మన భారతదేశంలో స్త్రీలు శక్తి స్వరూపిణులుగా భావిస్తారు. దేశాభివృద్ధికి స్త్రీలు ప్రతక్ష్యంగా, పరోక్షంగా నిలబడుతున్నారు. మనదేశంలో ముఖ్యంగా స్త్రీలు సాధిస్తున్న విజయాలు కోకొల్లలు. యువతను సక్రమ మార్గంలో నడిపించాలన్నా, విద్యాబుద్ధులు నేర్పాలన్నా స్త్రీ పాత్ర ప్రధానమైనది. నేటి సమాజ౦లో ప్రతి రంగంలో స్త్రీలు ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు. చదువుల్లో ఉత్తీర్ణత స్త్రీలదే పై చేయి. విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు చూపుతున్నారు. అంగన్వాడీ నుంచి అంతరిక్షం వరకూ అన్నిచోట్ల ఎంతో సహనంతో పనిలో నాణ్యత, చాకచక్యం కనబరుస్తున్నారు. దేశవిదేశాల్లో ఉన్నత చదువులు చదివి, అక్కడ ఉద్యోగాలు చేస్తూ, కొందరు వారి చదువును మనదేశానికే ఉపయోగిస్తూ స్వదేశంలో స్థిరపపడ్డారు. అన్ని౦టిలో ముందుకు పోతున్న స్త్రీలు, సమాజంలో పెరిగే చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. మత్తు పదార్థాలకు, స్వార్ధపూరిత వ్యామోహాలకు ఆకర్షితులు అవుతున్నారు. స్వేచ్చ కోసం కొందరు జీవనం సాగిస్తుంటే, స్వేచ్చను దుర్వినియోగం చేసుకుంటున్నారు. స్త్రీ లు తమ శక్తిని తెలుసుకుని, తమ శక్తితో దేశాన్ని, కుటుంబాన్ని, సంస్థలను ఉత్తమ స్థాయిలో నిలబెట్టవచ్చు. ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తూనే వుండాలి.
ఇంటిలో స్త్రీ పాత్ర : స్త్రీ ఇంటిలో ఆదిపరాశక్తి లాగా అందరికీ అన్నీ విధాలుగా సహాయపడాలి. అందరికీ భాధ్యతలు నేర్పించాలి. క్రమశిక్షణ, సాంప్రదాయం, సంస్కారం నేర్పాలి. ఇంటిలో వున్న ఆడవాళ్ళు వంటిల్లు మాత్రమే ప్రపంచం కాదు, ఇంటి పనులు చెయ్యటం మాత్రమే బాధ్యత కాదు. ఇంటిలో వాళ్ళకి బాధ్యతగా వుండటం కూడా నేర్పాలి. స్త్రీలు ఇంటిలో వారి ఆరోగ్యం చూసుకోవడం కాదు, తమ ఆరోగ్యాన్ని శ్రద్ధ వహించాలి.
" ఇల్లాలే ఇంటికి దీపం.
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. "
ఖాళీ సమయాల్లో చేతి వృత్తులు, కుట్టులు నేర్చుకుంటే, ఉపాధి కోసం కాకపోయినా, ఆపద వస్తే అవే ఆధారం అవుతాయి. చదువుకున్న గృహిణులు పుస్తకాలు చదువుతూ వుండాలి. మంచి విషయాలు, జ్ఞానాన్ని ఇచ్చే వీడియోలు చూస్తూ, వాటిల్లోని విషయాలను కుటుంబంతో పంచుకుంటూ, వాళ్ళు చెప్పే విషయాలు తెలుసుకుంటూ, ప్రపంచాన్ని ఇంటిలోనే తెలుసుకునే వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ఇంటి ఇల్లాలు, దేశానికి రైతు ఎంతో ముఖ్యమైన పాత్రలు. దేశానికి రైతు రాజు అయితే, ఇంటికి ఇల్లాలే రైతు. ఇంటిలో వుండే గృహిణులు ధాన్యం పడించిన రైతు లాంటివారు. ధాన్యం లేనిదే రోజు గడవదు. ఇంటిలో స్త్రీ భాధ్యతగా వుంటే, ఆ ఇల్లు ధాన్యాగారమే.
ఉద్యోగం/వ్యాపారం చేసే గృహిణి / స్త్రీ పాత్ర : ఉద్యోగం, వ్యాపారం చేసే స్త్రీలు అపరకాళీలుగా, ధైర్యంతో, సాహసంతో, సహనంతో, ఏ పరిస్థితులైనా ఎదుర్కునే శక్తిని గుండెల్లో నింపుకుని, సమాజం ముందు దృఢంగా నిలబడాలి. గృహిణులు ధాన్యం పండించే రైతు లాంటివారు. బయట ఉద్యోగం, వ్యాపారం చేసే ఇల్లాలు నిత్యావసరపు వస్తువులు, కూరగాయలు పండించే రైతు వంటివారు. ధాన్యం ఎంత అవసరమో, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అంతే అవసరం. ఉద్యోగం, వ్యాపారం చేసే స్త్రీల పాత్ర కూడా సమాజంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అందరూ ముఖ్యమే. అందరి పాత్ర ముఖ్యమైనవే. అటువంటి బాధ్యత వున్నవారు, ఆత్మస్థైర్యంతో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యానికి మించిన ఆర్థిక సంపద లేదు. ఆర్ధికంగా నిలబడాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనోధైర్యానికి ఖచ్చితంగా ధ్యానం, యోగా, వ్యాయామంలో ఒకటైన మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి జ్ఞానాన్ని, మెళుకువలు నేర్చుకోవాలి. ఉద్యోగంలో, వ్యాపారంలో నైపుణ్యత, క్రమ శిక్షణతో మెలగాలి. ఎక్కడ వున్నా మర్యాద అందుకునేలాగా స్త్రీలు వ్యవహరించాలి. వృత్తిలో ఎందులోనూ తక్కువ కాదు అన్నట్టు నిరూపించుకోవాలి. విలువలతో కూడిన నడవడిక సంస్థకు, కుటుంబానికి, దేశానికి గౌరవం తెస్తాయి. చదువుకునే అమ్మాయిలు, అర్ధిక స్వాతంత్రం వచ్చి, కొన్ని దుష్ప్రభావాలకు, వ్యసనాలకు, లోనవుతున్నారు. స్వేచ్చను దుర్వినియోగం చేసుకుంటున్నారు. చదువుకునే అమ్మాయిలు ఇంటిలో అందరితో కలిసి ప్రేమ ఆప్యాయతతో మెలగాలి. క్రమశిక్షణ, సంస్కారాలతో చదివిన చదువు రేపు నలుగురిలో ఉన్నతంగా నిలబెడుతుంది. ఇంటిలో బాధ్యతగా వుండటం, చదువులో చక్కని ప్రతిభ కనబరచడం బంధువులు సన్నిహితులతో కలివిడిగా మెలగడం చెయ్యాలి. ఆర్ధిక స్థోమత కలిగిన స్త్రీలు, అమ్మాయిలు తమ బాధ్యతగా కొందరి చదవులకు సహాయం చేస్తే, ఇంకొందరిని అర్ధికంగా నిలబెట్టినవారు అవుతారు. పెళ్లికాని యువతులు తమ అందాలను హరించే మోసపూరిత అబ్బాయిల వలలో పడకుండా, మిమ్మల్ని మీరు దృఢంగా, పవిత్రంగా వుంచుకోవాలని గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. స్వేచ్చ ఇద్దరికీ సమానమే అయినా, దానికి ఫలితం మాత్రం అనుభవించాల్సింది స్త్రీలే కాబట్టి, స్వీయ నియంత్రణ ఎప్పటికీ స్త్రీలకు కావాలి. అదే రక్షణ.
సామాజిక మాధ్యమంలో స్త్రీ పాత్ర : నేటి పరుగులు తీస్తున్న ప్రపంచంలో సామాజిక మాధ్యమాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అందులో చిన్నా, పెద్దా, తేడా లేదు. ఆడ, మగ బేధము లేదు. అందరూ వాడుతున్నారు. భారతదేశంలో స్త్రీలు అంటే పూజనీయులు. కానీ, నేటి మాధ్యమాలలో స్త్రీలను వారు వ్యాఖ్యానించే పదజాలం చూస్తే చాలా భాధకరంగా, అనైతికంగా వుంటున్నాయి. ఒకరు అసభ్య పదజాలం ఉపయోగిస్తే, నివారించటం రావాలి. స్త్రీలకు ఇక్కడ ఖచ్చితంగా సహనం, సభ్యత, సంస్కారం కాస్త ఎక్కువే వుండాలి. మృగాళ్ళను ఎదిరించాలంటే... ఒక విషయాన్ని అభిప్రాయాన్ని ఎవరైనా వ్యక్తపరచవచ్చు, కానీ, దానిని వాడే పదజాలమే మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. “ వాగ్భుషణం భూషణం ”
సామాజిక మాధ్యమాల్లో మంచి విషయాలను తెలుసుకోవడం. మంచి విషయాలను పంచడం. మాధ్యమాలను మంచి పద్ధతిలో ఉపయోగించుకోవడం, అందరికీ ఉపయోగపడే సమాచారం పంచడం, మంచి జ్ఞానం పంచుకుంటూ, ఇలాంటి మాధ్యమాలను ఎంతో సక్రమంగా ఉపయోగించవచ్చు. మనం ఎక్కడ వున్నాం అనేది కాదు. ఏం చేస్తున్నామో అదే మనం అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్త్రీగా పుట్టినందుకు సంతోషించు, ఒకరితో సంస్కారముగా ప్రవర్తిస్తున్నందుకు గర్వించు.
స్త్రీ అమ్మ పాత్రలో : అమ్మ కుటుంబంలో అత్యుత్తమ పాత్ర. అందరినీ ఒక బంధంగా కలిపి వుంచుతుంది. పిల్లలు అందరికన్నా ఎక్కువ దగ్గరగా, తనదిగా అనుకునే మనిషి ముందు అమ్మ తరువాతే మిగిలినవారు.అలాంటి బంధాన్ని, చిన్నప్పటి నుంచి అమ్మగా పిల్లలను పెంచే విధానమే, పిల్లలు పెరిగి ఒక వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటారు. పిల్లలు పెంపకంలో అమ్మ పాత్ర స్త్రీ జీవితంలో అత్యుత్తమైనది, అమూల్యమైనది. ఆడపిల్లల పెంపకంలో బయట ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలి. ధైర్యంగా, ఆత్మాభిమానంతో, సఖ్యతగా వుండటం నేర్పాలి. మగపిల్లలకు ఇంటిలో, బయట స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి, ఎంత మర్యాదగా వ్యవహరించాలి, స్త్రీని వేరే దృష్టితో చూడకూడదు అనే ఆలోచనలు నింపాలి. ఒక పిల్ల, ఇద్దరు, ముగ్గురు, ఎంతమంది పిల్లలని పెంచినా, వారు వంశాన్ని నిలబడటానికి, మనకుటుంబంతో సఖ్యత వుండటం మాత్రమే కాదు. సమాజంలో పౌరులుగా, సమాజ అభివృద్ధిలో భాగంగా వుండాలి అనే ఆలోచనలతో పెంచాలి. రేపటి పౌరుల్లాగా పెంచాలి. స్త్రీ అయినా అమ్మ కుటుంబంలో ఒక పవర్ గ్రిడ్ లాగా వుండాలి. అందరిలో ఉత్సాహాన్ని, వెలుగులను పెంచే విధంగా వుండాలి.
“ నువ్వు ఒకరిని పుట్టించ గలవు. ఒకరిని తీర్చిదిద్దగలవు. నీలో శక్తిని ఎందరికైనా, పంచగలవు. అందరికీ నీవే దిక్సూచీ, మార్గదర్శిగా నిలబడగలవు. ”
స్త్రీ సమాజంలో పోషించాల్సిన పాత్ర : స్త్రీకి స్వతహాగా సహన, కరుణ, దయ, ప్రేమ, మెండుగా వుంటాయి. కానీ, నేటి సమాజంలో కొంతశాతం అసహనం, చంచలత్వం, కుటిలబుద్ధి స్త్రీ మనసులో వ్యాపిస్తున్నాయి. వాటిని నివారించుకోవడానికి, నిర్మూలించుకోవటానికి మనసును అధీనంలో వుంచుకోవటానికి స్త్రీలు అహంకారంతో కాకుండా, ఆలోచించి తీసుకోవాలి. అర్ధికంగా బలంగా వున్నప్పుడే ఆలోచనలు పలువిధాలుగా పోతుంది. అలా మనసు పక్కదారి పట్టకుండా, కొందరికి అర్ధికంగా ఆదుకోవటం, మంచి విషయాలు, జ్ఞానాన్ని పెంచుకుని, నలుగురికి పంచటం, నలుగురితో మెలగడం, చుట్టూ వున్నవారితో సఖ్యతగా, వారి బాగోగులు చూడటం అలాంటివి చెయ్యాలి.
చట్టసభల్లో స్త్రీ పాత్ర : స్త్రీలు చట్టసభల్లో ఎంత ఎక్కువ శాతం వుంటే, అంత ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. స్త్రీ తన సహజమైన గుణాలు ప్రేమ, వాత్సల్యం, నిస్వార్ధం, సహనం, కార్యనిర్వహణ, చిత్తశుద్ధి, క్రమశిక్షణను వదిలి పెట్టకుండా వుండాలి. స్త్రీల వల్ల రాజ్యాలు కూలిపోయాయి. స్త్రీలు రాజ్యాలు ఏలారు. స్త్రీలకు వున్న గొప్ప శక్తి, వారు అనుకున్నది జరిగేలాగా చేస్తారు. అటువంటి గొప్ప శక్తివంతులు దేశాభివృద్ధి జరగాలని పదవి కాంక్ష లేకుండా, సేవాభావంతో, బాధ్యతలను నిర్వర్తిస్తే, దేశం బాగుపడటం ఖాయం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు. స్త్రీ శక్తి, ఒక మహోన్నతమైన శక్తి. సమాజాన్ని, యువతను మేలుకొలిపే శక్తి స్త్రీలో వుంది.
స్త్రీగా నీ పాత్ర విలువ తెలుసుకో : స్త్రీ గా తక్కువని ఎవరు అన్నా, ఒప్పుకోకు. నిన్ను నువ్వు తక్కువ అనుకోకు. ఒకరికి నువ్వు బానిస కాదు. ఒకరిని బానిసగా చూడకు. అమ్మతనాన్ని నింపుకుని, ఆదర్శంగా అందరి ముందూ నిలబడాలి. ఒకటి గుర్తుపెట్టుకో పరిస్థితులు నిన్ను కట్టి పడెయ్యవు, నువ్వే పరిస్థితులకు కట్టుబడిపోతున్నావు. కలలు కనే స్వేచ్చ నీకు వుంది. వాటిని తీర్చుకోవాల్సిన బాధ్యత నీదే. కష్టాన్ని ఇష్టంగా చేసుకోవాలి. కలలను సాకారం చేసుకోవాలి. స్త్రీ శక్తి అనంత విశ్వంలో నిండిపోయిన శక్తితో సమానం.
నారీ శిరోమణులరా ! మేలుకోండి.!
మీలోని అనంతశక్తిని దేశాభివృద్ధికి ధారపోయ్యండి. మీ ఆదర్శాలను, ఆశయాలను, నెరవేర్చుకోండి. దశ దిశల స్త్రీ శక్తిని వ్యాప్తి చెయ్యండి.
మీ ఆయుధం, మీ శక్తి.......స్వస్తి.!
#Written BY
రాధికా బడేటి
ట్విట్టర్ ఐడి : @BTelugammayi
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com