151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి జనసేన అంటే ఎందుకంత భయం – శ్రీ పవన్ కల్యాణ్ గారు…
తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చాను… అధికారాన్ని అడ్డుపెట్టుకుని మమ్మల్ని ఆపగలిగితే ఆపండి అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శిద్దామని వస్తే ఆపే ప్రయత్నం చేస్తున్నారు.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి జనసేన అంటే ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. ఇది ఏమైనా మీ జాగీరా అంటూ నిలదీశారు. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంపైనా వైసీపీకి ఎంత హక్కు ఉందో మాకూ అంతే హక్కు ఉందని… అధికారం ఉంది కదా అని పోలీసుల సాయంతో అడ్డుగోడలు కడదామని చూస్తే వాటిని బద్దలు కొట్టుకుని ముందుకు వెళ్తామని హెచ్చరించారు. నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, రైతుల్ని పరామర్శిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. నాయుడుపేటలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ..
“పరామర్శకు వచ్చిన మమ్మల్ని ఆపితే ఆపండి చూద్దాం. ఓడిపోతే చాలా మంది బయటకు రారు.. ఆశయం ఉన్నవాడికి గెలుపు ఓటములతో పని లేదు. వైసీపీ నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నా.. మీ అధికారాన్నిఅడ్డుపెట్టుకుని మమ్మల్ని ఆపండి చూద్దాం. ఈ ప్రాంతం మీ జాగీరా.. నేను వస్తే ఆపుతారా.. ఎంత మందిని ఆపుతారు? ఇక్కడికి వచ్చిన ఒక్క జనసైనికుడిని ఆపండి చూద్దాం. నేను రైతుల్ని పరామర్శించేందుకు వచ్చాను మీతో గొడవ పెట్టుకోవడానికి కాదు. సింహపురిలో పెరిగినవాడిని. ఎవ్వరికీ భయపడను. మేము వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టడం లేదు. మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోం. రోడ్ల మీదకు రావడానికి కూడా వెనుకాడం.
రెచ్చగొడితే ఏం చేయాలో తెలుసు
మీరు స్థాయి దాటి మాట్లాడినంత మాత్రాన భయపడను. పరామర్శకు వచ్చాం. మమ్మల్ని పరామర్శించనీయండి. రెచ్చగొడితే ఏం చేయాలో మాకు తెలుసు. వైసీపీ ప్రజాస్వామ్యబద్దంగా మాట్లాడితే మేమూ ప్రజాస్వామ్య బద్దంగానే మాట్లాడుతాం. నేను చూడడానికి మాత్రమే యాక్టర్ ని నా లోపల యాక్టర్ ఉండడు .పరాజయం పాలయినప్పటికీ రైతుల కోసం ధైర్యంగా బయటకు వస్తున్నాం.
తాటాకు చప్పుళ్లకు భయపడను
వైసీపీ నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అధికారం శివుడి మెడలో సర్పం లాంటిది. శివుడి మెడలో ఉన్నంత వరకే దానికి విలువ. రోడ్డు మీదకు వస్తే దాని పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అధికారం లేని రోజున వైసీపీ నాయకుల పరిస్థితి కూడా ఏంటో చూసుకోండి. భవిష్యత్తు ఆలోచించుకోండి. మా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇలాంటి తాటాకుచప్పుళ్లకు పవన్ కల్యాణ్ భయపడడు. అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని కాదు నేను. అన్యాయం జరిగితే బాధ్యతగా నిలబడతా. పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని. పోలీస్ శాఖ అంటే అపారమైన గౌరవం ఉన్నవాడిని. ప్రభుత్వం మాట విని మా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులుపెడితే దృష్టిలో పెట్టుకుంటా. అధికార వర్గానికి మద్దతు పలికే వారిని మర్చిపోను.
సామాన్యుల సమస్యలపై నిలబడే వ్యక్తిని నేను. భయపడే వ్యక్తులం కాదు. సింహపురి బిడ్డలం. నా ఊరు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి మనిషికి అండగా ఉండమని నేర్పింది. అందుకే రోడ్డు మీదకు వచ్చా. నెల్లూరు జిల్లా సామాజిక స్పృహ ఉన్న జిల్లా. మన కోసం నిలబడిన ప్రజలకు ఏదో ఒకటి ఇవ్వాలి అని నేర్పిన జిల్లా. మీరంతా బయటకు వచ్చి రైతుల పక్షాన నిలబడినందుకు పేరు పేరునా ధన్యవాదాలు. పార్టీ నాయకులు తుపాను నష్టం గురించి వివరించి రైతులు బాధల్లో ఉన్నారని చెప్పారు. కోవిడ్ పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని చాలా మంది చెప్పారు. అంత మంది కష్టాల్లో ఉన్నప్పుడు కాకపోతే ఎప్పుడు రావాలి బయటకు. అన్నంపెట్టే రైతు కష్టాల్లో ఉంటే ఇంట్లో కూర్చుని ఉపయోగం ఏంటి. ఈ పరిస్థితుల్లో వారికి భరోసా కల్పించేందుకే వచ్చా. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 35 వేల పరిహారం ఇవ్వాలి. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ తరఫున జై కిసాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. జనసేన నాయకులు ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్లండి. రైతులకు, ప్రజలకు అండగా నిలబడండి” అన్నారు.