నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 294వ రోజున 46వ డివిజన్ లస్సీ సెంటర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి సమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో లస్సీ సెంటర్, కాపు వీధి, ట్రంక్ రోడ్డు ప్రాంతాలు పురాతన రోజుల నుండి నేటి వరకు నగర ఆర్ధిక పురోగతికి చిహ్నాలు అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ వ్యాపార సంస్థల పోటీని తట్టుకుంటూ నిలబడే పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడినాయని అన్నారు. వ్యాపారులకు వ్యాపారాభివృద్ధి నిమిత్తం వైసీపీ ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం లేదని, పైపెచ్చు కోవిడ్ సందర్భంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసారని గుర్తు చేసారు. పవనన్న ప్రభుత్వంలో పరిస్థితులు ఇలా ఉండవని, నగరంలో ప్రతి వ్యాపారస్తునికి అండగా నిలుస్తామని, అందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.