• వందలో పాతిక మందికి ఉంగరాలిచ్చి అదే అభివృద్ధి అని మభ్యపెడుతున్నారు
• ప్రభుత్వ విధానాలు.. నేతల తీరు సుప్రీం కోర్టు న్యాయమూర్తి నుంచి పదేళ్ల కుర్రాడి వరకు
చికాకు తెప్పించాయి
• సంక్షేమం-అభివృద్ధి పక్క పక్కన ఉంటేనే సుపరిపాలన
• వైసీపీ నాయకులకు సమస్యల గురించి మాట్లాడడం తెలియదు
• మాట్లాడితే అరుపులు, కేకలు, బూతులు
• పాచి మాటలు మాట్లాడేవారికి పేస్ట్, మౌత్ వాష్ పంపండి
• పోస్కోని కొరియా నుంచి రాష్ట్రానికి పిలిపించింది ఎవరు?
• స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచింది మీరు కాదా?
• మనం సమస్యల గురించి మాట్లాడితే వ్యక్తిగత దాడులు చేస్తారు
• మనం మాత్రం గీత దాటవద్దు.. దాటనివ్వ వద్దు
• విశాఖ రూరల్ నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విశాఖపట్నం, (జనస్వరం): సుపరిపాలన అంటే అభివృద్ధి-సంక్షేమం పక్క పక్కన ఉండాలనీ, సంక్షేమంమాత్రమే చేస్తాం.. అభివృద్ధిని పక్కన పెట్టేస్తాం అంటే అది సుపరిపాలన అవ్వదనీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రహదారులు, వ్యవసాయం లేని ఊర్లు, కర్మాగారాలు, కార్యాలయాలు లేని పట్టణాలు ఉండి మీ చేతికి ఒక నవతర్న ఉంగరం తొడిగి మీ కష్టాలు తీరిపోతాయంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. వందలో పాతిక మందికి నవరత్న ఉంగరాలు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం అదే అభివృద్ధి అంటోందన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి నుంచి పదేళ్ల కుర్రాడి వరకు చికాకు తెప్పించే స్థాయికి వైసీపీ ప్రభుత్వ
విధానాలు, నేతల తీరు ఉన్నాయన్నారు. సోమవారం సాయంత్రం విశాఖ జిల్లా రూరల్ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “ఒక్క బ్రిడ్జి శంకు స్థాపన చేసి అద్భుతాలు చేశామంటూ పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. వైసీపీ నాయకులకు సమస్యల గురించి మాట్లాడడం తెలియదు. వారికి తెలిసింది ఒకటే అరుపులు, కేకలు, బూతులు. సమస్యలు గురించి మాట్లాడితే నానా పాచి మాటలు మాట్లాడుతున్నారు. అలా పాచి మాటలు మాట్లాడే నాయకులకు ఒక్కటే చెప్పండి. మార్కెట్లోకి ఈ మధ్య కొత్తగా డెటాల్ పేస్ట్, ఫినాయిల్ మౌత్ వాష్ వచ్చిందని చెప్పండి. ప్రజా సమస్యల పట్ల బాధ్యత ఉన్నవాడు, ధైర్యం ఉన్న వాడే రాజకీయాల్లో ఉండాలి. స్టీల్ ప్లాంట్ అనేది మన అస్థిత్వ పోరాటం. మనది అనుకున్నాం కాబట్టే వచ్చాం. ఉద్దానం సమస్య మనది అనుకున్నాం కాబట్టే వచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 32 మంది యువకులు ప్రాణ త్యాగం చేస్తే ఉక్కు పరిశ్రమ వచ్చింది. అలాంటి పరిశ్రమ ప్రైవేటుపరం అయిపోతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? పోస్కోని కొరియా నుంచి ఎవరు పిలిపించారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచింది మీరు కాదా?
• వైసీపీ నాయకులకు ఎవ్వరూ భయపడవద్దు
మనం సమస్యల గురించి మాట్లాడితే వారు వ్యక్తిగత విమర్శలు చేస్తారు. మన దృష్టిని మళ్లించేందుకే వారి ప్రయత్నం అంతా. వారు చేసే పిచ్చి విమర్శలను మనం మంచి భాషను ఉపయోగించి తిప్పికొట్టాలి. ఈ మధ్య మార్కెట్లోకి డెటాల్ పేస్టు, ఫినాయిల్ మౌత్ వాష్ వచ్చింది. పిచ్చ విమర్శలు చేసే వారికి అది పంపితే నోరు కడుక్కుంటారు. వారు వ్యక్తిగతంగా విమర్శలు చేసేది మనకు కోపం తెప్పించడానికే. మనం మాత్రం గీత దాటవద్దు. సహనం కోల్పో వద్దు. వారిని ఆ గీతలోకి తీసుకురండి. అర్జునుడి చందంగా మనం లక్ష్యాన్ని గురిపెట్టాలి. మన లక్ష్యం ఒక్కటే వారి దోపిడిని అరికట్టడం. జనసైనికులు ఎవ్వరూ వైసీపీ నాయకులకు భయపడవద్దు. మన సమూహ బలం ముందు వారి గూండాల బలం పెద్దది ఏం కాదు. మనం ఒక్కసారి తిరిగి చూస్తే వారు కాలిపోతారు.
• డేగకన్నుతో ప్రజల ఆస్తులు కాపాడాలి
ప్రజాస్వామ్యంలో దోపిడిని అరికట్టాలంటే ప్రతి నిమిషం డేగ కన్నుతో పహారా కాయాలి. ప్రజా స్వామ్యంలో స్వేచ్చ ఉంటుంది కాబట్టి ఆదమరిస్తే ఎక్కువ తినేస్తారు. ప్రజల ఆస్తులు దోచుకోకుండా మనం నిరంతరం డేగ కన్ను వేయాలి. ఒక్క పిలుపుతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం లక్షన్నర మంది వచ్చారు. మీలో వార్డు నుంచి దేశాన్ని శాసించే నాయకులు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ను ఎవరు వచ్చి తీసుకువెళ్లగలరు? వైసీపీకి 22 మంది ఎంపీలు ఉంటే రఘురామ కృష్ణం రాజు గారు తప్ప మిగిలిన వారు బయటకు వచ్చి మాట్లాడరు. వారంతా తెరవెనుక మాట్లాడుతారు. అయినా ఎవర్నీ మనం వ్యక్తిగతంగా విమర్శించ వద్దు.
• మన బలం వారికి తెలుసు
మనకున్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ 152 ఎమ్మెల్యేగా మారిపోయినప్పుడు కేంద్రం హోంశాఖ మంత్రి నాకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇస్తారు? మీ బలం చూసి ఇస్తారు. వారంతా క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేసి వచ్చారు. వారికి మన బలం అర్ధం అవుతుంది. మనం అదే స్ఫూర్తితో బలమైన ప్రభుత్వం స్థాపించాలంటే క్రమశిక్షణ అవసరం. గీత దాటని రాజకీయాలు చేయడం అవసరం. పోరాటం ప్రత్యర్ధిని బట్టి చేయాలి. ఆంధ్రప్రదేశ్ అంటే 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు కాదు. ఐదున్నర కోట్ల మంది ప్రజలు. మనమనంతా టాక్సులు కడితే దాని మీద పాలకులు బతుకుతున్నారు. మన టాక్సుల మీద బతుకుతూ మన జీవితాలను నలిపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? రాజ్యాంగం మీద గౌరవం అంటే శ్రీ అంబేద్కర్ గారికి దండలు వేస్తే సరిపోదు ఆయన ఆశయాల్ని నిలబెట్టాలి.
ఉత్తరాంధ్రలో కమిటీలు మీ అందరి ఆమోదంతోనే కమిటీలు వేస్తాం. పార్టీ తరఫున ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడిస్తాం. పని చేసే వారిని గుర్తిస్తాం. విశాఖ రూరల్ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో 70 శాతం మంది ఆమోదంతోనే కమిటీల జాబితా విడుదల చేస్తాం. ఒక్క పిలుపుతో లక్షన్నర మంది జనం వచ్చినప్పుడు వైసీపీని ఓడించాలంటే మనలో నుంచి బలమైన నాయకులు బయటకు రావాలి.
• మనల్ని అడ్డుకునేందుకు ఒక్కటైపోతారు
కొత్త పార్టీ వస్తుంటే అప్పటికే ఉన్న వారు ఎందుకు రానిస్తారు. అవసరం అయితే మనల్ని దెబ్బ కొట్టడానికి ఇద్దరూ కలసి పోతారు. జనసేన పార్టీకి ఉన్నది చెట్లకు బుల్లెట్లు ఎందుకు పూయవు అని ఆలోచించే నవతరం. పార్టీ తరఫున మేము మీకు అండగా ఉంటాం. సమస్యల నుంచి పారిపోవద్దు. అంచెలంచెలుగా పార్టీ నిర్మాణం చేపడదాం. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే కొంత మంది మన దగ్గరకు వచ్చారు. ముందు ముందు ఇంకొంత మంది మన దగ్గరకు వస్తారు. బేధాభిప్రాయాలు వీడి కలసికట్టుగా ముందుకు వెళ్లాలి. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం అనే జనసేన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ప్రతి ఒక్కరికీ మన ఆంధ్రులు అనే భావన అవసరం. ఏ సభ నడిపినా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. జై ఆంధ్ర నినాదాలు మరువొద్దు అని అన్నారు.
• కష్టకాలంలో నిలబడిన వారికే భవిషత్తు: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంత అంధకారంలోకి తీసుకువెళ్తుంది అన్న విషయం జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా ప్రజలందరికీ అర్ధం అయ్యింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి శ్రమదాన కార్యక్రమంతో రాష్ట్రంలో పరిస్థితులు దేశం మొత్తం అందరికీ తెలిశాయి. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే.. ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, 6 లక్షల కోట్ల అప్పులు తప్ప ఏమీ కనబడడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలను సైతం బ్యాంకులకు తాకట్టు పెట్టేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా మనం ఎదగాలి అంటే క్లిష్ట పరిస్థితుల్లో మనం బయటకు వచ్చి నిలబడాలి. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి బలంగా నిలబడాలి. కష్టకాలంలో నిలబడిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. చిత్తశుద్దితో, నిజాయితీగా రాజకీయాలు చేసిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఒక మంచి లక్ష్యంతో చేపట్టిన సభ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటారు. మీ మీ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న సభలు నిర్వహించి క్షేత్ర స్థాయిలో సమస్యలపై పోరాటం చేయండి” అన్నారు.
• ప్రమాదంలో మృతి చెందిన క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి పరిహారం
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించారు. అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన పార్టీ క్రియాశీలక కార్యకర్త శ్రీ పిల్లా శ్రీను ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన భార్య శ్రీమతి పిల్లా సూర్యకుమారికి క్రియాశీలక సభ్యులకు అందచేసే బీమా పథకం కింద రూ. 5 లక్షల చెక్కును శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందచేశారు. ప్రమాదంలో గాయపడిన చోడవరం నియోజకవర్గానికి చెందిన జనసైనికులు శ్రీ పడాల సత్తిబాబు. శ్రీ వీసం రవిలకు మెడిక్లయిమ్ చెక్కులు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్, శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి పాలవలస యశస్విని, పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కరరావు, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ గడసాల అప్పారావు, శ్రీ బోడపాటి శివదత్, శ్రీమతి దుర్గా ప్రశాంతి, పార్టీ నాయకులు శ్రీ సందీప్ పంచకర్ల, శ్రీ వంపూరి గంగులయ్య , శ్రీ పీవీఎస్ఎన్ రాజు, శ్రీ రాజాన సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.