విశాఖపట్నం ( జనస్వరం ) : రాష్ట్రాన్ని వైసిపి కబంధహస్తాల నుండి కాపాడి, నిరుద్యోగ యువతకు దిశా నిర్దేశం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో యువశక్తి పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకోసం తమ పార్టీ ప్రాంతాలవారీగా సభను విజయవంతం చేయడానికి జనసేన యువశక్తి మీడియా కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దళిత, బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేసి, సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపులకు ఒరిగిందేమిటని అడిగారు. జగన్ పరిపాలనా వైఫల్యంతో యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుందని, యువతను గంజాయికి బానిసలను చేస్తున్నారని తెలిపారు. యువత రాష్ట్రానికి వెన్నుముకని, వారి సమస్యల పరిష్కారానికి ఎజెండా యువశక్తి కార్యక్రమం అని తెలిపారు. జాడ లేని జాబ్ క్యాలెండర్ తో అయోమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గోరంత ఇచ్చి, ప్రజల నెత్తిన పెట్టిన అప్పుల బారం కొండంత అని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. మూడు రాజధానుల పేరుతో విశాఖలోని భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఐటి హబ్ లేకపోగా, ఉన్న పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, మంత్రి అమర్నాథ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీకి వ్యతిరేకత వస్తుందని సభలు, సమావేశాలు, ర్యాలీలను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం దారుణమన్నారు. జనసేన పార్టీ భయపడదని, చట్టపరంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలోని యువత పార్టీలకతీతంగా వైసీపీ చేస్తున్న దోపిడీని అడ్డుకోవడానికి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ వెంట నిలబడి యువశక్తి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జనసేన యువశక్తి మీడియా కమిటీ సభ్యులు దూలం గోపి, నాగలక్ష్మి, గండి దుర్గాప్రసాద్, గురు ప్రసాద్, మిడతాన రవికుమార్, దాసరి జ్యోతి రెడ్డి పాల్గొన్నారు.