నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 226వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ నోబెల్ స్కూల్ వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది పింఛన్లను తొలగించడమే కాకుండా ఇప్పుడు ఆ తొలగింపులతో తమకు సంబంధం లేదన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల నుండి దిగువ శ్రేణి వైసీపీ నాయకుల వరకు ప్రతి ఒక్కరు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 5వేలకు పైగా పింఛన్లను తొలగించి ఇప్పుడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తనకు సంబంధం లేదన్నట్లు, రీసర్వే చేయాలి అంటూ డ్రామాలు ఆడుతున్నారని, సర్వే చేసింది వైసీపీ ప్రభుత్వమే కదా ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయాలా అని, ఇంకెన్ని పింఛన్లను ఎత్తేసేందుకు రీసర్వే చేయాలని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి జగన్ రెడ్డి గారు ఒక్క పింఛన్ కూడా తొలగించలేదని మాట్లాడడం, జిల్లా కలెక్టర్లకు బూతులు తిట్టండి అని హితవు పలకడం దేనికి సంకేతం అని అన్నారు. ప్రతి అంశంలో అవినీతివంతం అయిపోయిన ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఉచితాలకు డబ్బు సర్దలేక రాష్టాన్ని దివాళా తీయించిందని, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వేరే దారులు లేక వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.