ప్రజాస్వామ్యాన్ని హరించేలా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలన సాగుతోందని పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు విమర్శించారు. భీమవరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, మోసపూరిత వ్యవహారాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు జన సైనికులు నిరంతరం పోరాడతారన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని పేర్కొన్నారు. ధాన్యానికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ విడుదల చేయకపోతే రైతులు సాగు ఎలా ? చేస్తారని ప్రశ్నించారు. ఇదే అంశంపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించిన రైతుపై కేసు నమోదు చేయడం ఎంత వరకు సబబన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై మిత్రపక్షం భాజపాతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయడం లేదని గోవిందరావు ఆరోపించారు.
భీమవరం నుంచే పవన్ పోటీ..
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వేగేశ్న కనకరాజు సూరి మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను మరోసారి భీమవరం నుంచే పోటీ చేయిస్తామని చెప్పారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా జన సైనికులు సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కారేపల్లి శాంతిప్రియ, నాయకులు గుండా రామకృష్ణ, బండి రమేష్‌నాయుడు, మాగాపు ప్రసాద్, వానపల్లి సూరిబాబు, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.