– సర్వేపల్లి నియోజకవర్గంలో కలకలం
– మొదట పార్టీ కార్యాలయం వద్ద కటౌట్ల చించివేత
– ఇప్పుడు జాతీయ రహదారి పక్కన ఉన్న కటౌట్ల తొలగింపు
– ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
సర్వేపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే భయపడుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆయన బ్యానర్లు కటౌట్లకు సైతం వణుకుతోంది. బ్యానర్లు ఎక్కువ కనబడితే ముఖ్యమంత్రికి ప్లాస్టిక్ హోర్డింగుల మీద నిషేధం గుర్తుకు వచ్చినట్టు.. సర్వేపల్లి నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ కటౌట్లు చూస్తే అధికార పార్టీ నాయకులకు అనుమతులు, అడ్డంకులు గుర్తుకువస్తున్నాయి. ఈ నెల 8వ తేదీ సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయానికి సమీపంలో రెండు భారీ కటౌల్లు పార్టీ నాయకుడు బోబ్బేపల్లి సురేష్ ఏర్పాటు చేశారు. అదే రోజు మరో రెండు కటౌట్లు విక్రమ సింహపురి యూనివర్శిటీ సమీపంలో జాతీయ రహదారి పక్కగా ఏర్పాటు చేశారు. 10వ తేదీ గుర్తుతెలియని దుండగులు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కటౌట్ చించివేశారు. ఈ వ్యవహారంపై బోబ్బేపల్లి సురేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతాం అని కూడా చెప్పలేదు. గురువారం జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన కటౌట్ల మీద కూడా కన్ను పడింది. ముగ్గురు వ్యక్తులు ఆ కటౌట్లు తొలగిస్తుండగా.. అటుగా వెళ్తున్న వారు వీడియోలు చిత్రించి జనసేన నాయకులకు పంపారు. ఈ వ్యవహారం మీద జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇది వైసీపీ శ్రేణుల పనేనని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించకపోవడం వల్లే ఇప్పుడు ఉన్న కటౌట్లు కూడా బహిరంగంగా తొలగించారని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు సమాన హక్కులు ఉంటాయని, పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరించరాదని అంటున్నారు. జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి తో కలసి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని.. స్పందన రాని పక్షంలో కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.