నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, అనంతసాగరం మండల అధ్యక్షుడు మహబూబ్ మస్తాన్ తో కలసి సోమశిల జలాశయం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోమశిల జలాశయం, నెల్లూరు జిల్లా ప్రజల పాలిట ఆధునిక దేవాలయం అని అన్నారు. సోమశిల,కండలేరు జలాశయాలు, నెల్లూరు, సంగం బ్యారేజ్ లు మరియు కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లు మొత్తం కలసి, మన జిల్లాలో షుమారు 180 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కారణభూతమైన జిల్లా వరప్రదాయని, ఈ సోమశిల జలాశయం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ జలాశయం, గత ఏడాది నవంబర్ నెలలో వచ్చిన వరదల కారణంగా, జలాశయం ముందు భారీగా దెబ్బతిని 20 నుండి 30 అడుగుల లోతు గొయ్యలు పడిన విషయము మనకందరికీ తెలిసినదే. డ్యామ్ సేఫ్టీ కమిటీ ఈ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇవ్వటం కూడా జరిగింది. ఈ పనులను అత్యవసర పనులుగా భావించి మరమ్మత్తులు చేయని పక్షంలో, జలాశయానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. మన రాష్ట్రం లోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో సాగు తాగు నీటి అవసరాలు మాత్రమే కాకుండా, పక్క రాష్ట్రమైన తమిళనాడు తాగునీటి అవసరాలను తీరుస్తున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు ఇది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టు దెబ్బతిని సుమారు ఏడు నెలలు గడుస్తున్నా ఎటువంటి మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం, ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరియు రైతాంగం పట్ల వారికున్న చిత్తశుద్ధి కూడా ఈ విషయంలో తేటతెల్లమౌతుంది. గత వారంలో సోమశిల కు కొద్దిపాటి వరద ప్రవాహం మొదలైంది. సోమశిల జలాశయానికి పూర్తిస్థాయిలో వరదలు రావడానికి కేవలం మూడు నాలుగు నెలల కాలం మాత్రమే ఉంది. ఇప్పటికైనా సోమశిల డ్యామ్ లోని దెబ్బతిన్న ప్రాంతానికి మరమ్మతులు చేయని పక్షంలో, అటు సోమశిల జలాశయం ఇటు పెన్నా పరివాహక ప్రాంతం లోని నెల్లూరు నగరంతో సహా పలు గ్రామాలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే నిధులను కేటాయించి మరమ్మతులను పూర్తిచేయాలని, జిల్లా రైతాంగానికి ఆయువుపట్టు లాంటి ఈ ప్రాజెక్టును కాపాడాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com