తిరుపతి, (జనస్వరం) : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధీనంలో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికుల విధులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పోరాడుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదు సరికదా కార్మికుల దీక్షలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. అర్థరాత్రి నుంచి కార్మికులను, మహిళలను అరెస్టులు చేస్తున్నారు. వేల మంది కార్మికుల పోరాటానికి అండగా నిలిచిన జనసేన నాయకులను సైతం కట్టడి చేసేందుకు అదుపులోకి తీసుకొంటున్నారు. ఈ చర్యలు అప్రజాస్వామికం. తమ డిమాండ్లను, బాధలను తెలియచేస్తూ ఆందోళనలు చేపట్టడం ప్రజాస్వామ్యంలో భాగం. ఇందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. టీటీడీ కార్మికులకు అండగా నిలిచిన జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతీ ఆకేపాటి సుభాషిణి, ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పగడాల మురళీ, పార్టీ నాయకులు శ్రీ మధుబాబు, శ్రీ రాజారెడ్డి, శ్రీ మనోహర్ దేవర తదితరులను అరెస్టు చేశారు. కార్మికులు గత 14 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే జనసేన నాయకులు, జన సైనికులు అండగా నిలిచారు. సొసైటీలుగా ఏర్పడి కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటే ఇప్పుడు వారిని రోడ్డు మీదకు తెచ్చారు. శ్రామిక చట్టాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న టీటీడీ తక్షణమే తన నిర్ణయాలను పునరాలోచించుకొని కార్మికులకు, ఉద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు.