పవన్ కళ్యాణ్ ఎందుకో వెనుకబడిపోయాడు…!!!
పవన్ కళ్యాణ్ ఎందుకో వెనుకబడిపోయాడు…!!! అవును మీరు చదివింది నిజమే. పవన్ కళ్యాణ్ వెనుకబడింది తన నిజాయితి, మానవత్వంలో కాదు, రాజకీయంలో ప్రత్యర్థులను ఎదుర్కొనడంలో.. తను ఎదుర్కొనలేదు అని చెప్పట్లేదు.. కాస్తా వెనుకబడ్డాడు అంతే… తను వెనుకబడ్డానికి కారణం తనా, లేక తన చుట్టూ ఉన్నవాళ్ళా, తన జనసైనికులా… ఓ సారి విశ్లేషణ చేసుకుందాం.
‘పవన్ కళ్యాణ్’ ఈ పేరును సినిమా అభిమానం ఉన్నవాళ్ళు పవర్ స్టార్ అని, మార్పు కోరుకొనే రాజకీయ యువత జనసేనాని అని, సహాయం పొందిన వాళ్ళు దేవుడు అని, స్పూర్తి పొందే వాళ్ళు మరొక చేగువెరా అని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి తన అన్న చిరంజీవి, వదిన సురేఖ సహాకారంతో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ తానే ఒక్కో మెట్టు ఎక్కుతూ కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి. తన నటన, డ్యాన్స్, డైలాగ్స్ చూసి తనకు అభిమానులు కాలేదు. తన వ్యక్తిత్వాన్ని చూసి ఒక్కో సందర్భంలో ఒక్కోసారి తమ హీరో, నాయకుడు, దేవుడు అన్నారు. చిత్ర పరిశ్రమలో ఒక్క ఫ్లాఫ్ ఉంటేనే పట్టించుకోని ఈ రోజుల్లో వరుసగా 10 సంవత్సరాలు ఫ్లాఫ్ సినిమాలు ఉన్నా తనని హీరో అన్నారు. యువ రక్తానికి కొత్త తరహా, మార్పు రాజకీయాలు కోరుకునే వారు నాయకుడు అన్నారు. తన నుంచి సహాయం పొందిన వారు కనిపించిన దేవుడు అన్నారు. ఇలా వీరంతా అనడానికి తన వ్యక్తిత్వమే కారణం అని చాలా మందికి తెలిసినా ఒప్పుకోరు. నాటి నుండి నేటి వరకూ అత్యధికంగా డబ్బులు తీసుకునే హీరో అయినా ఏనాడూ గర్వపోలేదు కదా, సామాన్యుడిలా జీవిస్తున్నాడు. విజయం వచ్చినపుడూ తలకు గర్వం ఎక్కనూలేదూ, ఓటమి వచ్చినపుడూ క్రుంగిపోనూ లేదు. ఇంతలా పేరు పొందిన పవన్ కళ్యాణ్ మరెందుకూ వెనుకబడిపోయాడు ????
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవాలని కోరుకుంటున్న ఉద్యమ రోజులవి. చాలా వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నా అప్పటి కేంద్ర ప్రభుత్వాలు తమ స్వలాభం కోసం వేరు చేశాయి. చాలా మంది విడిపోయినందుకు బాధపడలేదు, అప్పటి ప్రభుత్వాలు విభజించిన తీరు నచ్చలేదు. ఆ బాధపడిన వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అప్పటి వరకూ సాఫీగా సినిమాలు చేస్తూ చేతి నిండా డబ్బు సంపాదిస్తూ పదిమందికి పంచుతున్న వైభవం తనది. కానీ నా ప్రజలను ఈ మహామ్మరి నుంచి రక్షించుకోవాలని 2014 మార్చి 14 రోజున అనూహ్యాంగా ” జనసేన ” పార్టీ స్థాపించాడు. అన్నదమ్ముల్లాగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోనూ, తెలంగాణ లాభాల్లోనూ ఉంది. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఒక సరైనా, అనుభవం ఉన్న నాయకత్వం అవసరం అని అనుకోని అప్పటి 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన అతనికి సహాకారం అందించడం ముఖ్యం అనుకున్నాడు. ఒక వైపు పిన్న వయసు గల మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మరొక వైపు అప్పటికే ముఖ్యమంత్రిగా అనుభవం ఉండి అభివృద్ధిని చూపించిన నాయకుడు ఒక వైపు. పవన్ కళ్యాణ్ కు తెలుసు ఇద్దరూ కూడా స్వార్థపరులే అని.. కానీ తాను ఈ విధంగా బేరీజు వేసుకొని గుడ్డి కన్నా మెల్ల మేలు అనుకోని అనుభవం ఉన్న నాయకుడికి ప్రత్యక్షంగా సహాకారం అందించాడు. అతనిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రతిఫలంగా ఏ పదవి ఆశించనేలేదూ… ఆ పార్టీ ఇచ్చిన హామీలకు నేను కూడా బాధ్యత అన్నాడు కానీ, చాలా వరకూ ఆ పార్టీ హామీలు నెరవేర్చక పోయేసరికి వారి మీద కూడా ప్రత్యక్షంగా పోరాటం సాగించాడు. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఎదురించాడు. తాను గెలిపించిన నాయకులు విచ్చలవిడిగా అవినీతి, నేరారోపణలు పెరిగాయి. ప్రతిఫలంగా ప్రజలలో కూడా పవన్ కళ్యాణ్ అంటే కాస్తా వ్యతిరేఖ ముద్ర వేసుకున్నాడు.
2019 ఎన్నికలు రానే వచ్చాయి. ఈసారి తను ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలబడ్డాడు. తాను కూడా రెండు చోట్లా పోటీ చేశాడు. ఈసారి సిపియం, సిపిఐ, బీయస్పీ పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నాడు. జనసేన తరుపున కండెక్టర్ కొడుకికి, కాయగూరలు అమ్మే మహిళ, విద్యార్థి నాయకుడు, ఒక రైతు, ఒక టీచర్, ఒక అధికారి… ఇలా మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు ఎమ్మెల్యే, యంపీ సీట్లను ఇచ్చి అభ్యర్థులను నిలబెట్టాడు. ఫలితం శాన్యం… అధినేత రెండు చోట్ల ఓడిపోయాడు. కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకున్నాడు. కానీ చివరకు ఆ ఒక్క సీటు కూడా ఇపుడు ఉన్న అధికార పార్టీకి దాసోహా౦ అయింది. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ బాధపడలేదు.. ఆ వెంటనే ఆ బాధను తేరుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు. ప్రజల కష్టాలను బయటకు తీశాడు, పోరాడాడు, పోరాడుతూనే ఉన్నాడు. తాను ఎప్పుడూ చెప్పే మాటకే కట్టుబడి ఉన్నాడు… పదవి కోసం కాదు, ప్రజల కష్టాలను తీర్చడానికి వచ్చాను అని చెప్పిన మాటను గుర్తూ చేస్తూనే, భారీ ఓటమి చవి చూసిన ప్రజలలోనే పోరాటం చేస్తూ గడుపుతున్నాడు.
పవన్ కళ్యాణ్ రాజకీయంలో వెనుకబడ్డాడు అని చెప్పడానికి ఇవి బలమైన ప్రశ్నలు అయితే వాటికి సమాధానాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం మరో బలమైన కారణం. ఈ ప్రశ్నలకు సమాధానాలు గ్రౌండ్ లెవల్లో తీసుకుపోయి సరైన రీతిలో వివరిస్తే జనసేన మరింత పుంజుకునే అవకాశం ఉంది.
చాలా వరకూ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఓడిపోవడానికి ముఖ్య కారణాలు. ఇవి కేవలం విశ్లేషణ మాత్రమే. ఎవ్వరిని నొప్పించడానికి కాదు అని గుర్తించగలరు.
( సంధించే ప్రశ్నలు ~ ధీటైన సమాధానాలు )
1. ప్రశ్న :: పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు ?
జవాబు :: అవును. మీరు చెప్పింది నిజమే, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు. కానీ తీసుకున్నది ప్రత్యర్థుల నుంచి కాదు ప్రజల నుంచి 22 లక్షల ఓట్లు ప్యాకేజీగా తీసుకున్నాడు. మీరు చెప్తున్నట్టు మీ దగ్గర సరైనా ఆధారాలు లేవు ప్యాకేజి తీసుకున్నాడు అని చెప్పడానికి. కాబట్టి మీరు అడిగే ప్రశ్నలోనే ఏదో తప్పు ఉంది. సినిమా రంగంలో తానొక అగ్ర నటుడు మరియు అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తి. తను ఊ.. అంటే దేశంలోని ప్రముఖ యాడ్స్ కంపెనీలు తన ఇంటిముందు క్యూ కడతాయి. తమ యాడ్స్ చేయమని. అయినా మీలో ఎంతమందికి తెలుసు ఒలంపిక్స్ లో రేఖా అనే ప్లేయర్ బాధల్లో ఉన్నపుడు 5 లక్షలు విరాళం, ఉత్తరఖాండ్ లో వరదలు వచ్చినపుడు 20 లక్షలు, హూద్ హూద్ వచ్చినపుడు 50 లక్షలు, సతీష్ అనే బైక్ రేసర్ కు ప్రమాదంలో కాలు పోతే 5 లక్షలు, ఆశ్రమానికి నిరంతరంగా లక్షల రూపాయలు, వికలాంగుల క్రికెట్ టీమ్ కు 35 లక్షలు, చెన్నై వరదలు 2 కోట్లు, కేంద్రీయ సైనిక్ బోర్డుకి 1 కోటి, కరోనా నివారణకు 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. తాను నటించిన సినిమా నష్టం వస్తే సగభాగం రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చేవాడు. ఒక్కో యాడ్ చేస్తేనే వందల కోట్లు ఆర్జించే కెపాసిటీ ఉన్నా, ప్రజల సంరక్షణ కోసం ఆ యాడ్స్ తీయాలనుకోలేదంటే అర్థం చేసుకోవాలి మరి ఆయన వ్యక్తిత్వం. అలాంటప్పుడు ఈ ప్యాకేజిలా గోల ఏంటి ? ప్యాకేజీ తీసుకున్నాడు అని నిరూపించడానికి మీ దగ్గర ఆధారాలు లేవు. అలాంటప్పుడు ఇలాంటి అసంబద్దత మాటలు మాట్లాడడం మీ అవివేకం అర్థం అవుతుంది.
2. ప్రశ్న :: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు ?
జవాబు :: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులు తగ్గలేదు లేక శాంతి భద్రతలు భంగం కలగలేదు. అయినా భారతీయ రాజ్యాంగం ప్రకారం చట్ట బద్ధంగా ఒక వ్యక్తి ఎన్ని సార్లు అయినా పెళ్లి చేసుకోవచ్చు. అయినా తన వ్యక్తిగత విషయాల గురించి మనకు మాట్లాడే హక్కు లేదు. ఆ ముగ్గురు పెళ్ళాలు రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం చేశాడు అన్నపుడు అది పబ్లిక్ ఇష్యూ. అయినా ఎవరికి తెలుసు వారి మధ్య ఎన్ని అంతరంగిక విషయాలు ఉన్నాయో. అయినా అధికారం లేకపోయినా కర్నూలులో సుగాలీ ప్రీతి అనే అమ్మాయి బలాత్కారం చేసి, హత్య చేస్తే గత, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోకపోతే తన పోరాటమే ఆ కేసుకి ఒక మార్గమ౦ అయింది. చనిపోయినా ఆ ఆడపిల్ల గురించే అంతగా పోరాడినవాడు, బతికున్న ఆడపిల్లల జీవితం నాశనం చేస్తాడని ఎలా అనుకుంటున్నారు. ఇపుడున్న నాయకులు పద్దతిగా ఒక పెళ్ళాన్ని, అక్రమంగా ఎన్ని గడపలు తొక్కుతూ ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయడం మీకు తెలియదా. అయినా తాను బహిరంగానే చెప్పుకుంటున్నాడు తన వైవాహిక జీవితంలో అనివార్య కారణాల వల్ల పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని. అయిననూ మీరు విమర్శించడానికి ఏమి లేదు. తన వ్యక్తిగత విషయాన్ని ఇప్పటికి, మూడు పెళ్లిళ్లు అని మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగానువ్వు పవన్ కళ్యాణ్ కు నాలుగో పెళ్ళానివే..
3. ప్రశ్న :: తన అన్నలాగే పార్టీని అమ్ముకుంటాడు ?
జవాబు :: మీకు ఈ సందేహా౦ రావడం కరెక్టే. అప్పటి పరిస్థితల దృష్ట్యా తన అన్న రాజకీయాల్లో బలవంతంగా వచ్చాడు. తన అన్న చాలా మృదస్వభావి మరియు ఫలితం కోసం తొందరగా ఎదురుచూశాడు. తాను స్వతహాగా రాజకీయాల్లోకి రాలేదు కనుక వచ్చిన సీట్లను నిలబెట్టుకోలేకపోయాడు, ప్రత్యర్థులను ఎదుర్కొనలేక పోయాడు. సామాజిక న్యాయం చేద్దామని వచ్చిన తాను తనమీద వచ్చిన అపనిందలకు బాధపడి సమాజానికే దూరంగా ఉండిపోయాడు. మళ్ళీ తన వృత్తిని సినిమా రంగాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పదవి కోసమే రాజకీయాల్లోకి రాలేదు. అందుకు ఉదాహరణ తన అన్న పార్టీ స్థాపించినపుడు తాను కూడా పాలుపంచుకున్నాడు తప్పా, పదవి కోసం తను ఎప్పుడూ పోటీ చేయలేదు. తనకు సామాజిక సృహ ఉంది కాబట్టే తన అన్న వల్ల కాకపోయినా సమాజ భవిష్యత్తు కోసం మళ్ళీ ముందడుగు వేశాడు. తాను ఘోరంగా ఓడిపోయినా, తన అన్నకంటే చాలా తక్కువ మొత్తంలో సీట్లు, ఓట్లు వచ్చినా వెనుకడుగు వేయలేదు. వెంటనే ప్రజల్లోకి వచ్చాడు, సమస్యల మీద పోరాడుతున్నాడు. నా శవాన్ని నలుగురు వచ్చి మోసుకుపోయే వరకూ జనసేన పార్టీని నిలుపుతాను అని బహిరంగ సభల్లో చెప్పిన విషయం తెలిసిందే.
4. ప్రశ్న :: రాజకీయాలు అంటూ సినిమాలు చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు ?
జవాబు :: ఒకానొక సందర్భంలో ఇక మీదట సినిమాలు చేయను అని బహిరంగంగా చెప్పాడు. నిజమే, అపుడు చెప్పాడు ఇపుడు సినిమాలు తీస్తున్నాడు. కానీ మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్నికలలో ఓడిపోయాడు, పార్టీని మళ్ళీ శక్తివంతంగా ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఎన్నికలకు సిద్ధం అవ్వాలి. మన కుటుంబాన్ని పోషించాలంటేనే బడ్జెట్ వేసుకొని సంసారం సాగిస్తాము. అలాంటిది ఒక రాష్ట్ర పార్టీని నడిపించాలంటే ఆర్థిక వనరులు అవసరం. తాను కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కూడా కాదు. సాధారణంగా ఒక పార్టీకి విరాళాలు వ్యాపారవేత్తల నుంచి అందుతాయి. కానీ జనసేన పార్టీకి అలాంటి ఆర్థిక వనరులు లేవు. అయినా పవన్ కళ్యాణ్ అక్రమ మార్గంలో సంపాదించలేదు. తనకు తెలిసిన వృత్తి ద్వారానే సంపాదించి ప్రభుత్వానికి టాక్స్ లు కడుతూ పార్టీని నడుపుతున్నాడు. ఇదే ప్రశ్న మీరు రాజ్యాంగ పదవి గల ప్రజాప్రతినిధులు తమ పదవి కాకుండా మరొక మార్గం ద్వారం కూడా సంపాదిస్తున్నారు. సక్రమంగానూ మరియు అసక్రమంగానూ.. మరి అలాంటి వారిని ప్రశ్నించలేరు. పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి ఇదొక సాకు.
5. ప్రశ్న :: గతంలో ఒక పార్టీకి మద్దతు ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు ?
జవాబు :: అవును మీరన్నది నిజమే. తాను మద్దతు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ, తను ఎలాంటి పరిస్థితులలో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో అర్థం చేసుకోలేదు. అపుడే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉంది. అప్పటికే రెండు పార్టీలు రాష్ట్రంలో పాతుకుపోయాయి. ఆ ఇద్దరు నాయకులు కూడా స్వార్థ పరులు అని తెలుసు. ఒక నాయకుడేమో అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పని చేశాడు. మరో నాయకుడు అప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని కొన్ని నెలలు పాటు జైలు జీవితం గడిపి బెయిలు మీద బయటకు వచ్చిన వ్యక్తి. ఇటువంటి పరిస్థితులలో జనసేన పోటీ చేయడం రాష్ట్రాన్ని మరింత క్షీణించే పరిస్థితుల్లోకి తీసుకెళ్లకూడదు అని అనుకోని పోటీ చేయడం విరమించుకొన్నాడు. ఇపుడు తన ముందు ఒక సవాలు ఏర్పడింది ఎవరికి సపోర్ట్ చేయాలా అని. అనుభవం ఉండి తక్కువ నేరారోపణ, అవినీతి ఉన్న నాయకుడుని (మెల్ల కన్నుగా) అనుకుంటే, అనుభవం లేని మరియు అప్పటికే నేరారోపణలు ఎక్కువగా ఉన్న నాయకుడిని (గుడ్డిగా) చూసుకుంటే.., అప్పటి పరిస్థితుల్లో కాస్తాయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపశమనం కలగాలంటే రెండు కళ్ళు లేక పోయినా పర్వాలేదు మెల్ల కన్ను చాలు అన్నట్టుగా అపుడు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది.
6. ప్రశ్న :: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను బలమైన వారిని ప్రకటించలేదు.
జవాబు :: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బలమైనా వారు కాదని మీరు ఏ విషయం మీద బేరీజు వేసుకొని చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. జనసేన సిద్ధాంతమే యువతను రాజకీయంలో నడిపించాలని, కుటుంబ రాజకీయాలు వద్దనే కదా వారిని నియమించింది. బలగం, డబ్బు ఉంటే బలమైనా నాయకులు కావేచ్చెమో కానీ, జనసేన సిద్దంతాలు చూసుకుంటే నిలబడిన ప్రతి అభ్యర్థి కూడా బలమైన నాయకుడే. అవకాశం ఇవ్వజూపితే పోయే నాయకులకి కాదు పాతికేళ్ళ రాజకీయ భవిష్యత్తు నిర్దేశించడానికి వచ్చిన వారికి సీట్లు ఇచ్చింది. మీరన్నట్టుగా మీరే చెప్పే బలమైన నాయకులకి సీట్లు ఇస్తే ఇక ఆ పార్టీలకు, జనసేన పార్టీకు తేడా ఏముంటుంది. అలా మీరన్నట్టుగానే ఆ బలమైన నాయకులకే సీట్లు ఇవ్వాలనుకుంటే ఇక జనసేన పార్టీ ఎందుకు ?. అలా చేయాలనుకుంటే ఇంకా మరెన్నో పార్టీలు ఎందుకు, కొత్తగా జనసేన పార్టీ రావడం ఎందుకు ?. మీరు గమనించినట్లయితే ఇతర పార్టీలు కుల, మత, కుటుంబ, ధన, బలగం ఉన్న నాయకులకే పార్టీ టికెట్లు ఇచ్చింది. కానీ జనసేన పార్టీ పాతికేళ్లు ప్రయాణం చేయగల నాయకులు, నిజాయితీ పరులు, సామాజిక సృహ ఉన్న నాయకులకే పార్టీ టికెట్లు ఇచ్చింది. జనసేన నుంచి తరపున పోటీ చేసిన వారు ఒక సాధారణ మహిళ, ఒక కండెక్టర్ కొడుకు, కాగకూరలు అమ్మే కొడుకు, ఒక దినసరి కూలీ, ఒక విద్యార్థి నాయకుడు, ఒక రైతు, ఒక టీచర్, ఒక అధికారి, పోరాట యోధులు.., ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో వ్యక్తులకి టికెట్లు ఇచ్చిన ఘనత జనసేనది. మీరు ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన నుంచి పోటీ చేసిన వ్యక్తుల మీద ఒక కేసు కూడా లేకపోవడం. దేశంలో ఇలా ఒక కేసు కూడా లేకుండా సంపూర్ణంగా పార్టీ టికెట్లు ఇచ్చిన ఘనత జనసేన అని గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల భయబ్రాంతులకు గురవ్వడం వల్ల పోటీ చేయలేకపోయిన బలహీనులకు టికెట్లు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎన్నికలు జరిగే వరకూ కొంత మంది అభ్యర్థులు తమ నాయకుడిని కూడా ప్రత్యక్షంగా చూడలేదంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సాధారణ, మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు టికెట్లు ఇచ్చాడో…
7. ప్రశ్న :: గ్రామీణ ప్రాంతాలలో జనసేన పార్టీని బలోపేతం చేయలేదు ?
జవాబు :: అవును. గ్రామీణ ప్రాంతాలలో జనసేన పార్టీని బలోపేతం చేయలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక ఆలస్యంగా జరగడం, నాయకులు ప్రజల్లోకి వెళ్ళడం చాలా ఆలస్యంగా జరిగింది. అయితే అప్పటికే గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నేపథ్యం గల ఆ రెండు పార్టీలు పాతుకుపోయాయి. ఎటువంటి రాజకీయనేపథ్యం లేనిపార్టీ గ్రామీణ ప్రాంతాలలో కుదురుకోవాలంటే కాస్తా సమయం పడుతుంది. కొన్ని ప్రాంతాలలో గొడవలు, ఫ్యాక్షన్, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల యువత కూడా ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకూ తన అన్న వచ్చాడు మోసం చేశాడు, అపుడు ఆ పార్టీకి ఓటు వేయమన్నాడు మేము మోసపోవాల్సి వచ్చింది అని మథనపడుతున్న వారికి లోతుగా విశ్లేషణ చేసే యువత కొరత ఏర్పడింది మరియు అనివార్య కారణాల వల్ల ఆ యువత బయటకు రాలేకపోయారు. వచ్చిన వారిని ఇతర పార్టీల వారు భయపెట్టడం చూసాము. చాలా మంది సినిమా అభిమానులు కూడా సినిమా వేరు, రాజకీయం వేరు అంటూ ఓట్లను చీల్చిన సందర్భాలు ఎక్కువే. (( పవన్ కళ్యాణ్ కు ప్రాణం ఇస్తాము ఓటు మాత్రం ఆ నాయకుడికే వేస్తాం )) అని చెప్పిన అభిమానులు కూడా సినిమాలు, రాజకీయ గొడవలు అంటూ అక్కడే సమయాన్ని వృధా చేశారు. ఈ ఫ్యాన్స్ వార్ కూడా కాస్తా నష్టాన్ని మిగిల్చిందనే చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాలలో జనసేన మ్యానిఫెస్టో, సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లలేకపోయారు. నిలబడిన అభ్యర్థులు కూడా ఇతర పార్టీ బెదిరింపులకు భయపడి నామినేషన్ దగ్గరే ఆగిపోయి, ప్రచారం కూడా చేయలేకపోయారు.
8. ప్రశ్న :: నాయకుడే రెండు చోట్లా ఓడిపోయాడు ఇక పార్టీని ఏం నడిపిస్తాడు ?
జవాబు :: ఓటమి వచ్చినంత మాత్రాన గమ్యం ఏమి మాయం అయిపోదు. ఒకసారి మనం చరిత్ర పుటల్లోకి వెళ్తే దేశాన్ని ఒంటి చేత్తో నడిపించిన మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఒక పార్టీకి అధ్యక్షత వహిస్తూ ఎన్నికలలో ఓడిన సందర్బమూ ఉంది. అంతెందుకు తాను రాసిన రాజ్యాంగం మీద నడుస్తున్న ఎన్నికలు, ఆ రాజ్యాంగ రచయిత శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎన్నికలలో ఓడిన సంధర్బమూ ఉంది. అంత మాత్రాన వారు రాజకీయాలకు దూరమయ్యారా. ఇలా ఎంతో మంది ఓడినా కూడా తమ సేవలు విస్కృతంగా అందించారు. ఒక నాయకుడి సామాజిక బాధ్యతను ఒక ఓటమితో ముడి పెట్టలేము. చాలా వరకూ ఓటర్లూ డబ్బు, మద్యానికి ఆశపడి ఓటు వేయడం అధిక భాగంలో చూస్తుంటాము. కానీ అందరూ ఓటర్లూ అలాగే ఉంటారు అంటే పొరబాటే. పవన్ కళ్యాణ్ నిలబడిన రెండు చోట్ల కూడా అధిక డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచడం ప్రత్యర్థులకు ఒక విజయావకాశం అయితే, డబ్బులు పంచకుండా, మద్యం పోయకుండా చేయడం జనసేనకు ఓటమితనం. కానీ జనసేన ఎప్పటికీ అలా డబ్బు పంచకుండా మార్పు తీసుకురావాలనే కదా పోరాటం చేస్తున్నది. ఈ పోరాటంలో తను ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా ఎపుడో గెలిచేశాడు.
9. ప్రశ్న :: ఇంటర్మీడియట్ ఫెయిల్, ఆయన మీకు నాయకుడు ?
జవాబు :: మీరు చెప్పే ఈ ప్రశ్న మీ అవివేకతనాన్ని గుర్తు చేస్తోంది. ఒక నాయకుడి విలువ ఎప్పుడూ కూడా ఆయన చదివిన డిగ్రీలు, మతం మీద ఆధారపడదు. అలా అనుకుంటే చాయ్ అమ్మిన వ్యక్తి ఒక ప్రధాన మంత్రి కాలేడు. ఆయన చదువుకోలేకపోవచ్చు కానీ, కొన్ని లక్షల మందికి స్పూర్తి అయ్యాడు. మరి నీ ప్రకారంగా చూసుకుంటే ఎన్నో డిగ్రీలు సంపాదించిన అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నువ్వు పాటిస్తున్నావా? నిజాయతిగా ఓటు వేయగలుగుతున్నావా? లేక అక్రమంగా గెలిచే నాయకులను ఎదురిస్తున్నావా? చదువుకొన్న వాళ్ళు నీతులు చెప్తే పాటించవు గానీ, చదువుకోలేని వారికి నువ్వు వేదాలు నేర్పిస్తావా? ఈ ప్రశ్న అడిగే ముందు నీ స్థాయి ప్రశ్నించుకో? చదువుకోలేకపోయినా ప్రపంచ అత్యున్నత హార్వర్డ్ యునివర్సిటీ ఆహ్వానం మేరకు అక్కడ ప్రసంగించిన నేత.
10. ప్రశ్న :: తన చూట్టూ ఉన్నవాళ్లే ఆయన్ను నమ్మట్లేదు. వాళ్ళే పార్టీని వదిలేస్తున్నారు ?
జవాబు :: మీరు చెప్పినట్టూ అందరి ఆలోచనా భావాలు ఒకేలా ఉండాలంటే కష్టమే. ఒకప్పుడు ఆయన సాయం కోసం ఎదురుచూశారు. ఇపుడు సాయం తీరాక జారుకుంటున్నారు. ఒక తల్లి నుంచి పుట్టే బిడ్డకు, అ తల్లికే ఒకే భావాలు కలుస్తాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము. అలాంటిది భిన్న భావాలు ఉన్న ఒక పార్టీలో కుదురుకోవడం కష్టమే. కానీ, పార్టీ సిద్దంతాలు, భావాలు అర్థం చేసుకున్నా వారే ఆయన వెంట నడుస్తారు. అయినా ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేసి పార్టీ సీటు కోసం ఆశపడ్డారు. తీరా రాకపోయేసరికి పోయిన వాళ్ళు కొందరు అయితే, ఇపుడు ఉన్న అధికార పార్టీ ధన, పదవికి లొంగిపోయిన కొందరు. ఈ కష్ట సమాయాలలోనే కదా మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది తెలిసేది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ సిద్ధాంతాలకు అలవాటు పడలేదు అంటే, జనసేన పార్టీ భావజాలం ఎంత గొప్పగా ఉండాలి. ఉన్న ఒక ఎమ్మెల్యే గురించి ఆలోచించట్లేదు. పాతికేళ్ళ భవిష్యత్తు కోసం ఎదురుచూసే నాయకులను తయారు చేసుకోవడం కోసం ఇలాంటి చీడలను వదిలించుకుంటున్నాడు.
చాలా వరకూ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఓడిపోవడానికి ముఖ్య కారణాలు. ఇవి కేవలం విశ్లేషణ మాత్రమే. ఎవ్వరిని నొప్పించడానికి కాదు అని గుర్తించగలరు.
పైన చెప్పిన విషయాలన్నియు రచయిత యొక్క అభిప్రాయాలు మాత్రమే. మీకేమైనా సందేహాలు ఉంటే @Naresh_writes ట్విట్టర్ నందు సంప్రదించగలరు.