– పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 94వ రోజున 51వ డివిజన్ కపాడిపాళెంలోని చెన్నకేశవస్వామి దేవాలయం వీధి, రచ్చమాను వీధి ప్రాంతాలలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలను కనుక్కున్న కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర చరిత్రలో కపాడిపాళెం ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. రోజువారీ కూలి పని చేసుకునే వారి నుండి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారి వరకు ఈ ప్రాంతం నిలయంగా మారిందన్నారు. గతానికి భిన్నంగా నగరంలోని కపాడిపాళెం, సుబేదారుపేట ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని, బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు గురించి కష్టపడుతూ వారిని ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాల వైపు నడిపిస్తున్నారని కేతంరెడ్డి అన్నారు. నెల్లూరు సిటీలో రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవబోయేది జనసేన పార్టీనే అని, తాము గెలిచాక ఈ ప్రాంత విద్యార్థులకు, ఉద్యోగుల సౌలభ్యం కోసం అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.