– వైసీపీని కాదు ఐపీసీని అమలు చేయండి
– పోలీసులు సెక్షన్ 307ను అపహాస్యం చేస్తున్నారు
– రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేస్తాం
– మీడియా సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి ( జనస్వరం ) : పోలీసులు సెక్షన్ 307ను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన, టిడిపి, వామపక్షాల ముఖ్య నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా పధకం ప్రకారం హత్య చేయాలని ప్రయత్నిస్తే పెట్టాల్సిన సెక్షన్ 307 కేసును ప్రెస్ మీట్ పెట్టిన మహిళలపై పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే పోలీసులు లోపలికి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకుంటే పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కేసు పెట్టడం దారుణమన్నారు. గతంలో విశాఖ పట్నంలోనూ వాటర్ బాటిళ్లు విసిరారని 92 మంది జనసైనికులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తే… న్యాయమూర్తి 9 మందికి మాత్రమే రిమాండ్ విధించారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపికి చెందిన వెయ్యి మందిపై కేసులు పెడితే అందులో సింహభాగం హత్యాయత్నం కేసులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వేపనపల్లిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ అడిగినందుకు కొంత మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. జిల్లాలో సెక్షన్ 307ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీని కాకుండా ఐపీసీని ఫాలో అవ్వాలని కోరారు. అధికార పార్టీ నాయకులు తల పగలకొడితే హత్యాయత్నం కేసులు నమోదు చేయని పోలీసులు… తమ నాయకులు, కార్యకర్తలపై మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. చివరకు దిష్టిబొమ్మలు దగ్దం చేసినా 307 కేసులు పెట్టడం దారుణమన్నారు.
రాష్ట్రంలో హత్యాయత్నం కేసులను దుర్వినియోగం చేస్తున్న పోలీసులపై ప్రవేటు కేసులు వేస్తామన్నారు. అలాగే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రితో పాటు సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాస్తామన్నారు. రాష్ట్రంలో పోలీసులు సెక్షన్ 307ను దుర్వినియోగం చేస్తున్న వైనాన్ని ఇమెయిళ్ల ద్వారా వారి ద్రుష్టికి తీసుకువస్తామని తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, ఆ అధికారం పోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం చేస్కోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ పెడుతున్న తప్పుడు కేసులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్, కార్యదర్శి ఆనంద్, నగర నాయకులు పార్ధు, కొండా రాజమోహన్, దినేష్ జైన్ , రాజేష్ ఆచారి, కిరణ్ కుమార్, సీనియర్ నాయకులు నాగరాజా, రమేష్ నాయుడు, జనసైనికులు మోహిత్, బాలాజీ,ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.