Search
Close this search box.
Search
Close this search box.

ఓటు మన హక్కు – మన బాధ్యత

       ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికల ప్రక్రియ. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే స్వేచ్ఛ, అధికారం హక్కుగా ఇచ్చింది రాజ్యాంగం. జాతి, కులం, మతం, వర్గం, లింగ బేధం లేకుండా సమానత్వానికి ప్రతీకగా వయోజనులైన దేశ పౌరులందరికీ రాజ్యాంగంలోని 326 అధికరణం ద్వారా ఓటు హక్కును 1950 సం౹౹ లో కల్పించింది. పౌరుల ఓటు ప్రాతినిథ్యంతోనే ప్రజాస్వామ్య పటిష్టత ఆధారపడి ఉంది అనేది అక్షర సత్యం. ఐదేళ్లకోసారి రాజకీయ పార్టీల మ్యానిఫెస్టో ను బట్టో ప్రభుత్వంగా చేసిన అభివృద్ధి లేదా పాలనను బట్టో ఓటరు నిర్ణయం ఉండాలి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది ప్రజాస్వామ్య బద్ధంగా కాదు రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియగా మారి పోయింది ధన స్వామ్యమే ప్రజాస్వామ్యాన్ని శాసిస్తుంది. ప్రజలు నిజాన్ని మర్చిపోయి నీడను నమ్ముతున్నారు, శాశ్వతాన్ని వదులుకొని తాత్కాలిక ప్రయోజనాలకు, ప్రలోభాలకు లొంగిపోయి తమ హక్కుని విఫణివీధిలో విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు ప్రశ్నించే హక్కుని కోల్పోతున్నారు. నోట్లకి ఆశపడి భావితరాల భవిష్యత్తుని సమాధి చేస్తున్నారు. ఉనికిని కాపాడుకునే క్రమంలో స్వలాభం కోసం రాజకీయ పార్టీలు ఓట్లు కొనటం మొదలు పెడితే ఎన్నికలు వస్తే నోట్ల పండుగలా ప్రజలు అనుకోవటం మొదలై ప్రజాస్వామ్య పతనానికి నాంది అయింది. బాధ్యత నీది కానప్పుడు ప్రశ్నించే హక్కు ఎక్కడిది? ఓట్లు కొనుక్కొని అధికారం చేపడితే ప్రజాభీష్టం మేరకు పాలన ఉంటుందా? నిత్యం కష్టార్జితంతో జీవించక తప్పని సమాజంలో ఉంటూ ఒక్క ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల ఆలోచనలు నోట్ల చుట్టూ తిరగటం వారి పురోగమనానికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్లే. కోట్ల కొద్దీ రూపాయలను పంచి పెట్టి గెలుపును కొనుక్కున్న రాజకీయ పార్టీని మంచి పాలన చేయమని ప్రశ్నించగలమా? ఓట్లు కొనుక్కొని, అధికారం కాపాడుకునేందుకు గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కొనే పార్టీల నుండి ఇంక నీతివంతమైన పాలనను ఆశించగలమా? ఒక్కరోజు నోటుకు అమ్ముడుపోతే 5 ఏళ్లకు అమ్ముడుపోయినట్లే, రాజకీయం అంటేనే లాభ నష్టాల వ్యాపారంగా మారిపోయింది అమ్మకాలు కొనుగోళ్లకు పరిమితం అయింది. అడ్డదారుల్లో సంపాదించిన డబ్బుతో దొడ్డిదారిన ఓట్లు కొనుక్కుంటున్నారు. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లే గెలిస్తే ఈ రోజు ఎక్కువ ఇచ్చినోడు రేపు ఇంకా ఎక్కువ సంపాదించుకుంటాడు పై వచ్చే ఎన్నికల్లో మన ఓటుకు రేటు పెంచాలి కదా. నేర చరితులకు, అసమర్ధులకు, అవినీతిపరులకు, ఫిరాయింపుదారులకు అధికారం కట్టబెట్టి చట్ట సభల్లోకి పంపిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి ప్రజల భాగస్వామ్య ఓటింగ్ విధానానికి, ప్రజాస్వామ్యానికి అర్ధం పరమార్ధం లేకుండా పోతుంది.

ఇదంతా ఒక కోణం అయితే పోలింగ్ రోజు హాలిడే దొరికిందని జాలీగా ఇంట్లో రెస్ట్ తీసుకునే సిగ్గులేని పౌరులు ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం చచ్చి పోతూనే ఉంటుంది. పల్లెల్లో అక్షర జ్ఞానం లేని పామరులు సైతం ఓటు వేసేందుకు 100% ప్రయత్నం చేస్తారు, విద్యావంతులై డిగ్రీలు, పీజీలు వెలగబెట్టి ఉద్యోగాలు చేస్తూ వినోదాలకు విలాసాలకు వెచ్చించే సమయం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు పై చూపించటం లేదంటే కనీసం విజ్ఞత, బాధ్యత లేని పౌరులుగా నైతిక విలువను దిగజార్చుకున్నట్లే. జనాభా లెక్కల్లో చెప్పుకోవడానికి తప్ప బ్రతికి ఉన్నా చచ్చినట్లే. పట్టణాల్లో ఓటింగ్ శాతం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్నికల్లో ఓటు హక్కుని ఆధార్ గుర్తింపు లాగా ఓటు వేస్తేనే నీ ఉనికి, నీ గుర్తింపు అని తప్పనిసరి బాధ్యతగా, నిర్బంధ ఓటు హక్కు అంటూ చట్టం చేయలేమో అనిపించకమానదు. రాజకీయ పార్టీలు కూడా ఓటింగ్ సరళి పై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. రాజకీయ పార్టీలకు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా ఎత్తుకు పై ఎత్తు వ్యూహాలు వేసినా అభ్యర్థులు ప్రచారం ఏ స్థాయిలో నిర్వహించినా ఎన్నికల సమయంలో ఎలక్షనీరింగ్ అనేది కీలకమైనది. ప్రత్యక్షంగా ప్రతి ఓటరుని పోలింగ్ బూత్ వరకు రప్పించగలిగితే పరోక్షంగా తమ బాధ్యతను నెరవేర్చుకున్నట్లే.

ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ప్రజాధనం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా నాకెందుకు అనుకునే నిర్లక్ష్యాన్ని వీడి మన కనీస బాధ్యతగా వరుస క్రమంలో నిలబడి ఓటు వేసి ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయలేమా..?! ఐదేళ్ల పాటు దేశం/ రాష్ట్రం ప్రగతిని, తమ భవిష్యత్తుని తాము ఎన్నుకునే ప్రజా ప్రతినిధుల చేతుల్లో పెడుతున్నామని గుర్తెరిగి సమర్ధవంతమైన ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటరు పైనే ఉంది.

Written by

కృప

X : @MMR_JSP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way