అనంతపురం, (జనస్వరం) : అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ విధానం రద్దు చేస్తాం, ఏ ప్రభుత్వం చేయని విధంగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు మాట తప్పింది, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం మోసపూరిత చర్యగా జనసేన భావిస్తోంది. ప్రతి ఉద్యోగి పిఆర్సి ద్వారా జీతం పెరుగుతుందని భావిస్తారు. ఈ రోజున వైసిపి నాయకులు ఆదాయం మూడు రెట్లు పెరిగితే ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గాయి. అధికారంలోకి వచ్చేందుకు సిపిఎస్ రద్దు చేస్తామని జీతాలు పెంచుతాం అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లింది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన అనంతరం పిఆర్సి సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులతో ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత ఇచ్చినటువంటి పిఆర్సి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లను తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి చేసింది. కనీసం ఆశుతోష్ మిశ్రా నివేదికను బయట పెట్టకపోవడం, ఫిట్మెంట్ ను 23 శాతం నుంచి ఏమాత్రం పెంచకపోవడం, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాల నుండి తగ్గించకపోవడం నిరుద్యోగులకు ఉద్యోగఅవకాశాలు దెబ్బతీయడమే, సిపిఎస్ రద్దు పైన అదేవిధమైన ధోరణి అవలంభించడం శోచనీయం. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గంపట్ల జనసేన పార్టీ సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ, వారి భావోద్వేగాలకు విలువ ఇస్తుంది. ప్రభుత్వం అహంకారం ధోరణితో ప్రవర్తిస్తూ ఇదేవిధంగా ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు అని జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాము అని అన్నారు.