పోలవరం నుండీ పట్టిసీమ వరకూ, సీమ నుండి శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ వరకూ ప్రతీ వ్యవస్ధలో విఫలమైన చంద్రబాబు పాలన పట్ల విసిగిపోయి, పవన్ గారు ప్రత్యామ్నాయం ఇస్తానన్నా నమ్మక, 151 సీట్లిచ్చి అఖండ మెజారిటితో గెలిపించిన జగన్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఆయన చెప్పిందేమిటీ, చేస్తుందేంటీ ?
మొట్టమొదట చేసిన హామీ : ” వృద్ధాప్య ఫించన్ పెంపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో రాగానే ఫించన్ ను 3000/- చేస్తానని మాటిచ్చారు. కానీ సంతకం చేసింది. ప్రతీ ఏడాది 250/- చొప్పున పెంచుకొంటూ 3000/- చేస్తానని అన్నారు. పాలి “ట్రిక్స్” మరి! జగన్ గారు చెప్పినట్టుగా పెంచిన ఫించన్, 2019 లో 2250/-, 2020 లో 2500/-, 2021 లో 2750/-, 2022 మే కల్లా 3000/- కావాలి. ఇప్పుడు 2500/- మాత్రమే ఇస్తున్నారు. సీయం జగన్ చేసిన “ఫించన్ పెంపుపై మొదటి సంతకానికి” అసలు విలువే లేకుండా పోయిందా? “మాట తప్పను మడమ తిప్పను” ఉత్తుత్తి మాటలే అయ్యాయిగా! “పెన్షన్లను మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్, ఏటా రూ.250 మాత్రమే పెంచుతానని ముందే ఎందుకు చెప్పలేదని పవన్ కళ్యాణ్ గారు 2019 జూలై లోనే గట్టిగా ప్రశ్నించారు. కనీసం, “సంవత్సరానికి 250/- ఫించను పెంపుపై మొదటి సంతకం” హామీ అమలు చేశారా అంటే.. ఆ హామీ పావురాల గుట్టలో అడ్డంగా పేల్చేసారు.
రెండో హామీ : మద్యపాన నిషేధం దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఒరిజినల్ గా చేసింది, బెల్ట్ షాపులు మూయించడం, ప్రభుత్వం చేతుల్లోకి మద్యపానం అమ్మకాలు, అధికారంలోకి వచ్చాక 2024లో సంపూర్ణ మద్యపాన నిషేధం అవ్వనిదే, ఓట్లు కూడా అడగనని సీయం అన్నారు. కానీ, మద్యం ఆదాయం మీదే ఎక్కువగా ఆధారపడ్డ ఈ పభుత్వం, మద్యం మీద పదేళ్లలో రాబోయే ఆదాయాన్ని గ్యారంటీగా చూపించి, వేల కోట్లు అప్పు చేసేసింది. “మద్యపాన నిషేధం” అనే హామీని తుంగభద్ర వరదల్లో కలిపేసింది. 2019 జూలైలో “మద్యపాన నిషేధం చెయ్యలేరు. అమలు చెయ్యలేని హామీలు ఎందుకివ్వాలి?” అనీ పవన్ గారు గట్టిగా ప్రశ్నిస్తే, డిప్యూటీ సీఎం నారాయణ మాట్లాడుతూ “మేం మద్యపాన నిషేధం చేయనిదే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగం! ఆయన తాగే బ్రాండ్ దొరకవు, తాగి ఎక్కడ పడిపోయాడో!” అంటూ పవన్ కళ్యాణ్ గారి పట్ల అసభ్యంగా వ్యాఖ్యానించారు. మూడేళ్లైనా మద్యపాన నిషేధం అంటూ, అమ్మల, అక్కల ఓట్ల కోసం, అమలుకాని హామీలిచ్చి మోసం చేసిన వైసీపీ నాయకులు “తాగి ఎక్కడ పడిపోయారో” అనీ సభ్యత గల మనం అడగలేం! చెప్పేదీ, చేసేదానికి పొంతన ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అందుకే అన్నారు .. “వైసీపీ మాటలకు, అర్థాలు వేరులే!” అని.
మూడో హామీ : కేంద్రం మెడలు వంచైనా, ప్రత్యేక హోదా తీసుకు వస్తాం! ఈ హామీ ముఖ్య ఉద్దేశ్యం, ఎన్ని ఎక్కువ యంపీ సీట్లు నెగ్గితే, అంత ఎక్కువగా కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చని, వీలైతే తన మీదున్న కేసులు కూడా కొట్టేయించుకోవాలని… వైసీపీ నేతలు అనుకున్నట్లు ఎక్కువమంది అభిప్రాయం. నరేంద్ర మోడీ గారికి దక్కిన అఖండ విజయంతో వైసీపీ నేతల లెక్కలు తారుమారయ్యాయ.! కనీసం పొత్తైనా పెట్టుకోవాలని చూసిన వైసీపీ నేతలను ఛీ పొమ్మని, నిఖార్సైన నేత పవన్ గారితో పొత్తుకు సై అనీ మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. వైసీపీ వారికొచ్చిన 22 యంపీ సీట్ల విలువను అమాంతం తగ్గించి, ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీతో జతకు సై అంది మోడీ ప్రభుత్వం. బ్లాక్ మెయిల్ చేద్దామనుకున్న వైసీపీ నేతలు, తామే బ్లాక్ మెయిల్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీ ప్రభుత్వం తెచ్చే ఏ బిల్లైనా, లోక్ సభ లో తానా తందానా అనీ, ఆంధ్రాలో మాత్రం నిప్పులు కక్కుతూన్నట్టుగా మీడియా ముందు నటిస్తున్నారు! మెడలు వంచుతానన్నది ఉత్తర కుమారుడి ప్రగల్భాలేననీ, గత మూడేళ్లుగా చూస్తూనే ఉన్నాం!
నాలుగో హామీ : పారదర్శక పాలన వంద కోట్లు దాటిన ఏ టెండర్ అయినా హైకోర్టు మాజీ జడ్జీ దగ్గరకు న్యాయ సమీక్షకు వెళుతుందని, పబ్లిక్ డొమైన్ లో వారం రోజుల పాటు రివ్యూ కోసం ఉంచుతామని చెప్పారు. వాస్తవానికి ఎన్ని ఇలా జరిగాయి అన్నది, పబ్లిక్ ముందు ఎన్నుంచారు అన్నది మూడేళ్లలో ఎవ్వరికీ తెలియదు. ప్రభుత్వ జీవోలతో, వ్యక్తి మీద కోపం ఒక వ్యవస్థ మీద ఎలా చూపించాలో నేర్పించింది జగన్ ప్రభుత్వం. “వకీల్ సాబ్” సినిమా రిలీజ్ కు ముందు రోజు రాత్రి వదిలిన జీవో, “భీమ్లా నాయక్” సినిమా వదిలిన రెండు వారాల దాకా మార్చలేదు. పైగా సినిమా థియేటర్ల మీద MRO ల నుండీ పోలీసుల దాకా, వ్యవస్ధలో ఉన్నవారిని వాడుకొని, దాడి చేయించిన చరిత్ర. ఫలితంగా పదుల్లో థియేటర్లు మూత బడ్డాయి. బఠానీల రేట్లకు సినిమా టికెట్లను అమ్ముకోలేక, కరోనాతో ముందే కుదేలైన థియేటర్ల యాజమాన్యాలు, వందల్లో తమ దియేటర్లను మూసి వేశాయి. దాంట్లో పనిచేసే కార్మికులను రోడ్డున పడేసాయి. ఇదంతా కేవలం, ఒక్క వ్యక్తి మీద కోపంతో చేశారు. దారుణమైన విషయం ఏంటంటే, జీవోలను పబ్లిక్ డొమైన్ నుండి పూర్తిగా తొలగించడం. పారదర్శక పాలన అన్నది ఒట్టి భ్రమే అనీ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రో కో కేసుల్లో 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చిన జగన్ నుండి ఇలాంటివి ఎంతమాత్రం ఆశించకూడదని ప్రజలకు మరోసారి తెలిసి వచ్చింది. ప్రజలు చూడాల్సిన అతి ముఖ్యమైన జీవోల పేరుతో ఎవరెవరికి ఏమేం కేటాయించుకున్నారు అన్నది ఆ యేసు క్రీస్తుకే ఎరుక!
అయిదో హామీ : క్విడ్ ప్రో కో పాలసీ జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, సీయం చంద్రబాబు చేసిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావ్ పై ఎత్తివేసిన కేసు గురించి తీవ్ర స్ధాయిలో మండి పడ్డారు. నిర్భయ కింద పెట్టిన కేసును ఎలా ఉపసంహరించాలని చూస్తారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకున్న నేతల్లో బాలకృష్ణ, కోడెల శివ ప్రసాద్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు కూడా ఉన్నారు. అధికారంలోకి రాగానే, తన సహచరులు 8 మందిపై కేసులు ఎత్తేయాలని జగన్ నిర్ణయించారు. పనిలో పనిగా, తన మీదున్న 11 కేసుల్ని ఎత్తి వేయించేసుకొన్నారు. గౌరవ హైకోర్టు జోక్యంతో 6 కేసులు, ప్రస్తుతం రివ్యూలో ఉన్నాయి. గౌరవ కోర్టు జడ్జీల మీద, జగన్ గారి అనుచరులు రెచ్చిపోవడం వెనుక ఒక కారణం ఇది. కేసుల ఎత్తివేత ప్రతిపాదనల్లో ఉన్న నాయకులు : మిథున్ రెడ్డి, జక్కంపూడి రాజా, గంగుల బ్రిజేంద్ర నాథ్ రెడ్డి, వై ఎస్ అవినాష్ రెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి. పేర్ని నానీ గారు ఊరికే అనలేదు, “నేను జగన్ పాలేరు”ననీ!
To be Continue…. వచ్చే వారం
– టీం నారీస్వరం