటికే మన రాష్ట్రం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. పైగా అధికార వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచారు. ఆ విధంగా ప్రభుత్వానికి భారం పెరిగింది. కొత్తగా ఏర్పరిచిన జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేక, గెస్ట్ హౌస్ లోనూ, హోటల్లోనూ, కళ్యాణ మండపాల్లోనూ కార్యాలయాలని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల అంత అవసరం లేదు. వాటి వల్ల వాటికి అంత ఆవశ్యకతలేదు.
ప్రతి గ్రామపంచాయతీ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకన్నా వికేంద్రీకరణ ఏముంటుంది? ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఈ తరుణంలో మూడు రాజధానులు ఏర్పాటు ఏమాత్రం ఏర్పాటు అవుతుంది? ప్రభుత్వమంటే చట్టాలు చేసే శాసనసభ, వాటిని అమలు చేసే ప్రభుత్వ అధికారులు, న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండడానికి హైకోర్టు ఈ మూడు ఎక్కడ ఉంటే అదే రాజధాని. ఇదే మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు కూడా చెప్పారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తాము, అక్కడి నుండినే పాలిస్తాము అని జగన్ రెడ్డి సెలవిచ్చారు. విశాఖ ఆర్థికంగా ఎదుగుతున్న పట్టణం, వాణిజ్యపరంగా, దేశ రక్షణ, భద్రత పరంగా విశాఖ నగరం చాలా ప్రాముఖ్యత కలిగినది. రాష్ట్రంలోనే ఎక్కువ జనాభా ఉన్న నగరం. అలాంటి నగరంలో ఉన్నపళంగా పరిపాలన రాజధాని చేస్తాము అంటే భద్రత పరంగా చాలా ఒత్తిడి ఉంటుంది. కొత్తగా మౌలిక సదుపాయాలు కోసం భూసేకరణ చేయాలి. భవనాలు నిర్మించాలి. రాష్ట్ర ఖజానాకు అదనపు మోయలేనంత భారం. ఇప్పటికే అమరావతిలో భవనాలు ఉన్నాయి. విశాఖలో మళ్ళీ అంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.
ఇప్పటికే జరగాల్సిన వికేంద్రీకరణ జరిగిపోయింది. కొత్తగా మూడు రాజధానుల వలన కలిగే పరిపాలన సౌలభ్యం కంటే వచ్చే నష్టాలే ఎక్కువ. విశాఖ లాంటి నగరాలను ఆర్థిక రాజధాని లాగా, వాణిజ్య రాజధానిగా ఉంచి, అభివృద్ధి చేస్తే చాలు. దేశంలోనే ఒక గొప్ప నగరం అవుతుంది. ఇక్కడ నుండి అక్కడకు తరలివెళ్ళి ఒత్తిడి పెరగడం తప్ప ఉపయోగం లేదు. అధికారం పూర్తిగా కేంద్రీకృతమైనా సమస్యే. అధిక మోతాదులో వికేంద్రీకరణ చేసినా సమస్యే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెంచిన జిల్లాల మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు. రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఇచ్చారు. అక్కడ ఏ మాత్రం కుంభకోణం జరిగి ఉన్నా బయటకు వెలికి తీయడం పెద్ద కష్టమేమీ కాదు. రాజధానిగా అమరావతిను ప్రకటించే 6 నెలల ముందు నుండి అక్కడ జరిగిన భూ క్రయవిక్రయాలు పరిశీలిస్తే చాలు. ఎవరు కొన్నారు అన్నది తెలిసిపోతుంది. మరి ఇంత తెలిసిన జగన్ రెడ్డికి ఇది కూడా తెలియదా? నెలకు 4 లక్షలు ఇచ్చి మరీ వందలమంది సలహాదారులు నియమించుకున్నారు మరి వారికి కూడా తెలియదా?
అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది, నిధులు ఇస్తోంది. మరి ఇప్పుడు మూడు రాజధానులు అంటే నిధులు ఇస్తుందా? సీఎం మారిన ప్రతిసారీ రాజధాని మారుస్తుంటే పాలన ఏమవ్వాలి? 5 ఏళ్లలో చంద్ర బాబు ఏమి చేయలేదనే కదా జగన్ రెడ్డి ను సీఎంగా చేశారు. మూడున్నర యేళ్లు అవుతున్నా ఇంకా రాజధాని నగరం మీద ఒక స్పష్టత లేదు. స్పష్టంగా ఒక ప్రాంతాన్ని రాజధానినీ చేసిన తర్వాత కూడా మూడు రాజధానులు అంటూ నాటకాలు ఆడుతున్నారు. ప్రాంతీయ విబేధాలు సృష్టించి ప్రజల మనోభావాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అనిశ్చితిని తీసుకొచ్చారు.
మన దగ్గర ఆర్థిక వనరులు లేవు. ఏడాదిలో 365 రోజులకు గాను కనీసం 1 నెల కూడా RBI లో కనీస నిల్వలు కూడా మెయింటైన్ చేయలేని ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా? జగన్ రెడ్డి కుటుంబం దాదాపు యాభై ఏళ్లుగా పులివెందులకు ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ కనీసం బస్టాండ్ కూడా కట్టించలేదు. 16 మెడికల్ కాలేజీలు, కడప లో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన రాళ్ళు వేశారు, మరి పనులు ఏమాత్రం చేశారు. కనీసం ఒక ఇటు కూడా వెయ్యలేదు. ఇలాంటి తరుణంలో మనకు కావల్సినది మూడు రాజధానులా ???
ప్రభుత్వం నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోవడం హైకోర్టులో వాటి మీద పిటిషన్లు వేయడం, తదుపరి హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టడం ఇదంత సర్వసాధారణ౦ అయిపోయింది. కోర్టు అసెంబ్లీకి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది. సాక్షాత్తు అసెంబ్లీలో ఇచ్చిన మాటకే విలువ లేనప్పుడు, నిలకడ లేని సీఎం, మొండి వైఖరి ఇలాంటివి అన్నీ అభద్రత భావాన్ని తీసుకొచ్చారు. జుట్టున్న ఆవిడ ఎన్ని రకాల కొప్పులైనా వేస్తుంది, మరీ అరువుకు విగ్గు తెచ్చుకున్న ఆవిడ వేయాలంటే అవుతుందా? అవసరానికి మించిన అధికార వికేంద్రీకరణ రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ మీద దృష్టి సారించాలని ఆశిస్తున్నారు.