
– పవనన్న ప్రజాబాటలో జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 98వ రోజున 13వ డివిజన్ యలమవారిదిన్నెలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పట్ల తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీలోని యలమవారిదిన్నె ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువుగా నివసిస్తున్నారని తెలిపారు. వీరి అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నిధులను కేటాయించకుండా పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల నుండి 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ లోన్లు రావాల్సి ఉన్నా, అర్హులకు అందడం లేదని, నిధులన్నీ ఉచిత పథకాల పేరుతో ప్రక్కదారి పడుతున్నాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో ఈ ప్రాంతంలో రహదారులు, మౌళిక సదుపాయాల అభివృద్ధి చేయాల్సి ఉండగా, అలా జరక్కుండా ఆ నిధులు కూడా ప్రక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం తలా 10 లక్షల రూపాయల సబ్సిడీ లోన్లు ఇస్తామని, ప్రతిభ కల్గి పరిశ్రమలు స్థాపించి పది మందికి ఉపాధి చూపగల ఎస్సీ ఎస్టీ యువతకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా తలా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.