నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 228వ రోజున 16వ డివిజన్ గుర్రాలమడుగు సంగం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ మూడేళ్లు మంత్రిగా ఉన్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో కనీస అభివృద్ధి కూడా చేయలేదన్నారు. కేవలం మూడు కాలువలకు గోడ కట్టే తన బినామీ కాంట్రాక్టు కోసం తహతహలాడుతూ పేదల ఇళ్ళు కూలగొట్టారని అన్నారు. మైపాడు గేటు వద్ద జాఫర్ సాహెబ్ కాలువ గట్టుపై పేదల ఇళ్ళను అర్థరాత్రి దోపిడీ దొంగల్లాగా ఎలా కూల్చారో అందరం చూసామన్నారు. సర్వేపల్లి కాలువకు రివిట్మెంట్ గోడ కట్టేందుకు గత అంచనాలను బేరీజు వేసుకుని చూస్తే 30 కోట్ల రూపాయలు కూడా కాదని అలాంటిది ఆ కాంట్రాక్టు విలువను సుమారు 120 కోట్ల రూపాయలకు పెంచి తన బినామీకి అప్పజెప్పి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. సర్వేపల్లి కాలువపై నివసించే వేలాదిమంది పేదల ఇళ్ళను కూల్చేందుకు వారి ఇళ్ళకు కరెంట్ కట్ చేసి, జగనన్న కాలనీల్లో ప్రత్యామ్నాయ ఇళ్ళు కట్టే వరకు అద్దె ఇస్తుంటాం అని చెప్పారని, కానీ ఆ ప్రయత్నాలను మేము హైకోర్టుకి వెళ్ళి ఆపడం జరిగిందన్నారు. తాము కనుక ఆపకుంటే ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా జాఫర్ సాహెబ్ కాలువపై కూల్చినట్టు వేలాది ఇళ్ళను అర్ధరాత్రి దొంగల్లాగా నేలమట్టం చేసుండేవారని అన్నారు. ప్రజలకు అండగా ఉంటామని, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తరహా ఇళ్ళు కూల్చే రాజకీయాలను తాము చేయమని, వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నెల్లూరు సిటీ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.