గతవారం ఆర్టికల్ కొనసాగింపు :
ఇసుక పాలసీ : చంద్రబాబు ప్రభుత్వం “ఇసుక” పాలసీ తో చేసిన మాఫియా అంతా ఇంతా కాదు. చింతమనేని లాంటి మాజీ ఎమ్మెల్యేల చేతిలో ఇసుక మాఫియా నడిపించి, అడ్డుకున్న అధికారులను బెదిరించి, ఎక్కడ పడితే అక్కడ, ఇసుకను రవాణా చేసి అడ్డంగా సంపాదించారు. రాష్ట్రం మొత్తంలో పది వేల కోట్ల రూపాయలకు పైగా ఇసుక దోపిడీ జరిగిందనీ భోగట్టా. చంద్రబాబు వాటా ఎంతుందో ఆకు రౌడీ అనీ పవన్ గారు ముద్దు పేరు పెట్టిన చింతమనేని చెప్పాలి. ఈ ఇసుక అక్రమ తవ్వకాలపై, మొదటి నుండి పోరాడింది జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మరియు ఇతర రాజధాని ప్రాంత రైతులు. వీరి పోరాటానికి స్పందించిన జాతీయ హరిత ట్రిబ్యునల్, చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమంగా తవ్వేసారని, దానివల్ల నదీ పరివాహక ప్రాంతం దెబ్బ తిన్నదని వారి నేతృత్వంలో జరిగిన ఎంక్వైరీ కమిషన్ తేల్చి చెప్పింది. వందకోట్ల రూపాయలు, నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
ఇలా ఫైన్ గా వేసిన డబ్బు, ఇసుక మాఫియా నేతల నుండి కాకుండా వైసీపీ ప్రభుత్వం, ప్రజలు కట్టిన పన్ను డబ్బుల నుండే చెల్లించడం దారుణమైన విషయం. అప్పటికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో కొచ్చింది. వచ్చీ రాగానే, అప్పటి వరకూ ఉన్న ఇసుక పాలసీని పూర్తిగా రద్దు చేసి, ఎలాంటి పాలసీ ప్రకటించకుండా, ఆరు నెలలు వృధాగా కాలం వెళ్ళబుచ్చి, రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. సుమారు రెండు లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్న భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది. ఒక పాలసీ సరిగ్గా లేకపోతే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో తెలియవచ్చింది. ఇది గమనించిన జనసేనాని భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా “లాంగ్ మార్చ్” నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు. భవన నిర్మాణ కార్మికుల వెతలు, యావత్ ఆంధ్ర దేశం మొత్తం తెలిసేలా ధవళేశ్వరం కవాతు జయప్రదంగా నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, కవాతు ను జయప్రదంగా నిర్వహించారు. ఈ కవాతు తో దిగొచ్చిన ప్రభుత్వం, ఇసుక పాలసీను తీసుకు రావడానికి దోహదం చేసింది. కానీ మళ్లీ అదే తప్పుల తడకగా ఇప్పటికీ సరైన “ఇసుక పాలసీ”ను తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. పైగా తనకు అనుకూల సంస్థ కు ఇసుక రీచ్ లు మొత్తం గంపగుత్తగా కట్టబెట్టేసి ఒక రకమైన దోపిడీకి తెర లేపింది. ఒకప్పుడు ఐదు వేలకు దొరికే లారీ ఇసుక, నేడు పాతిక వేలకు చేసి, దిగువ – మధ్య తరగతి ప్రజల నెత్తిన పెనుభారం మోపిన మహా పాపం, ఈ వైసీపీ ప్రభుత్వానికే చెందుతుంది.
పోలవరం ప్రాజెక్టు: చంద్రబాబు ప్రభుత్వం ఓటమి పాలవ్వడానికి ఇసుక మాఫియా ఒక కారణమైతే, పోలవరం అక్రమ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరిట, అప్పటి యంపీ రాయపాటి వాళ్ల చేతుల్లో వందల వేల కోట్ల కాంట్రాక్టులు ఉదారంగా ఇచ్చేలా చూడడం మరో కారణం. సుమారు పదహారు టన్నుల మట్టి ఒక స్కూటీ నంబర్ పైన రవాణా చేసినట్టు, దానికి బిల్లులు పెట్టీ అడ్డంగా దండుకొన్నట్టు, విచారణ చేసిన సీబీఐ అధికారులు పేర్కొన్నారు అంటే… పోలవరం పేరిట ప్రజల జేబులకు ఎంత పెద్ద స్ధాయిలో కన్నం పెట్టారో అర్థం చేసుకోవచ్చు. తెదేపా నేతలకు పోల”వరం”, కనక వర్షం కురిపించింది. వైసీపీ అధికారంలోకి రాగానే పోలవరం రివర్స్ టెండర్ పేరిట కాంట్రాక్టులు నవయుగ నుండీ తన అనుకూల సంస్థ మేఘా కృష్ణా రెడ్డి పేరిట కట్టబెట్టడంతో మరొకసారి పోలవరం మళ్లీ అధికార పక్షానికి పోల”వరం” అయ్యింది. 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తానని అసెంబ్లీలో తొడకొట్టిన అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఈగలు కొట్టుకుంటున్నారు. పోలవరం ఎంతవరకు వచ్చిందయ్యా అని ప్రస్తుత మంత్రి అంబటి నడిగితే, స్పిల్ వే రక్షణ గోడ వరదలకు కొట్టుకు పోయిందని, దానికి రెండు వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని, ఎప్పటికి పూర్తవుతుందనే విషయం తన దేవుడు జగన్ కు కూడా తెలీదని సెలవిచ్చారు. ఇంతకు ముందు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఇవేవీ తెలియకుండానే, 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తవుతుందనీ ఎలా చెప్పారు? పోలవరం ప్రాజెక్టు తన చేతుల్లో తీసుకున్న మేఘా సంస్థ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ ను నిశితంగా పరిశీలించకుండా నే ఎలా బిడ్డింగ్ వేసింది? రెండు వేల కోట్ల నష్టం చేకూర్చిన పోలవరం ప్రాజెక్టు పనులకు బాధ్యులెవరు? ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడంలో నేతలు ఇంత నిర్లిప్తత, ఇంత నిర్లజ్జగా ఎలా ఉండగలిగారు? పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చెయ్యడంలో విఫలమవ్వడానికి, పోలవరం పేరిట ప్రజల సొమ్ము దోచుకోవడానికి రెండు పార్టీల నేతలు కారణమయ్యారు. ఇది, ప్రస్తుత జగన్ ప్రభుత్వ ఉదాసీనతనో లేక కావాలని చేసిందో కాలమే తేల్చాలి. పోలవరం నిర్వాసితుల బాధలపై పవన్ గారు ప్రభుత్వానికి చేసిన సూచనలు, వారిని ఆదుకోవాలని చెప్పిన మాటలు.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు పెడ చెవిన పెట్టడం బాధాకరం!
పైవన్నీ చూస్తే.. మనం ఒక మాట చెప్పొచ్చు, ఆంధ్రా ప్రజల పరిస్దితి, పెనం మీద నుండీ పొయ్యలో పడ్డట్లుగా మారిపోయింది. చంద్రబాబు పోయి, బాబుకి అప్డేటెడ్ వెర్షన్ గా చంద్రబాబు2.0 ప్రభుత్వం వచ్చినట్లయింది. ఇద్దర్నీ సమాన దూరంలో ఉంచాల్సిన అవసరం విజ్ఞులైన ఓటర్లకు ఉంది.