అవని నుండి అంతరిక్షాన్ని చేరి విజయకేతనాలై చరిత్ర సృష్టిస్తున్నా ఏదో ఒక పూట, రోజొక చోట కామాంధుల చేతుల్లో గాయమవుతూ గతంగా మారిపోతున్నాయి ఆడపిల్లల రక్తసిక్త గాధలు. ఎన్నటికీ తీరని ఆత్మ ఘోషలుగా వినపడుతున్నాయి. పుట్టిన నాటి నుండి గిట్టేదాకా తప్పని ఆంక్షలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు మాటున ఉంటూనే పెట్టని కోట లాంటి ధైర్యసాహసాలు, ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ ఎదుగుదలకు ఎన్నో మెట్లు పేర్చుకుంటూ శిఖరాలను అతివలు అధిరోస్తున్నా సమాజంలో తప్పని లైంగిక వేధింపులు హత్యాచారాల వల్ల దినమొక గండం నూరేళ్ళ ఆయుష్షులా సాగుతోంది ఆడపిల్లల జీవన గమనం. పొత్తిళ్ళలో ఉన్న పాపాయిలు, ముదిమిలో ఉన్న మహిళలు సైతం కామాంధుల దాహానికి బలవుతూనే ఉన్నారు. రక్కసి కోరల్లో చిక్కిఅయినవారికి దక్కకుండా పోతున్నారు. కన్న వారికి కంటి నీరు ధారలుగా గుండె కోతతో గాయాలు కలిగించే ఈ రక్త దాహం ఆగే రోజు రాదేమో... ఎన్నో కలలు కలబోసి ఆశలు పంటగా మమకారంతో పెంచుకునే ఇంటి బిడ్డలకు ఊహించని ఉప్పెన వచ్చి ముంచేసినట్లు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎదురువుతాయో తెలియని దుర్భర పరిస్థితులను కల్పించే కర్కశ కామాంధులు నివురు కప్పిన నిప్పులా పక్కనే సాధు జంతువు రూపం కప్పుకొని తిరిగే మానవ మృగాలను గుర్తు పట్టలేము. నీచ, నికృష్టమైన ఆలోచనలు నింపుకొని నది వీధుల్లో తిరిగే నరరూప రాక్షసుల ఆనవాళ్లు తెలుసుకోలేము.
అమ్మగా,చెల్లిగా, అక్కగా, స్నేహితురాలిగా, భార్యగా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచే నెచ్చిలికి ఎన్ని కష్టాలు, ఎన్ని ఎదురీతలు, ఎన్ని గండాలు ఎన్ని అవమానాలు నిత్యం అమ్మతనం మీద జరిగే అకృత్యాల నీడల జాడలేని రోజు చూడమేమో. పసితనాన్ని చిధిమేస్తున్న నరరూప రాక్షసుల అరాచకాలు, అత్యాచార దాడుల వార్తలు వినని రోజు ఉండదేమో. సభ్య సమాజాన్ని పట్టి పీడిస్తున్న చీడలా ఆడపిల్ల మనుగడకు పట్టిన పీడలా దాపురించి, దుర్మార్గపు దాష్టిక పాశువిక ఘోరాలు చేస్తూ, ఏ చట్టమూ శిక్షించలేని నేరాలుగా ఆడపిల్లను కాపాడలేని చట్టాల వెనుక దాగిన వాస్తవాల మాటున, భద్రత లేని సమాజంలో బలి అవుతుంది. ఆడపిల్లల జీవితాలు మాత్రమే అర్థరాత్రి నడి రోడ్డుమీద అతి కిరాతక అమానుషాలు జరిగితేనో తమ బిడ్డకు న జరిగిన అన్యాయానికి న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేస్తేనో తప్ప ఏ న్యాయం జరగట్లేదు. ఒక్కో సంఘటనలో న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తూ అలసి సొమ్మసిల్లి పోతున్న కుటుంబాలు ఎన్నో...
స్త్రీలను దేవతలుగా శక్తి స్వరూపిణిలుగా పూజించే మనదేశం మహిళలకు భద్రత లేని, అధిక లైంగిక హింస, మహిళల అక్రమ రవాణా లో దేశాల్లో మనం ఒకటో స్థానంలో ఉంది. లింగ వివక్షతలో 3వ స్థానం మహిళల ఆరోగ్యం విషయంలో 4 వ స్థానం గంటకు 4 అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళల పట్ల నేరాలు 83% గా ఉన్నాయని ఓ సర్వే తెలిపింది. చట్టాలు,న్యాయం ధర్మం చెప్పుకోవటానికి బాగుంటాయి కానీ నిజానికి చట్టాలు ఎవరికి వర్తిస్తున్నాయి?ఎవరికి న్యాయం చేస్తున్నాయి? వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి దారుణాలు జరుగుతుంటే కళ్ళుండి చూడలేని ధృత రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం ఉపయోగం రక్షణ కల్పించలేని అధికారం ఎందుకు? న్యాయం చేయలేని చట్టాలు ఎందుకు? అన్నింటిలో సగం అన్నింటిలో సమం అని సాధికారత సాధిస్తున్నాం అని చెప్పుకుంటున్నా అడుగడుగునా మహిళల జీవితంలో మగాడు మృగాడుగా తారసపడితే మహిళల భద్రత ప్రశ్న గానే మిగిలిపోవాల్సిందే.
రక్షణ అనేది అక్షరాల్లో చూసుకోవాల్సిందే....
దిక్కూ దెస లేని చట్టాలు చేసి చోద్యం చూసే ప్రభుత్వాలు ఉన్నంతకాలం నడిరోడ్డు ఎక్కి ప్రాధేయ పడినా న్యాయం దొరకదు మాన ప్రాణాలకు నగదు విలువ కట్టి నగుబాటు చేయటం తప్పదు. కుటుంబ వ్యవస్థలో నేడు స్వేచ్ఛ ఇవ్వటంతో పాటు స్నేహపూర్వకంగా తల్లీ తండ్రులు ఉంటూ ఆ స్వేచ్ఛ దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలి క్రమశిక్షణ, జవాబుదారీ తనం, నైతిక విలువలు నేర్పాలి. చట్టాలు మారాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరగా శిక్షలు ఖరారు చేయాలి, న్యాయస్థానం విధించిన శిక్షలు వెంటనే అమలు జరగాలి. నాడైనా నేడైనా లింగవివక్షత, హింస, అత్యాచారాలు మహిళల హక్కులను కాలరాస్తుంటే, అమ్మాయిని 'అమ్మ' గా చూడగలిగే మంచి రోజులు రావాలని కోరుకోవటం తప్ప ఇంకేమి చేయలేని నిస్సహాయులం.
- టీమ్ నారీస్వరం
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com