●పవనన్న ప్రజాబాటలో ప్రజలకు హామీ ఇచ్చిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీకి అవకాశం కల్పిస్తే నగరంలో శాశ్వతంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామన్నారు ఆ పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. గత రెండు వారాలుగా మండుటెండను సైతం లెక్కచేయకుండా ఒక్క 3వ డివిజన్ లోనే ఒక్క ఇల్లు కూడా వదలకుండా ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజలను పలుకరించి సమస్యల అధ్యయనం చేస్తున్న పవనన్న ప్రజాబాట 14వ రోజుకి చేరింది. సోమవారం మైపాడు రోడ్డు అరవింద్ నగర్ లోని పలు విధుల్లో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డికి ప్రజలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. ప్రతి సమస్యని తన పుస్తకంలో వ్రాసుకున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి తమ పరిధిలో పూర్తి చేయగలిగే చిన్న సమస్యలను తామే పరిష్కరిస్తామని, మిగిలిన వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేలా చేస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత 14 రోజులుగా 3వ డివిజన్లో పవనన్న ప్రజాబాట చేస్తున్నామని, మరో వారం రోజుల పాటు కూడా తిరిగితే 3వ డివిజన్ పూర్తవుతుందని, నెల్లూరు సిటీ నియోజవర్గంలో 28 డివిజన్లు మొత్తం పవనన్న ప్రజాబాట ద్వారా తిరగడానికి సంవత్సరం పట్టినా, 400 రోజులు పట్టినా ఫర్వాలేదని, కానీ ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి కుటుంబాన్ని స్వయంగా పలుకరించి సమస్యలు తెలుసుకుంటా అని అన్నారు. రెండు వారాల్లో 3వ డివిజన్ లోని మైపాడు రోడ్డు పరిసర ప్రాంతాలైన కిసాన్ నగర్, ప్రశాంతి నగర్, మధురా నగర్, సింహపురి కాలనీ, రాజీవ్ గాంధీ కాలనీ, అరవింద్ నగర్, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య తిష్ట వేసి ఉందన్నారు. ప్రతి ఇంటి నుండి రకరకాల పన్నులు కట్టించుకుంటున్న ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. ప్రధాన మైపాడు రోడ్డు మొదలు, లింకు రోడ్డులు అధ్వాన్నంగా ఉన్నాయని, కాలువలు, డ్రైనేజీ నిర్వహణ సరిగ్గా లేనట్లు గుర్తించామని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన పార్టీని గెలిపించాలని, పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించాలని పవనన్న ప్రజాబాట ద్వారా ప్రతి కుటుంబాన్ని కోరుతున్నామని అన్నారు. జనసేన పార్టీకి అవకాశం కల్పిస్తే నెల్లూరు సిటీలో శాశ్వతంగా నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని, ఇప్పుడు తాము అధ్యయనం చేసిన 3వ డివిజన్లో ప్రధాన మైపాడు రోడ్డుతో సహా లింకు రోడ్లన్నీ ఆధునీకరిస్తామని, ఈ ప్రాంత ప్రజలకు అణువుగా, ఆహ్లాదంగా, దగ్గరగా ఉండేలా చిల్డ్రెన్స్ పార్కు తరహాలో పెద్ద పార్కుని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి అభివృద్ధిపరుస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.