శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఇటీవల ప్రముఖ గాయని మంగ్లీ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తన యూట్యూబ్ చానెల్ కోసం ఒక పాటను చిత్రీకరించడాన్ని ఖండిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా తమ నివాస వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీకి శ్రీకాళహస్తి గుడి ఏటీఎం అయిపోయిందని, డబ్బులు ఇస్తే సంప్రదాయాలను, కట్టుబాట్లను మంటగలిపేలా షూటింగులు చేయిస్తారా!! మంగ్లి యూట్యూబ్ చానెల్ కోసం ఆలయ ప్రతిష్టను దెబ్బ తీస్తారా! డబ్బులిస్తే గుడిని కూడా ఎవరికైనా అమ్మేస్తారా అని ధ్వజమెత్తారు. గత ఎన్నో ఏళ్లుగా ఆలయం లోపల వీడియోల చిత్రీకరణ నిషేధం ఉంది, ఇటీవల ప్రత్యేక జీ.ఓ ద్వారా ఫోన్లు నిషేధం అన్నారు. మీడియాకి సైతం గుడిలో వీడియోలు, ఫోటోలు నిషేధం అని చెప్పి, ఇప్పుడు ఏ స్వలాభం కోసం అనుమతి ఇచ్చారో తెలపాలి అన్నారు. ఆలయం లోపల కాలభైరవుడు, స్పటిక లింగం, 500 రూపాయల రాహకేతువులు పూజ మండపము, చాతుర్ మాడ వీధుల్లో, ఉాంజల్ మడపం వద్ద ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రదేశాల్లో కూడా సాంప్రదాయాన్ని మట్టి కలిపి నృత్యాలు చేస్తూ ఆలయ పవిత్రతను కాలరాసారు అని విమర్శించారు. ఏదైనా భక్తి ఛానల్ కోసం చేశారా అంటే అదీ కూడా కాదు, కేవలం వ్యక్తిగత యూట్యూబ్ చానెల్ కోసం గుడిని వాడుకుంటారా అని ప్రశ్నించారు. ఈ సంఘటన పై శ్రీకాళహస్తి ప్రజలు, శివయ్య భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నారు. తక్షణమే ఎమ్మెల్యే, ఎండోమెంట్ కమిషన్ వారు ప్రజలకు క్షమాపణ తెలిపి, ఆ యూట్యూబ్ చానెల్ నుండి విడియో ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.