
రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం చింతలపల్లిలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నదని రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్మించడంతో పాఠశాల శిధిలమైనదని అన్నారు. పాఠశాలలో 96 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. అప్పుడప్పుడు పాఠశాలపై కప్పు పెంకులు ఊడి పడిపోతుండడంతో భయం భయంగా విద్యార్థులు గడుపుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. శిథిలమైన పాఠశాలలోనే క్లాసులు కొనసాగుతున్నాయని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని వాపోయారు. పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.