-ఇంటికి అవసరమయ్యే ప్రతి పనికి పన్ను వేస్తున్నారు మరి ఎవరింట్లో వాళ్ళు నివసించేందుకు అద్దె మాదిరి ఇంటి పన్ను వేస్తున్నారా?
-ఇంటి పన్నుల డబ్బులను ఏం చేస్తున్నారో మునిసిపల్ కమిషనర్ శ్వేతపత్రం విడుదల చేయాలి
-పవనన్న ప్రజాబాటలో డిమాండ్ చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు ( జనస్వరం ) : గత 12 రోజులుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 12వ రోజున మైపాడు రోడ్డు ప్రాంతంలోని రాజీవ్ గాంధీ కాలనీలో జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. కేతంరెడ్డి వినోద్ రెడ్డికి పలువురు ప్రజలు తమ ఇంటి పన్ను డిమాండ్ నోటీసులను చూపించారు. గుడిసెలకు, రేకుల ఇళ్ళకు, చిన్న ఇళ్ళకు కూడా 30వేల రూపాయల నుండి 70వేల రూపాయల వరకు ఇంటి పన్ను ఉండడం చూసి కేతంరెడ్డి ఆశ్చర్యపోయారు. అంటే ప్రతి సంవత్సరం కొన్ని వేల రూపాయలను ఇంటి పన్నుగా వేస్తున్నారని గుర్తించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ అసలు ఇంటి పన్ను అంటే మన ఇంటికి అయ్యే అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం మునిసిపల్ వ్యవస్థ ద్వారా తీసుకునే పన్ను అని, ఈ పన్ను ద్వారా ప్రతి ఇంటికి కుళాయి, డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వాలని, ఇంటి పరిసరాల్లో చెత్త కుండీల నిర్వహణ చేయాలని, ఇంటి పన్నులు కట్టే ఇళ్ళు ఉండే ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణ, కాలువల నిర్వహణ చేయాలని తెలిపారు. కానీ నేడు ఈ వైసీపీ ప్రభుత్వం మన ఇంటి చెత్తకి పన్ను, కుళాయికి పన్ను, ఇంట్లో టాయిలెట్లకు పన్ను, డైనేజీకి పన్ను, మన పరిసరాల్లో రోడ్లు, కాలువల కోసం పన్ను, ఇలా ప్రతిదీ వేరు చేసేసి పన్నులు వసూలు చేస్తూ ప్రజల్ని పిప్పి పిండి చేస్తున్నారని విమర్శించారు. ఇలా ప్రతి దానికి పన్ను వసూలు చేస్తూ మరలా ఇంటి పన్ను అనడం విడ్డూరంగా ఉందని, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు నివసించేందుకు అద్దె మాదిరి ఇంటి పన్నులు తయారయ్యాయని, ఆ ఇంటి పన్నులు కూడా వేల రూపాయల్లో వసూలు చేయడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇంటి పన్ను వసూలు చేసే ఇళ్ళ నుండి చెత్త పన్ను వంటి ఇతర పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారని, అసలు నెల్లూరు కార్పొరేషన్ లో వసూలు అవుతున్న ఇంటి పన్నులను ఏమి చేస్తున్నారని, దీనిపై నెల్లూరు మునిసిపల్ కమిషనర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.