భారత రాజ్యాంగం ఆర్టికల్ 47 ప్రకారం "Duty of the state to raise the level of nutrition and the standard of living and to improve public health" అనగా (ఈ రాజ్యం యొక్క కర్తవ్యం ప్రజలందరికీ పౌష్టికాహార విలువలనూ, ప్రజా ఆరోగ్యాన్ని పెంచడమూ మరియు జీవన పురోగతిని పెంపొందించడం).
2014 జరిగిన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో రకాల మార్పులు జరిగాయి... ఆర్థికంగా లోటు ఏర్పడి, రాజకీయ అనిశ్చితి అనేది నెలకొన్నది.. 2014 ఎన్నికల తర్వాత ఎంతో అనుభవం, విజనరీ కలిగిన నాయకుడని ప్రజలు నమ్మి టీడీపీకి అధికారం అప్పచెపితే గ్రాఫిక్ మాయాజాలంతో అభివృద్ధి చేస్తామని మసిపూసి మారేడుకాయ చేసినట్లు నమ్మి ఓట్లేసిన వారిని నట్టేట ముంచారు... 2019 ఎన్నికల టిడిపి ప్రభుత్వాన్ని పాతాళానికి దించి వైసీపీ ప్రభుత్వానికి అధికారం కట్ట పెడితే నవరత్నాల పేరుతో అభివృద్ధి చేస్తుంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల నడిసముద్రంలో తోసేస్తుంది. సంక్షేమం అంటే నవరత్నాలు అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితి తయారైంది. ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా అదే తీరు. ముఖ్యమంత్రి ప్రారంభిస్తామన్న వైఎస్ఆర్ కల్యాణ కానుక పథకానికి బడ్జెట్లో మోక్షం లభించలేదు. విదేశీ విద్య పథకం, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. గత బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలకు జరిపిన కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయలేదు. ఆయా శాఖలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేయకుండా నవరత్నాలకు మళ్లించారు. బీసీ సంక్షేమ శాఖ పరిస్థితి కూడా ఇంతే. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు గతంలో కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు.
తాము చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం అని ఓ సామెత ఉంటుంది. రాజకీయాల్లో దీన్ని వందకు వంద శాతం ఉపయోగిచుకుంటారు రాజకీయ నేతలు. తాము చేసేది మాత్రం సంసారం అని.. ఇతరులు చేస్తే అది వ్యభిచారం అంటారు. తాము ఏదైతే చేశారని విమర్శించామో.. ఇప్పుడు అదే చేస్తూ.. మంచే చేస్తున్నామని వాదించడం కూడా రాజకీయాల్లో ఓ భాగం. ఇలాంటివి రివర్స్ రాజకీయాలు జరుగుతూ ఉన్నా ఏపీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మూడేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కనీస సమాచారం ఇవ్వలేదు., టీడీపీ హయాంలో చేసిన అప్పుల గురించి చెప్పారు. ఆ లెక్క ప్రకారం ఐదేళ్లలో రూ. లక్షా పదివేల కోట్ల అప్పులు చేసింది. కార్పొరేషన్లు… గ్యారంటీలు ఇలా అప్పుల లెక్కలన్నీ చెప్పారు. అవన్నీ పాత విషయాలే కానీ ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు మాత్రం చెప్పలేదు. కానీ వారు చేసిన అప్పులన్నీ అవినీతికి వెళ్లాయని.. మేం చేసే అప్పు పేదవాళ్లకు వెళ్తోందని జగన్ ప్రకటించుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అప్పులు అవినీతి కారణం టీడీపీ వారి జేబుల్లోకి వెళ్లాయని.. తాము మాత్రం అప్పులు చేసి జనం ఖాతాల్లో వేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటలేదని.. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రతీ ఏడాది నిబంధనలను దాటి రుణాలు తీసుకుందని, ఇలా చేసినందునే ఇప్పుడు ప్రభుత్వానికి రూ. 16,419కోట్ల రుణం కోత పెట్టారు అని చెప్తున్నారు. దీని కోసం కేంద్రంతో యుద్దం చేయాల్సి వస్తుందని జనాలను నమ్మిస్తున్నారు. అప్పుడు ఇలా ఇప్పుడు మీరెలా అంటూ అధోగతి అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ కాలయాపన చేస్తున్నారు...
నవరత్నాల ముసుగులో వైసీపీ ప్రభుత్వం సామాన్యుడికి గుండెల్లో ఉంటుందన్న వైసిపి నాయకుల మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉంది... సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయకుండా అప్పులు తీసుకొచ్చి వాటిని జనానికి ఎన్ని రోజులు పంచి పెడతారు. వారికి వారే విమర్శ చేసుకోవాలి ఇతర రంగాల అభివృద్ధి గురించి సమస్యల గురించి ప్రశ్నిస్తే కరోనా కష్టాలన్నీ ఏకరువు పెట్టడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటైపోయి ఉంది. సంక్షేమ క్యాలెండర్ అంటూ జగన్ రెడ్డి, ఒక్క అభివృద్ధి పనికి సంబంధించి క్యాలెండర్ విడుదల చేశారా ?? అదుపులేని అప్పులతో, పాలకుల అసంబద్ధ నిర్ణయాలతో 2.51 కోట్ల జనాభా ఉన్న శ్రీలంక అతలాకుతలం అవుతుంటే 5.2 కోట్ల జనాభా ఉన్న ఏపీ పరిస్థితి ఎలా మారవచ్చో ఊహించడం కష్టం. ఇకనైనా పాలకులు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభం వైపు నెట్టేయకుండా జాగ్రత్త పడితే మంచిది. అనవసర ఖర్చులు పెట్టడం బదులు ఆదాయ మార్గాలని పెంచుకునే ఆలోచన చేసి వుంటే ప్రజలు అవస్థలు తగ్గేవి. సంక్షేమం పేరుతో ఆ పధకాలకి డబ్బు కోసం అదే ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన పాలకుల అసలు రూపం ప్రజలు తెలుసుకోవాలి.
Written By #Naareeswaram
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com