వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీలో వైసీపీకి ఘోర ఓటమి తప్పదు
-గత ఎన్నికల్లో నాటి పరిస్థితుల దృష్ట్యా మాకు వచ్చిన ఓట్లు ఐదున్నర వేలు మాత్రమే
-కానీ వచ్చే ఎన్నికల్లో మా మెజార్టీనే ఐదున్నర వేలతో మొదలవుతుంది
-అభద్రతాభావంలో ఉన్న వైసీపీ నాయకులు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా లాభం లేదు
-ఎలా పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, పొత్తులు ఉండాలా వద్దా అనేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇష్టం
-మాకు సలహాలివ్వడం ఆపి సీఎం జగన్ రెడ్డి గారికి 45 స్థానాలు కాకుండా ఎక్కువ స్థానాల్లో గెలవాలంటే ఏమి చేయాలో సలహాలివ్వండి
-పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ (జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 127వ రోజున 50వ డివిజన్ సంతపేటలోని కామాక్షి నగర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 45 నుండి 67 స్థానాల వరకే పరిమితం కానుందని అన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 127 రోజుల పాటు సుమారు 35 వేల ఇళ్ళకు పైగా తిరిగి చేసిన అధ్యయనంలో వైసీపీ పై తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని అన్నారు. పవనన్న ప్రజాబాటలో ప్రతి రోజూ అనేకమంది ఈ ప్రభుత్వం వల్ల తమకు కలుగుతున్న సమస్యలను, కష్టాలను వివరిస్తున్నారని, ఈ అంశంలో అనుమానం ఉన్న వారెవరైనా తన సోషల్ మీడియా ఖాతాల్లో పొందుపరిచిన లైవ్ వీడియోలలో ప్రజల స్పందనను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలుస్తున్నారని, తమను అపూర్వంగా ఆదరిస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అప్పటి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లు ఓటుకు నోటు ఇస్తూ విపరీత ధన ప్రవాహం మధ్య, ఓటుకి ఒక్క రూపాయి కూడా పంచకపోయినా ఐదున్నర వేల ఓట్లు వేసి జనసేన పార్టీని ఆశీర్వదించారని, కానీ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ మెజార్టీనే ఐదున్నర వేల ఓట్లతో మొదలవుతుందని కేతంరెడ్డి ధీమా వ్యక్తం చేసారు. నెల్లూరు సిటీలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని, ప్రజలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించినా కనీస అభివృద్ధి చేయకపోవడం, పేదలకు ఇచ్చిన మాటమీద నిలబడక పోవడం, ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా నిరుపేదల గూడుని కూల్చి కోట్ల రూపాయలతో సొంత ఇంటిని నిర్మించుకోవడం, విల్లాలను కొనడం, మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని 500 కోట్లకు పైగా దోచుకోవడమే కారణాలని అన్నారు. ఈ రోజు రాష్టంలో అభద్రతాభావంలో ఉన్న పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు తమ నాయకులు పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, వాటి వల్ల వాళ్ళకు టైమ్ బొక్క తప్పించి ఒరిగేది ఏమీ లేదని, రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని వైసీపీ ఏనాడో కోల్పోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, పొత్తులు ఉండాలా వద్దా అనేది తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇష్టమని, పవనన్న వ్యూహాల ప్రకారమే ప్రతి ఒక్కరం పనిచేస్తామని అన్నారు. తమకు సలహాలివ్వడం మాని వచ్చే ఎన్నికల్లో 45 స్థానాలకు పరిమితం కాకుండా ఏమి చేస్తే కొన్ని ఎక్కువ స్థానాలు వస్తాయో సీఎం జగన్ రెడ్డి గారికి సలహాలివ్వండని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు ఈసారి ఎన్ని పన్నాగాలు పన్నినా, కుట్రలు చేసినా, దుష్ప్రచారం చేసినా, ప్రజలందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఆపడం ఎవరితరం కాదని, అందుకు తగ్గ వ్యూహాలు తమవద్ద ఉన్నాయని, వైసీపీ మంత్రులు, నాయకులు ఏడుపులు ఆపి రాష్ట్రాభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.