నేటి రాజకీయ వ్యవస్థలో ప్రజల పాత్ర ఎంత ? ఏమిటి ??
ఈరోజు మనం మన జీవితాల్ని, మన బతుకుల్ని మన భవితని, రాబోయే తరాల భవిష్యత్ ని ప్రభావితం మాత్రమే కాదు శాసించే రాజకీయ వ్యవస్థ గురించి సామాన్య ప్రజలుగా మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రజలు అంటే నేను, మీరూ, మనమే.. రాజకీయ వ్యవస్థ అంటే మన చేత, మన కోసం మన అందరి అవసరాలు తీర్చడానికి ఎన్నుకోబడిన ఒక వ్యవస్థ. దానికి మనం పెట్టుకున్న పేరే ప్రజాస్వామ్యం.
మరి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఎంత ? పేరులోనేనా ప్రజస్వామ్యం? పేరుకేనా ప్రజస్వామ్యం ?
మన సమస్యలు తీర్చడానికి, మన ఇబ్బందులు తొలగించడానికి, మనం పన్నులు కట్టి ఆ పన్నుల ద్వారా అభివృద్ది చేయమని, మన జీవన విధానాల్ని మెరుగు పర్చమని మన ప్రతినిధులుగా కొందరిని ఎన్నుకొని వారికి మన చెమట కష్టం నుండే జీతాలు ఇస్తూ ఒక నిర్దిష్టమైన కాల పరిమితి విధించి బాధ్యత అప్పజెప్పితే, పదవి ఇచ్చిన వాళ్ళ పైనే ప్రతాపం చూపిస్తున్నారు. కనీస పట్టింపు లేకుండా ఆ అధికారమే శాశ్వతం అనే భ్రమలో బతికేస్తున్నారు. పదవిలోకి వచ్చాక ఈ ప్రజలకి మేము జవాబుదారీ కాము, మమ్మల్ని ప్రశ్నించే స్థాయి, అర్హత ఎవరికీ లేదు అనే ఆలోచనా విధానంలోకి వెళ్ళిపోయారు నాయకులు. ప్రజల్ని బలహీనులుగా, అశక్తులుగా, నిసహాయులుగా చేసుందుకు వారి అధికారాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రజల పక్షాన నిలిచే వ్యవస్థల్ని అంగ బలం, అర్ధ బలంతో హై జాక్ చేసేస్తున్నారు. ఆ నాయకుల తాలూకా అసమర్ధత, అవినీతి, అక్రమాలు, చేతకాని తనం ప్రజలకి తెలియకుండా ఉండేందుకు. ప్రజల నుండి వచ్చే ప్రశ్నలు, నిరసన, వ్యతిరేకత అణచివేసేందుకు పత్రికల్ని, వార్తా మాధ్యమాల్ని చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారు. వ్యక్తులుగా ఒక్కరూ వెళ్ళి ఆ నాయకుల్ని ఇదేమని ప్రశ్నించే సాహసం ఎవరమూ చేయలేము. ఎందుకంటే వారెంతటికి తెగిస్తారో మనకి తెలుసు, వ్యవస్థలుగా పౌర సమాజం తరఫున ఎవరైనా గొంతెత్తితే వారిని భయభ్రాంతులకి గురి చేసి సామ, దాన, భేధ దండోపాయాలు ప్రయోగించి వారి నోళ్ళు మూయిస్తున్నారు. అధికారం వల్ల వచ్చిన అహంకార౦ వల్ల వాళ్ళు ఇచ్చిన హామీల గురించి గుర్తు చేస్తే మండి పడుతున్నారు. ప్రశ్నించే తత్వాన్ని అణచివేస్తున్నారు. ప్రజలుగా ఓటేయడం వరకే మన పరిమితి అని. మన పరిధి కేవలం వీళ్ళకి పదవులు కట్టబెట్టడం వరకే అని నిర్దిష్టం చేసేస్తున్నారు మనల్ని. అయిదేళ్లకొసారి, ఓట్లు అడిగేందుకు మెమోస్తాం, మోసగిస్తాం, మయామాటలు, కట్టు కథలు, అరచేతిలో వైకుంట౦ చూపిస్తాం. అవన్నీ నమ్మేసి ఓట్లు వేయండి చాలు. పదవొచ్చాక మళ్ళీ మేము మా పనిలో పడిపోతాము, ఐదేళ్లు విలాసాలు, భోగాలు, సకల సుఖాలు అనుభవిస్తాము, మీ గతి ఏమైపోయినా మాకక్కర్లేదు, మళ్ళీ ఎన్నికలోస్తే నమ్మించెంధుకు మరో కట్టు కథ చెబుతాం అనే ధోరణిలో స్థిరపడిపోయారు నాయకులు. వీళ్ళకి పదవి ఇచ్చే సాధనాలుగ మాత్రమే మనల్ని, అంటే ప్రజల్ని చూస్తున్నారే తప్ప, ఆ ప్రజలకి ఒక హక్కు ఉంటుంది, వారికి మనం జవాబుదారీగా ఉండాలి, మన పదవి, మన అధికారం కేవలం ఆ ప్రజలిచ్చిన అవకాశమే తప్ప మరోటి కాదు అనే కనీస విచక్షణ కూడా లేకుండా పోయింది ఈ నాయకులకి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నాయకులు మనల్ని మనుషులుగా కూడా ఏనాడూ పరిగణించరు.
ఓట్లు వేస్తే ఓటర్లం – ఆ ఒక్క రోజుకే ఏక్ దీన్ కా సుల్తాన్లమ్ మనం
వీళ్ళ సభలకి వస్తే జనాలం
ప్రశ్నిస్తే వ్యతిరేకులం
ఎదురిస్తే విద్రోహులం
బలి అయితే బాధితుల౦
చస్తే శవాల౦
మరి మనల్ని అసలు మనుషులుగా చూసేదేప్పుడు ?? మనకి భాద్యతగా మనకి జవాబుదారీగా ఉండేదేపుడు?? వీళ్ళేమో దిగొచ్చినట్లుగా భావిస్తారు... మనల్నేమో మనుషులుగా కూడా గుర్తించరు. వీళ్ళు మనల్ని పురుగుల కంటే హీనంగా చూస్తారు... మనం వీళ్ళని దేవుళ్లుగా కొలవాలని ఆశిస్తారు. ఆ స్థాయిలో ఉంటుంది వీరికి అధికార దురహంకారం. మరి ప్రజలుగా మనం ఏం చేయగలం? నిజంగానే మనం సామాన్యుల౦, పైసా, పేరు, పరపతి, పరిచయాలూ ఏవీ లేని నిస్సాహాయులం, అశక్తుల౦, రోజూ ఒక యుద్ధం చేస్తే తప్ప మన కడుపు నిండదు. మన బతుకుల్ని మనం చూసుకునే సరికే రోజు గడిచిపోతుంది. అదే అదునుగా ఈ రాజకీయ నాయకులు మన నడ్డి విరుస్తున్నారు. మరి ఎలా ? రోడ్లెక్కి నిరసనలు చేయలేం. రోజులకి రోజులు దీక్షలు చేయలేం, అన్నీ వదులుకొని ప్రత్యక్ష పోరాటంలోకి దిగలే౦, నేరుగా వీళ్లతో తలపడలేము ?? మరి ఎలా?? ఇలానే భరిస్తూ ఉంటే వాళ్ళు కూడా అలానే బాదేస్తూ ఉంటారు, భాదిస్తూ ఉంటారు... ఎలా మరి ?? భరించే సహనమూ లేదు. ఎదురు తిరిగే సామర్ధ్యమూ లేదు.. ఎలా మరి ??
మన చిన్నప్పుడు చదువుకున్నాం.
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
మనం కూడా చీమల్లాంటి వాళ్ళమే, కష్టపడి గూడు కట్టుకుంటే ఈ పాములొచ్చి చేరాయి. ఒక్కళ్లుగా మనం ఏదీ చేయలేము.. అదే సమూహంగా అయితే సాధించగలం. మనం ఇందాక అనుకున్నట్టు ఉద్యమాలూ, పోరాటాలు చేయాల్సిన పని లేదు...మార్పుని మన ఇంటి నుండే మొదలు పెడదాం. "Lets Discuss Politics, Lets Debate Politics". రాజకీయం అంటే అదేదో మనకి సంబంధం లేనిది అనే అపోహ నుండి బయటకొద్దాం. రాజకీయాల పైన అవగాహన పెంచుకుందాం, అదేమీ రాకెట్ సైన్స్ కాదూ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత కష్టతరమైనదీ కాదు. మన బతుకుల్ని శాసించే వ్యవస్థ గురించి మనం తెలుసుకోకపోతే ఎలా? మన ఇంట్లోనే మనకి కుదిరినప్పుడు
రాజకీయాల్ని చర్చిద్దాం. టీవీల్లో ఈ రాజకీయ నాయకులు అది చేశాం ఇది చేశాం అని డాంబికాలు పలుకుతుంటే వాస్తవాలు ఏమిటో తెలిపేలా చేద్దాం. ఎప్పటి నుండో ఈ సంప్రదాయ రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావంలో ఉన్న మన తల్లిదండ్రులకి ఆ నాయకులు ఎలాంటి దుస్థితిలో మనల్ని ఉంచారో, ఆధారాలతో తెలిసేలా చేద్దాం. మన ఇంట్లో వాళ్ళతో అంత ఫ్రీ గా మాట్లాడలేం ఇలాంటి విషయాలూ అనుకుంటే, మన సన్నిహితులతో, స్నేహితులతో నింపాదిగా చర్చిద్దాం, ఆ స్నేహ బంధం చెడిపోకుండా. మనమేమీ వాళ్ళు అభిమానించే నాయకుడ్ని దూషించే పనీ లేదు. ఉండాల్సింది ఎలా & ఎలా ఉంటుంది, జరగాల్సిన విధానం ఏమిటి? జరుగుతుంది ఏమిటి? చెప్పిందేమీటీ? చేస్తుందేమిటీ? అని మంచి చెడూ వాళ్ళ ముందు పెడితే సరిపోతుంది. ఈ ప్రయత్నం ఒక ప్రక్రియగా చేస్తూ వెళితే ముందు అవహేళనలూ, అవమానాలూ ఉన్నా చివరికి ఆలోచన రేకెత్తిస్తుంది, ఆ ఆలోచన మార్పు దిశగా పయనిస్తుంది. అలా ఒక్కొక్కరం మన కుటుంబాలని ఆలోచించేలా చేయగలిగితే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు తప్పక వస్తుంది. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగే కొద్దీ నాయకుల్లో భయం, బాధ్యత రెండూ పెరుగుతాయి.
ఆ దిశగా ప్రయత్నం మొదలు పెడదాం. ఇప్పటికే మొదలు పెట్టిన వారికి కృతజ్ఞతలు..
మొదలు పెట్టాల్సిన వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను...
by
మీరు ఈ మొత్తం యూట్యూబ్ లొ చూడాలి అనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.
https://youtu.be/CbsvGnswwm8
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com