ప్రజాస్వామ్య బద్ధంగా అధికారం చేపట్టి ప్రజలను పాలించటం అంటే బటన్ నొక్కి ఖాతాల్లో డబ్బులు వేయటం అనుకుంటున్నారు నేటి పాలకులు.
ఏరు దాటేదాక ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య’ అన్నట్లు ఓట్లను నోట్లతో కొని సంపాదించిన అధికారం ప్రజలను అవసరం తీరాక పట్టించుకోవటం లేదు. కోట్ల ప్రజల ఆకాంక్షలు ఆశలు అడియాసలే.
పరిపాలనలో తప్పులను లోపాలను గత ప్రభుత్వాల తప్పులుగా నెత్తివేయటం ప్రశ్నిస్తే పాలన యంత్రాంగంలో పదవులు నిర్వహిస్తున్న మంత్రులు, వారి సామంతులు, వంది మాధి గదులు నోటికి వచ్చినట్లు తిట్టడం, ఒకరి మీద ఒకరు బురద జల్లటం ఆనవాయితీ అయింది. పరిధులు దాటి పదవుల స్థాయి మరిచి బూతుల పంచాంగం అందుకొని విలువ పోగొట్టుకుంటున్నారు.
కళ్ల ముందు ఏ తప్పు జరిగినా, అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించే తత్వం ఉండి తీరాలి. రాజకీయ నాయకులు అర్హత ఉంటేనే పదవుల్లో ఉండాలని నిలదీసే ధైర్యం, వందల వేల కోట్లను స్కాములు చేస్తూ ప్రజాధనాన్ని మింగేస్తూ, అన్యాయంగా దోచేస్తుంటే చూస్తూ ఉండటం అవివేకం అవుతుంది.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలు, విధి విధానాలు, వ్యవస్థల్లో లోపాలను ప్రశ్నిస్తే, ప్రశ్నించినా వారిపై పగ బట్టి కక్ష్య తీర్చుకుంటున్నారు. ఇదేమని అడిగితే అరెస్టులు చేస్తున్నారు. ఎవరో ఒకరు పూనుకొని ప్రశ్నించకపోతే నియంతృత్వమే అవుతుంది కానీ ప్రజాస్వామ్యం కాదు. ప్రశ్నించాల్సిన ప్రత్యర్ధి పార్టీలు, బాధ్యత గల పౌరులు మౌనంగా ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రశ్నించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కోలేక చాలామంది నిశ్శబ్దంగానే ఉంటున్నారు. అందరూ నాకెందుకు అనుకుంటే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. కాబట్టే పాతికేళ్లు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో, కొత్త తరం రాజకీయ శక్తిగా ఎదుగుతున్న జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, తప్పులుంటే వెల్లడి చేస్తూ, నిజాలను నిగ్గుతేలుస్తూ ప్రభుత్వానికి ప్రత్యర్ధిగా మారింది. ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ కొనసాగాలంటే మరో రాజకీయ పార్టీని ఎదగనివ్వదు. కానీ ఎన్ని రకాల సమస్యలు సృష్టించినా, అవరోధాలు సృష్టించి అడ్డుకున్నా ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంది.
ఏ తరహా యుద్ధమైనా చేయటానికి సిద్ధం అంటూ నిరంతర పోరాటం చేస్తూనే ఉంది. దాడులు చేసినా, జైలుకు పంపినా, కేసులు పెట్టినా నిర్భయంగా నిజాలను వెలికితీస్తూనే ఉంది. విధానాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తూ విలువలు మరిచి విజ్ఞత లేకుండా పరుష పద జాలం ఉపయోగించటం. ప్రజోపయోగమైన అభివృద్ధి చూపలేరు కానీ పనికిరాని వితండవాదం చేస్తారు. ఆఖరికి ముఖ్యమంత్రి సైతం తన స్థాయిని మరిచి జనసేన పార్టీని రౌడి సేన అని సంభోదించటం అనుచితం.
అసమర్ధ పాలన కొనసాగిస్తూ, అప్పులు కుప్పలుగా చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ఆర్భాటాపు ప్రచారాలు చేయటం తప్ప ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక మాటలు, చేతల ఎదురు దాడులు. ప్రభుత్వాధినేత మొదలు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన 151 మందిలో నేర చరిత్ర లేని వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అసలు నేర చరిత్ర అనేది వైసీపీలో అదనపు అర్హతగా మారిపోయింది. ఆర్ధిక నేరాలకు గాను 16 నెలలు జైలు శిక్ష అనుభవించి , బెయిలుపై ఎన్నికల్లో అధికారం చేపట్టి, వారం వారం కోర్టు వాయిదాలు ఏదో ఒక కారణం తో గైర్హాజరు అయ్యే ముఖ్యమంత్రి , ప్రజల కోసం ప్రజా క్షేత్రంలో తన దైన శైలితో ప్రస్థానం సాగిస్తూ జనసేన పార్టీ ప్రజాదరణ పొందుతుంటే జీర్ణించుకోలేక ఇలాంటి తప్పుడు ప్రేలాపనలు చేస్తూ గడిపేస్తున్నారు.
అన్యాయం జరిగితే ఆగేది లేదు అసహాయులకు అండగా ఉంటూ ప్రశ్నించే హక్కును దెబ్బతీయడానికి పాలకవర్గాలు ఎంత ప్రయత్నించినా ఎక్కడా రాజీ పడకుండా తమ లక్ష్య సాధన లో నిమగ్నమై పోరాడుతూ సాగుతోంది.. జనసేన
తూర్పు దిక్కు ఎరుపెక్కి
మార్పు కొరకు తల ఎత్తి
ప్రశ్నించే హక్కే ఈ జనసేన
కళ్ళు తెరిచి ఎలుగెత్తి
కుళ్ళు కడగా యువశక్తి
నిలదీసే హక్కే ఈ జనసేన