అమరావతి, (జనస్వరం) : పెట్రోలు, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం వ్యాట్ ను కొంత మేరకు తగ్గించింది. ఆ తరహాలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రో ఉత్పత్తులపై తన వాటా వ్యాట్ ను తగ్గిస్తుందని అందరూ ఎదురు చూస్తుంటే ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం అలాంటి ఆలోచనైనా చేస్తుందా? కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.5 లీటర్ డీజిల్ మీద రూ.10 చొప్పున తగ్గించింది. కేంద్రం బాటలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ వాటా పన్నులను తగ్గిస్తున్నాయి. అస్సాం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్, గుజరాత్, గోవా రాష్ట్రాలు రూ.7 వంతున, ఒడిశా రూ.3 చొప్పున తగ్గించాయి. ఈ విధమైన తగ్గింపు వాహనదారులకు ఎంతో ఊరట కలిగిస్తుంది. ఆ విధంగా చేయాలనే ఆలోచన ఉందా లేదా? ఉంటే ఏ మేరకు రాష్ట్రం వాటా పన్ను తగ్గిస్తారో ప్రభుత్వం ప్రజలకు తెలియచేయాలి. ఇప్పటికే వ్యాట్ తోపాటు అదనపు పన్ను, సెస్సులను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. రోడ్ సెస్ పేరుతో ఇప్పటికే వందల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసింది. ప్రయోజనం ఏమిటి? కిలో మీటరు రోడ్డును కూడా అభివృద్ధి కాదు కదా మరమ్మతు కూడా చేయలేకపోయారు. ఈ స్థాయి పన్నులు, సెస్సులు చెల్లించినా ప్రజలకు ఏ భారం తప్పడం లేదు. కేంద్రం బాటలో ఇతర రాష్ట్రాల మాదిరే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్ మీద వ్యాట్ తగ్గించాలి. లేని పక్షంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాం అని నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు.