- శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న 30 వేల మంది భక్తులు
- భక్తులకు షడ్రుచులతో భోజన ఏర్పాట్లు
- త్వరలో నిర్మాణం పూర్తికానున్న ముఖ మండపం, గాలి గోపురం
- ఆలయ ధర్మకర్త, ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి ( జనస్వరం ) : వైకుంఠ ఏకాదశి సందర్భంగా వికృతమాలలో వెలసియున్న సంతాన సంపదన వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణతో మార్మోగింది. వేకువ జాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. ఆలయంలో పుష్ప సోయగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్త, ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం షడ్రుచులతో అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ 2024 కేలండర్ ను ఆవిష్కరించి భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 11వ ఏడాది వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. శిధిలమైన ఆలయాన్ని పునర్నిర్మించి దీప, దూప, నైవేద్యాలతో అను నిత్యం పూజా కైంకర్యాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఆలయ ముఖ మండపం పనులను ప్రారంభించామని త్వరలోనే మండప నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అలాగే ఆలయానికి గాలి గోపురం, పుష్కరిణి, బేడి అంజనేయస్వామి, వకుళమాత, వరదరాజస్వామి, యోగ నరసింహ స్వామి వార్ల ఆలయాలను కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తామన్నారు. రెండు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వెంకటేశ్వర ప్రసాద్ గారు, శివ ప్రసాద్ గారు, మునికృష్ణయ్య గారు, బాబూజీ స్కూల్స్ చైర్మన్ బాలాజీ నాయుడు, ex సర్పంచ్ హేమాక్షి, యుగంధర్, మురళి, శేఖర్, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com