కరోనా నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా?
– విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ముఖ్యమంత్రికి దూరదృష్టి లేదు
– జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
విజయవాడ, (జనస్వరం) : కరోనా థర్డ్ వేవ్ అందోళనకరంగా ఉందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విద్యా సంస్థలను కనీసం ఈ నెలాఖరు వరకూ మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ బారి నుంచి కాపాడుకోగలమని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం – కేసులు పెరిగితే చూద్దామని చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యాన్ని తెలియచేస్తోందని తెలియజేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేదనే విషయం అర్ధమవుతోందన్నారు. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికీ విద్యా సంస్థలను మూసివేసి ఆన్టైన్ విధానంలో తరగతులు నిర్వహణపై మార్గదర్శకాలు ఇచ్చాయని, ఆ మాత్రం దూరదృష్టి కూడా ఏపీ సీఎంకి లేకపోయిందన్నారు. రోజుకి 4 వేలకుపైగా కొత్త కసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయని, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయన్నారు. రోజువారీ పాజిటివిటీ రేట్ 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయాన్ని విస్మరించవద్దని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను స్కూల్స్, కాలేజీలకు పంపించడం రిస్క్ అవుతుందన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి- వ్యాక్సిన్లు ఇస్తున్నాం కాబట్టి స్కూల్స్ తెరుస్తామంటున్నారు. 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ మన రాష్ట్రం కంటే మహారాష్ట్రలో ఎక్కువ మందికి వేశారు. అక్కడే విద్యా సంస్థలను మూసివేశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోనూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు విద్యార్ధుల క్షేమం కోసం సెలవులు పొడిగించాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకొనే వైద్య కళాశాలల్లోని విద్యార్ధులే కోవిడ్ బారిన పడుతున్నారు. మరి స్కూల్ పిల్లల పరిస్థితి ఏమిటి? ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో భౌతిక దూరం అమలు చేయడం లేదు. పాఠశాలల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచడం లేదు. అలాంటప్పుడు స్కూల్స్ తెరవడం సమంజసమా? ఇప్పటికిప్పుడు విద్యా సంస్థలు తెరవాలి… పరీక్షలు నిర్వహించాలనే మొండి ధోరణిని విడిచిపెట్టి విద్యార్థుల సంరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆయన తెలియజేశారు.