● మూడేళ్ళలో అమ్మఒడి పథకానికి సుమారు 20వేల కోట్ల రూపాయలు వెచ్చించారు అయినా విద్యా లక్ష్యాలు నెరవేరట్లేదు
● ఇంత డబ్బు పాఠశాలల అభివృద్ధిపై పెట్టుంటే మన రాష్ట్రంలోని బడులు అమెరికాకే పోటీ ఇచ్చేవి
● అమ్మఒడి పథకంలో ఇచ్చే డబ్బుల్లో కూడా అనేక లోపాలున్నాయి
● ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2వేలు ఎందుకు కోత వేశారు?
● ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం కోత వేస్తున్నాం అన్నారు
● ప్రైవేట్ పాఠశాలల్లో మరుగుదొడ్లను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తోందా!
● దేశంలో ఎక్కడా లేని కారణాలు చూపి ఒకటిన్నర లక్షల మంది తల్లుల్ని పథకానికి దూరం చేసారు
● పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే ఫిన్ ల్యాండ్ తరహా విద్యావిధానం ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తారు
● పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 45వ రోజున ఓల్డ్ చెక్ పోస్ట్ రోడ్డు, బోడిగాడితోట ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి వారి సమస్యలను క్షుణ్ణంగా విని పరిష్కారం కోసం తమ వంతు పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువుగా నివసిస్తున్నారని తెలిపారు. పలు కుటుంబాల్లో పేదలు తమ పిల్లలకు అత్యుత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో కూలీనాలి చేసుకుని మరీ తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి ఉన్నారని తెలిపారు. ఒక్కో ప్రైవేట్ పాఠశాలలో ఏడాదికి 20వేల రూపాయలకు పైగా ఫీజు ఉందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన సమయంలో ఏడాదికి 15వేల రూపాయలు ఇస్తామని నమ్మించడంతో ఆ డబ్బులు ఫీజుకి ఉపయోగపడతాయని తాము భావించామని, తీరా ఏ ఏటికాయేడు ఆ మొత్తాన్ని తగ్గిస్తూ వస్తున్నారని పలువురు కేతంరెడ్డి ఎదుట వాపోయారు. తొలి ఏడాది ఇంట్లో ఒక్క బిడ్డకే ఇస్తామని చెప్పారని, రెండో ఏడాది వెయ్యి రూపాయలు కోత వేశారని, ఇప్పుడు మూడో ఏడాది 2వేలు కోత వేసి 13వేల రూపాయలే ఇచ్చారని పలువురు పిల్లల తల్లిదండ్రులు కేతంరెడ్డికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆ పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్వహణ అని కోత వేశారని, మరి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లల అమ్మఒడి డబ్బుల్లో నుండి ఎందుకు కోత వేశారని పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా మరుగు దొడ్లను ప్రభుత్వ నిర్వహిస్తుందా అని వారు ఎద్దేవా చేసారు. పిల్లల తల్లిదండ్రుల మాటలన్నీ సావధానంగా విన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారితో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సాకులు చూపి ఈ ఏడాది ఒకటిన్నర లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకాన్ని దూరం చేసినా మూడేళ్ళ పాలనలో ఈ ప్రభుత్వం సుమారు 20వేల కోట్ల రూపాయలను అమ్మఒడి పథకంపై వెచ్చించిందని అన్నారు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ ఏమాత్రం మెరుగవట్లేదని, విద్యా లక్ష్యాలు నెరవేరట్లేదని అన్నారు. ఈ 20వేల కోట్ల డబ్బుని మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు, నాణ్యమైన బోధనపై ఖర్చు పెట్టుంటే మన బడులు ఈపాటికే అమెరికాలోని బడులకు పోటీగా తయారయ్యేవని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు చూసే అవకాశమే ఉండదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తాత్కాలిక లబ్ధి కోసం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తూ ఉండడంతో ప్రజల డబ్బంతా ఎలాంటి లక్ష్యాలు తీరకుండా వృథా అవుతోందన్నారు. ప్రభుత్వాలు భవిష్యత్ గురించి ఆలోచించాలి కాని ఇలా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆలోచించకూడదు అని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతిత్వరలోనే శ్రీలంకలా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, పవనన్న ప్రభుత్వంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఫిన్ ల్యాండ్ తరహా విద్యావ్యవస్థ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలనే ప్రణాళికలు ఇప్పటి నుండే రూపొందిస్తున్నారని కేతంరెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్ ని ప్రజలందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేసుకుందామని, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేద్దామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com