నెల్లూరు సిటీ, (జనస్వరం) : జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు మంగళవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా తయారైన రోడ్ల పరిస్థితిపై నిన్న మీడియాకి వివరాలు తెలుపుతూ రాష్ట్ర పంచాయితీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి శంకర్ నారాయణ గారులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ఖండించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారి స్పూర్తితో జనసైనికులు మూడురోజుల పాటు రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను సోషల్ మీడియాలో చూపే డిజిటల్ క్యాంపైన్ చేశారన్నారు. ఈ పోరాటంతో ప్రభుత్వంలో ఇప్పటికైనా చలనం ఏర్పడినందుకు సంతోషమన్నారు. ఇకపోతే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఇసుక ఉన్నా, కంకర ఉన్నా, గ్రావెల్ ఉన్నా, ఆఖరికి బంకమట్టి ఉన్నా, ఏ ఖనిజమైనా మాయమైపోయి ప్రక్కరాష్ట్రాలకు అక్రమ మార్గాల్లో వెళ్తుందంటే వాటిన్నంటిని వెనుక ఉండే మాఫియా డాన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అన్నారు. నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సగం పెన్నా నదిని త్రవ్వేసి 100 కోట్ల రూపాయలపైన అక్రమాలు చేసారని, ఆ అక్రమాల వెనుక మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. నెల్లూరు నగరంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఐ వేమారెడ్డిల అక్రమ బదిలీలకు ఈ ఇసుక అక్రమాలే కారణం అని అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా, ఏబీ బ్యాంకు ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు అప్పు చేశామని, ఇంకా ఆ బ్యాంకుల నుండి మిగులు నిధులు రావాల్సి ఉందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారని అసలు ఈరోజు రాష్ట్రాన్ని బ్యాంకులు నమ్మి అప్పు ఇచ్చే పరిస్థితే లేదని ఎద్దేవా చేసారు. వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి గతుకులు ఏర్పడ్డాయని మంత్రి పెద్దిరెడ్డి సెలవిచ్చారని, ఒకసారి ఆయన గతాన్ని గుర్తుతెచ్చుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ క్రిందట పాదయాత్ర చేసే సమయంలో గుంతలు పడిన రోడ్లమీద చెంగు చెంగున గెంతిన తీరుని గమనించాలని, ఆరోజు తాము అధికారంలోకి ఇలా రోడ్లపై గెంతే పరిస్థితులు లేకుండా చేస్తామన్న వారే ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలందరి చేత గతుకుల రోడ్లలో గెంతులు వేయించే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. ఈ రెండేళ్ళల్లో రోడ్ల విషయంలో తాము సాధించిన ప్రగతి ఏంటో చెప్పకుండా అప్పుల గురించి ఘనంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పుకోండి చూద్దాం? అని ప్రెస్ మీట్ మధ్యలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు ఒక ఫోటోని తీసుకుని ఈయనెవరో చెప్పుకోండి చూద్దాం అంటూ మీడియా వారిని అడిగారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరో చెప్పలేకపోయారు. దీంతో కేతంరెడ్డి ఆ ఫోటోని చూపిస్తూ మనం ప్రతిరోజూ రోడ్ల అధ్వాన్న పరిస్థితిని చూసి తిట్టుకుంటున్నాం కదా. ఆ రోడ్లకు, భవనాలకు సంబంధించిన రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ గారు ఈయన అని తెల్పుతూ ఎద్దేవా చేసారు. ఇప్పటివరకు ఎక్కడున్నారో కూడా తెలియని మంత్రి శంకర్ నారాయణ కూడా జనసైనికుల పోరాటం దెబ్బకు మీడియా ముందుకు వచ్చారని అన్నారు. ఈ మంత్రి గారైనా వాహనదారుల నుండి ఒక లక్ష రూపాయలకు పద్నాలుగున్నర వేల రూపాయలుగా వసూలు చేస్తున్న రోడ్డు పన్నుని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుపుతారని ఆశిస్తే ఈయన కూడా NDB బ్యాంకు, రోడ్ల కార్పొరేషన్ నుండి అప్పులు గురించే చెప్పారని, దీంతో రాష్ట్రంలోని రోడ్లు బాగు అవ్వాలంటే తమకు అప్పులు చేయడం ఒక్కటే మార్గం తప్పించి మరోరకంగా పరిపాలన చేయలేమనే సంకేతం ఇచ్చినట్లు ఉందన్నారు. ఎన్ని మార్గాలైతో ఉన్నాయో అన్ని మార్గాల్లో ఈ ప్రభుత్వం అప్పు చేసేసి ఉందని, ఆఖరికి పొదుపు మహిళలు దాచుకునే డబ్బుని కూడా షూరిటీ పెట్టి అప్పు అడుగుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకు కూడా అప్పు ఇవ్వదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు వచ్చే వానకాలానికి రోడ్లు బాగయ్యేపనైతే ప్రణాళికలు మాత్రమే కాదు, ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ అంశమై జనసేన పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని జరుపుతామని కేతంరెడ్డి గారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, బొబ్బేపల్లి సురేష్ నాయుడు, కాకు మురళి రెడ్డి, శ్రీను ముదిరాజ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.