నెల్లూరు, జూలై 24 (జనస్వరం): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని డీఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్స్ మీట్ 4.0లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడి పిల్లల చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హైస్కూల్‌ను అద్భుతంగా నిర్మించిన డీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని అభినందించి, సంస్థ ప్రతినిధి నాగరాజును సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2024 ఎన్నికల సమయంలో వీఆర్ పాఠశాల అభివృద్ధికి ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో పునర్నిర్మించామని తెలిపారు. వీఆర్ పాఠశాలలో చదివిన ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 15 ప్రభుత్వ పాఠశాలలను దాతల సహకారంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు ఉన్నతస్థాయిలో ఉన్న తన స్నేహితులు ముందుకు వచ్చారని చెప్పారు. పిల్లల చదువుపై ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించిన మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పేరెంట్–టీచర్స్ మీటింగ్ ఉద్దేశం విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుని వాటికి అనుగుణంగా ప్రోత్సహించడమేనని వివరించారు. ప్రతి పాఠశాలలో తరగతి గదులతో పాటు విద్యార్థుల ప్రతిభ, వికాసానికి అవసరమైన 18 రకాల ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చదువుతో పాటు సంగీతం, క్రీడలు తదితర రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. తన విద్యార్థి దశను గుర్తు చేసుకుంటూ, తాను పదో తరగతిలో ఒకసారి విఫలమైనప్పటికీ పట్టుదలతో చదివి తర్వాత ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై ఎస్వీ యూనివర్సిటీలో ప్రథమ స్థానం సాధించానని తెలిపారు. బాల్యంలో తన గురువు నారాయణమూర్తి మాస్టారు వేసిన బలమైన పునాదే తన జీవితాన్ని మార్చిందన్నారు. తాను చదివిన పాఠశాలలోనే పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా విద్యపై ఆసక్తి, కృషితో ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగినందుకు గర్వంగా ఉందని పేర్కొన్న మంత్రి, నారాయణ విద్యాసంస్థల్లో దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యాభ్యాసం చేస్తుండగా, 60 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 23 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నారాయణ గ్రూప్ ఆధ్వర్యంలో ఉచితంగా ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ అందజేస్తామని ప్రకటించారు. తాను వీఆర్‌సీలో చదివే రోజుల్లో పేదరికం కారణంగా పాఠశాలకు నడిచి వెళ్లేవాడినని, ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పారు. అలాంటి పరిస్థితులు నేటి విద్యార్థులకు రాకూడదనే ఉద్దేశంతో రూ.6 కోట్ల సొంత నిధులతో 10 వేల సైకిళ్లు కొనుగోలు చేశామని, ఈ నెల 27న తొలి విడతగా 7 వేల సైకిళ్లను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు కనీస వసతులు లేక ఎదుర్కొన్న ఇబ్బందులను నేటి పిల్లలు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఫెయిల్ అయ్యారనే కారణంతోనో, మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతోనో పిల్లలను తల్లిదండ్రులు మందలించడం సరికాదని, సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఇచ్చి వారిలో మార్పు తీసుకురావాలని సూచించారు. తాను ఏ దేశానికి వెళ్లినా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు తారసపడతారని, వారిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని, ఒక ఉపాధ్యాయుడికి అంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డీఈవో బాలాజీరావు, ఎంఈవో తిరుపాల్, ప్రిన్సిపాల్ పద్మావతి, డివిజన్ టీడీపీ నేతలు అన్నంగి ప్రసాద్, బీజేపీ నేత మిడతల రమేష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
