Search
Close this search box.
Search
Close this search box.

తెలుగు ఎందుకో వెనుకబడిపోయింది…

తెలుగు ఎందుకో వెనుకబడిపోయింది…

                         తెలుగు లిపి ప్రాచీన బ్రాహ్మీ లిపి నుంచి ఉద్భవించింది. అశోకుని మౌర్య సామ్రాజ్యానికి సామంతరాజులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చారు. దక్షిణ భారత భాషలన్నీ మూలద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రం బ్రాహ్మీ నుంచే పుట్టాయి. మౌర్యుల బ్రాహ్మీలిపిని పోలిన అక్షరాలు గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు బౌద్ధస్తూపంలోని శాసనాల్లో లభించాయి. ఈ భట్టిప్రోలు లిపి నుంచే దక్షిణ భారతదేశ లిపులన్నీ పరిణామం చెందాయి. చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు తెలుగు, కన్నడ దేశాలను కలిపి పాలించడం వల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామం చెందింది. క్రీ.శ. ఐదో శతాబ్దం నాటికి ఈ భట్టిప్రోలు లిపి నుంచి పాత తెలుగు లిపి ఆవిర్భవించిందని పరిశోధకుల అంచనా.
                       ప్రాచీన తెలుగు లిపిలో ఖ, ఘ, ఛ, ఝ, థ, ఠ మొదలైన మహాప్రాణ అక్షరాలు లేవనీ, ఈ శబ్దాలు ఇండో- ఆర్యన్ భాషల ప్రజలు మాత్రం విరివిగా వాడేవారనీ, ద్రావిడ భాషల ప్రజలు ఈ శబ్దాలను సాధారణ వ్యవహారిక భాషలో అసలు వాడేవారు కాదనీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇప్పటికీ మన పల్లెల్లో ఈ మహాప్రాణ అక్షరాలను చాలామంది రోజువారీ పలుకుబడి భాషలో వాడకపోవడం మనం గమనించవచ్చు. నన్నయ కాలంలో సంస్కృత సాహిత్యం విరివిగా తెలుగులోకి అనువాదం అయినప్పుడు, ఈ సంస్కృత మహాప్రాణ శబ్దాలను తెలుగులో రాయడం కోసం ప్రత్యేకంగా తెలుగు లిపిలో అక్షరాలను రూపొందించారు. నన్నయ పదకొండో శతాబ్దంలో రచించిన మహాభారతం తెలుగులో ఆదికావ్యమనీ, నన్నయ ఆదికవి అని చెప్పబడుతున్నది. అంతకు ముందు సాహిత్యం అసలే లేకుండా, ఉన్నట్టుండి ఇంత అద్భుతమైన, పరిపక్వమైన కావ్యం రచించడం అసాధ్యం కాబట్టి, నన్నయకు ముందే మరింత తెలుగు సాహిత్యం ఉండవచ్చని సాహిత్యకారుల అభిప్రాయం. పదహారో శతాబ్దంలో విజయనగర శ్రీకృష్ణదేవరాయల పాలనలో తెలుగు వైభవంగా వెలిగింది. ఎంతో సాహిత్యం సంస్కృతం నుంచి తెలుగు, కన్నడ భాషల్లోకి అనువాదం అయ్యింది. ఈకాలంలో వివిధ సాహితీ ప్రక్రియల్లో వెల్లువలా సృష్టించబడ్డ ఎంతో సాహిత్యం సాహిత్యాభిమానుల, విద్యావంతుల అభిమానాన్ని చూరగొనగలిగినప్పటికీ, సంస్కృత భాష ప్రభావం కారణంగా చాలా మటుకు గ్రాంథిక భాషలో ఉండడం వల్ల ప్రజాబాహుళ్యంలో ఎక్కువగా ప్రచారం పొందలేకపోయాయి. పల్లె ప్రజలకు, నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థం అయ్యే విధంగా వాడుక భాషలో సరళమైన రీతిలో వెలువడ్డ వేమన పద్యాలు, బ్రహ్మంగారి సాహిత్యమూ, అన్నమయ్య, కంచెర్ల గోపన్న రాసిన కీర్తనలు ఇప్పటికీ ప్రజల ఆదరణ చూరగొంటున్నాయి.

                మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. మాండలిక భాషలన్నీ ప్రధానభాషలోని వివిధ వ్యవహారికాలుభాష అంటారు. మాండలిక భాషలన్నీ ప్రధాన భాషలోని వివిధ వ్యవహారికాలు మాత్రమే, అన్ని మాండలికాలూ కలిపితేనే ప్రధాన భాష అవుతుంది. ప్రతి భాషకీ మాండలిక భేదాలున్నట్టుగానే, తెలుగుకీ ఉన్నాయి.
సాహిత్యపరంగా తెలుగుతల్లి అంటే తెలుగు ప్రజల అమ్మగా చిత్రీకరించబడిన, ప్రజామోదం పొందిన చిహ్నం. తెలుగుతల్లి చాలా అందంగా చిరునవ్వుతో తెలుగు మహిళలకు అద్దం పట్టేలా ఉంటుంది. తెలుగు నేల ఎల్లప్పుడు పచ్చదనంతో నిండి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగు తల్లి ఆశిస్తున్నట్లుగాతన ఎడమ చేతిలో కోతకొచ్చిన పంట ఉంటుంది. కుడి చేతిలో ఉన్న కలశం తెలుగు ప్రజల జీవితాలు మంచి మనసుతో నిండుగా కలకాలం వర్థిల్లాలని, తెలుగు ప్రజలకు అవసరమైన వాటిని తెస్తున్నట్లుగా సూచిస్తుంది. ఈ దేవత తెలుగు వారి శైలిలో సాంప్రదాయ దుస్తులను ధరించి ఉంటుంది. ఈ తెలుగుతల్లిని ఆరాధించటం ద్వారా మానవాళికి అవసరమైన భాషా నైపుణ్యాలను అందిస్తుందని తెలుగు ప్రజలు భావిస్తారు. అందువలన తెలుగు ప్రజల జీవితాలలో తెలుగు తల్లికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రం యొక్క అధికారిక గీతం మా తెలుగు తల్లి. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి, 1942లో రచించారు.
2000 యేళ్ల నాటి చరిత్ర కలిగిన తెలుగు నేడు అధికార భాష అయినా అధికారికంగా తగ్గుముఖం పడుతుంది. భారత దేశంలోనే హిందీ తర్వాత తెలుగు ఎక్కువ మాట్లాడే భాషగా రెండవ స్థానంలో ఉంది.2011 లెక్కల ప్రకారం 7.4 కోట్ల జనాభాతో తెలుగు మాట్లాడే మాతృ భాష గా మొదటి స్థానంలో ఉందేది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష గా తెలుగు 15వ స్థానంలో ఉంది. ప్రపంచ భాష గణాంకాల ప్రకారం 2020కి 9.3 కోట్ల మందికి మాతృభాషగా ఉంది మన తెలుగు. అతి ప్రాచీన భాషలలో సంస్కృతము, తమిళముల తో పాటు తెలుగు కూడా ప్రాచీన భాషగా 2008 అక్టోబర్ 31న భారత ప్రభుత్వం గుర్తించి తెలుగు ప్రాచీన చరిత్ర విలువ తెలిపింది. ఇద్దరు అన్నదమ్ములు లాంటి రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుగు అమ్మ వంటిదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు తెలుగు నీరసించి పోతున్న తరుణంలో మనందరం తెలుగు విలువ చాటడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. దీనిలో ప్రధాన ప్రభుత్వం ప్రధాన పాత్ర వహించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అమ్మ నాన్న ల ప్రేమ పేగు బంధం నుంచి మమ్మీ డాడీ అనే ఆంగ్ల అక్షరాల్లోకి, అత్తమామల ఆప్యాయత పిలుపుల నుంచి ఆంటీ అంకుల్ అనే కొత్త పదాల పద్ధతుల్లో ప్రాధాన్యత పెంచి ఆప్యాయత అనురాగాలు దూరమవుతున్న తెలుగువాడా అమ్మలాంటి కమ్మనైన తెలుగుని దరికి చేర్చి హక్కును చేర్చు.
కానీ చాలా సందర్భాల్లో తెలుగు భాష , తెలుగు లిపిని వాడకం తగ్గిస్తున్నారు అది మన సొంత రాష్ట్రంలోనే చూసి చాలా బాధనిపించింది. తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు ని వాడకుండా చిన్న చూపు చూస్తున్నారు. తెలుగు ఒక భాషలానే కాకుండా అది మన సంస్కృతి, జీవన విధానం అని సాంప్రదాయమని తెలియజెప్పే వాళ్లు తెలుసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇక విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల వరకు వచ్చేసరికి ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం ఒక ఫ్యాషన్ గా తయారయ్యి ఒకరిని చూసి ఇంకొకరు ఇంగ్లీష్ మీడియం అనే ఫ్యాషన్లో పడి తెలుగుని చాలా క్రిందకు తొక్కేస్తున్నారు. విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తెలుగును ఒక భాష లానే చూస్తున్నారు. తెలుగు గౌరవాన్ని తగ్గటానికి ముఖ్య కారణంగా నిలుస్తున్నారు. ఈ తరం వాళ్లలో చూసుకుంటే 60 శాతానికి పైన తెలుగు మాట్లాడతారు కానీ చదవడం రాయడం ఎవరికి రాదు. ఇది నాకు చాలా బాధ అనిపిస్తోంది. తెలుగు ఇంత దిగజారి పోవడానికి గల కారణం ప్రస్తుత ఇంగ్లీష్ మీడియం విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులు. కొన్ని విద్యా సంస్థల లో తెలుగు బోధన చేయకపోవడమే కాకుండా తెలుగు భాష మాట్లాడటం కూడా ఒక పెద్ద తప్పుగా చేసి. తెలుగు మాట్లాడే విద్యార్థులకు తెలుగు జరిమానా విధించడం వంటివి చేసి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అటువంటి విద్యాసంస్థలకి తోడుగా, అండగా నిలుస్తున్నారు. ఇటువంటివి ఎక్కువగా కొన్ని క్రిస్టియన్ మిషనరీ విద్యాసంస్థలు చేస్తున్నాయి.
దేశభాషలందు తెలుగు లెస్స శ్రీ కృష్ణ దేవరాయలు… మన తెలుగుని ఆ రోజుల్లో కొనియడితే ఈరోజు స్వరాష్ట్రంలోనే తెలుగుని దిగజారుస్తున్నారు. ఇదే విధానం మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు ఉండేదంట తెలుగు మాట్లాడే తర్వాత తెలుగు ఉండేదంట తెలుగు మాట్లాడే వారు అంట, అని ఇతర భాషల్లో చదువుకోవాల్సి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలామంది పండితులు, కవులు, విద్యావేత్తలు తెలుగు కోసం పలుకార్యక్రమాలు చేపట్టిన, కొన్ని సంస్థలు నెలకొల్పిన వాటికి ఆధారం లేకుండా, ఉపయోగించుకునే వాళ్లు చాలా తక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా విద్యావ్యవస్థలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పులు రావాలి, అదేవిధంగా తెలుగు ఒక భాష కాదు మన సంస్కృతి మన జీవన విధానం మన సాంప్రదాయం అన్ని విలువలు గుర్తుచేసే విధంగా అందరికీ తెలియ చెప్పాలి. ఎందరో మహానుభావులు రాసిన తెలుగు పుస్తకాలు, నవలలు, కథలు మరియు ముఖ్యమైన కొంతమంది మహానుభావుల జీవిత చరిత్రలు వీటన్నిటిని విద్యావ్యవస్థలో తీసుకురావాలి.
రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు నియమాలు నిబంధనలు విద్యా వ్యవస్థలో మార్పులు చేసి తెలుగుని మెరుగైన స్థాయిలో కి తీసుకుని వెళ్లడానికి కృషి చేయాలి అంతేకానీ విద్యావ్యవస్థలో పూర్తి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తెలుగుని చంపేందుకు ప్రయత్నించకూడదు. తెలుగు రాష్ట్రంలోనే ఉంటూ అమ్మలాంటి తెలుగుని రూపుమాపాలని చాలామంది చేస్తున్నా ప్రయత్నాలు మట్టిలో కలిసి వాళ్లు కూడా తెలుగుతల్లి ఆగ్రహానికి గురవుతారనడంలో సందేహం లేదు. అంతే కాకుండా తెలుగు విలువ తెలిసేలా సామాజిక మాధ్యమాలలో కూడా తెలుగు కోసం తెలుగు యొక్క గొప్పదనం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఈ తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆసక్తి కలిగించేలా స్ఫూర్తి కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం చాలా ఉంది. ప్రస్తుతం తెలుగుపై జరుగుతున్న నిరాదరణను స్వస్తి పలికి అమ్మ తెలుగు తల్లి కీర్తి వెలుగు అని చెప్పి ఆదరణ ఇవ్వడం ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క బాధ్యత అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని సూచనలు తెలియజేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పూర్తి ఆంగ్ల మాధ్యమం సరికాదని, తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాల్లో విద్యా సంస్థలు నడపాలని హెచ్చరించడంతో పాటు విద్యాసంస్థల్లో ఎటువంటి మార్పులు, చేర్పులు రావాలో తెలియజెప్పారు. నైపుణ్య అభివృద్ధి అదేవిధంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారికి ముందుకు నడిపించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం 30 సంవత్సరాల తరువాత మార్పులు చేసిన నూతన విద్యావిధానం 2020 (NEP-20) లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని NEP-20 విద్యా విధానంలో అమలులోకి వస్తాయని తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సొంత మాతృ భాషల్ని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యత కల్పించి 5లేదా8 వ తరగతి వరకు మాతృ భాషల్లో బోధన పద్దతి నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా తెలుగు మంచి ప్రాధాన్యత సంపాదించుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ విద్యావిధానం లో తెలుగు కూడా ప్రవేశపెట్టింది. తెలుగుని బతికించుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుకుంటూ…


By
ప్రశాంత్ పోలకి ( జవాన్ )
ట్విట్టర్ ఐడి : @Prasanthpolaki

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way