నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ ఆశీర్వదించాలని, పవనన్న ముఖ్యమంత్రి అయితేనే అగమ్యగోచరంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిలో పురోగతి కనిపిస్తుందని, దానికోసమే పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహాన్ని రూపొందించారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాటలో ప్రజలకు తెలిపారు. 16వ రోజున పవనన్న ప్రజాబాటలో స్థానిక మైపాడు రోడ్డు వెంగళరెడ్డి నగర్, రాధాకృష్ణ స్విమ్మింగ్ పూల్ రోడ్డు వద్ద ప్రతి ఇంటికి తిరిగి సమస్యలను అడుగుతుంటే పలువురు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను విని వారితో మాట్లాడుతూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచారని, తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధితులతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ప్రభుత్వంలో కొద్దిమేర చలనం వచ్చిందని గుర్తు చేసారు. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లిప్త ధోరణి, చేతకానితనం అని విమర్శించారు. రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టిన జగన్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా వేలం వేస్తే ఆ సొమ్మును కూడా స్వప్రయోజనాలకు వాడుకుంటుందని ఎద్దేవా చేసారు. అగ్రిగోల్డ్ బాధితులకు తాము అండగా ఉంటామని, తమ ప్రభుత్వం ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే బాధితులందరికీ న్యాయం చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.