అనంతపురం, (జనస్వరం) : విద్యార్దుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా SSBN విద్యా సంస్థల యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు సరైందీ కాదని జనసేన నాయకులు మండిపడ్డారు. మంగళవారం SSBN విద్యార్థులకు మద్దతుగా జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి మాట్లాడుతూ… SSBN కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. వేలాది మంది విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసిన ఈ కళాశాల కరవు జిల్లా విద్యార్థులకు కల్పతరువు అన్నారు. చదువుల తల్లిలాంటీ ఈ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కళాశాల యాజమాన్య దుందుడుకు చర్యలకు విద్యార్థులతో కలిసి జనసేన కళ్లెం వేస్తుందన్నారు. అవసరమైతే జనసేనాని పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులకు జనసేన నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జనసేన నాయకులు జయరామి రెడ్డి, అంకె ఈశ్వరయ్య, లీగల్ సెల్ అధ్యక్షులు జీ. మురళీ క్రిష్ణ, చరణ్ తేజ్, ఎంవి శ్రీనివాసులు తదితర నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచీ కత్తుపై వారిని విడుదల చేశారు.