Search
Close this search box.
Search
Close this search box.

జగన్ రెడ్డి…. ఓ రాజకీయ వైఫల్యం

జగన్

             ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ నాయకుడు అవ్వలేరు. ప్రజలు అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన జగన్ రెడ్డి గారి మూడేళ్ల ప్రస్థానం గురించి క్లుప్తంగా చర్చించుకుందాం. శాసనం ద్వారా నిర్మితమై, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత, విశ్వాసం చూపుతానని, రాగ ద్వేషాలు గానీ, పక్షపాతం గానీ లేకుండా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నా భాద్యతలను నిర్వహిస్తానని ప్రమాణం చేసిన జగన్ రెడ్డి గారు దాన్ని ఎంతవరకు నిలబెట్టుకున్నారో ఓసారి మాట్లాడుకుందాం.

           ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఎంతో  బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి నేడు ఆ అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. వేల కోట్లు వ్యాపారాలు చేస్తూ లెక్కలేనంత గడించిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వగానే, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కట్టిన ఇంటికి బాత్రూం కోసమని, కిటికీల కోసమని 16 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించటం అత్యంత హీనమైన చర్య. అదే కాక పెరోల్ మీద గూండాలను, అంతర్జాతీయ స్మగ్లర్లను విడుదల చేయటం దేనికి సంకేతం? సమగ్ర పాలనలో జగన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం అయ్యారు. ఆయన నిలకడలేని నిర్ణయాలు,, మాట మార్చిన వైనాలు కోకొల్లలు. తీసుకున్న నిర్ణయాల్లో దాదాపు 80 సార్లు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని, చీవాట్లు పెట్టింది. అత్యున్నత స్థాయి అధికారులు, ఐఏఎస్ లు, ఐ‌పి‌ఎస్ లు కోర్టులకు వెళ్ళడం, జైలు శిక్షలు అనుభవించటం చాలా సాధారణం అయిపోయింది. పాలనపరమైన పరిజ్ఞానం లేకపోవడం, మొండి వైఖరి, కక్ష సాధింపు రాజకీయాలకు తెరతీసి చెడ్డపేరు తెచ్చుకున్నారు.

          ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, చేసే విధానాలు, పాలసీలు అన్నీ ప్రజల మీద ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపుతాయి. అప్పటి దాకా ఉచితంగా దొరికిన ఇసుకను, రీచ్ ల పేరుతో వ్యాపారం చెయ్యడం, సామాన్యుడికి అందనివ్వకుండా, దళారీ వ్యవస్థ కు అప్పగించడం, ఒక స్పష్టమైన నిర్దిష్టమైన విధానాలు తీసుకునిరాకుండా కాలయాపన చేసి 75 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు.

                మాట తప్పం మడమ తిప్పము అని జనాన్ని నమ్మించి ఓటు బ్యాంక్ సంపాదించిన జగన్ రెడ్డి గారు అధికారంలోకి  రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అన్న మాట ఇచ్చి, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం దశలు వారీగా చేస్తానని మాట తప్పారు.. మద్యం ధర రెండింతలు చేసి, కడపలో మద్యం తయారీ చేసే కంపెనీల ద్వారా మద్యాన్ని కొంటూ, నేడు ప్రభుత్వమే మద్యాన్ని అమ్మేలా మార్చేశారు. గెలిచిన మూడేళ్లలో మద్యం మీద వచ్చిన ఆదాయం పెరిగిందే కానీ తగ్గలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో మద్యం నుండి వచ్చే అంచనా ఆదాయం 16 వేల కోట్లకు పైచిలుకు. గత ఏడాదితో పోలిస్తే ఇది 1500 కోట్లు ఎక్కువ. మరి ఎక్కడ మద్యపాన నిషేధం? ఇక్కడితో ఇది ఆగలేదు వచ్చే ఐదేళ్లలో మద్యం నుండి వచ్చే రాబడిని చూపించి అప్పులు చేయడం అత్యంత హీనమైన చర్య. ఇదేనా విశ్వసనీయత అంటే?

            ప్రతిపక్షం లో ఉన్నప్పుడు అమరావతి అయితే అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుంది. అమరావతిని రాజధాని చెయ్యడం మంచిదే అని గుడి లాంటి అసెంబ్లీలో చెప్పిన జగన్ రెడ్డి, ఎన్నికలో గెలిచి ముఖ్యమంత్రి అవ్వగానే తూచ్ అనేశారు. ఒక్కటి కట్టడానికే మనకు నిధులు లేవంటే మూడు రాజధానులు అంటూ మాట మార్చేశారు. పోనీ అదైనా జరిగిందా అంటే అదీ లేదు. ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని వ్యక్తి. ఇలా పూటకో మాట మీద ఉంటే ప్రభుత్వం మీద నమ్మకం, భరోసా ఎలా ఉంటుంది? పెట్టుబడులు పెట్టాలి అంటే స్పష్టమైన, నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకునే వారే ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఇంకోలా మారితే పెట్టుబడులు కూడా రావు. గెలిచిన అధికార పార్టీ ఎంపీ ఒకరు నేరుగా కియా కంపెనీకి వెళ్లి గొడవ చేయడం లాంటివి చేస్తే వేరే కంపెనీలు, పెట్టుబడులు ఎలా వస్తాయి? 16 మెడికల్ కాలేజీ లు, కడపలో ఉక్కు కర్మాగారం ఇలాంటి వాటికి వేసిన శంకుస్థాపనలు శిథిల స్థాయికి చేరుకుంటున్నాయి కానీ ఇంతవరకు కనీసం ఒక్క ఇటుక వేసింది లేదు.

          మన ఇల్లైనా, రాష్ట్రమైన, దేశమైనా, ప్రపంచమైనా నడిచేది ఆర్థిక వనరుల మీదే. అలాంటి ఆర్థిక వనరులు అభివృద్ధి చెయ్యాలిగాని, అప్పులు చేసి పప్పుకూడు తినకూడదు. కరోనాలాంటి మహమ్మారి వచ్చాక ఆర్థిక పురోగతి చాలా తగ్గింది. అలాంటప్పుడు ఆర్థికాభిృద్ధికి కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే జేబులో రూపాయి ఉంటేనే ధైర్యంగా ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు వారికి స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పే చర్యలు తీసుకోవాలి. తగిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తే పెట్టుబడులు పెడతారు. ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ వదిలేసి ఎంతసేపు అప్పులు దొరికితే తీసుకొచ్చి నాలుక మడతపడే అన్ని పథకాల పేర్లతో డబ్బులు పంచడం చాలా విచారకరం. ఎంతసేపు ప్రచార ఆర్భాటాలు తప్ప, చేసిన అభివృద్ధి ఏముంది రాష్ట్రంలో? పేపర్ ప్రకటనల కోసం పెట్టిన దాంట్లో పాతిక శాతం కూడా ముఖ్యమంత్రి సహయనిధి కింద పేదల  కోసం ఖర్చు  చేయలేదు. రంగుల పేరుతో 3000 కోట్లు ఖర్చు చేశారు. ఒక చేత్తో ఇస్తూ ఇంకొక చేత్తో లాక్కుంటున్నారు. అమరావతి రాజధానిగా అవసరం లేదు కానీ అమరావతి రాజధాని పేరుతో పెట్రోల్, డీజిల్ మీద వసూలు చేసే సెస్ (అదనపు పన్ను) మాత్రం కావాలి. రోడ్లు వెయ్యరు, బాగు చెయ్యరు కానీ వాటి పేరు మీద పెట్రోల్, డీజిల్ లో సెస్ వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే మన రాష్ట్రంలో 10 రూపాయలు ఎక్కువ.

                పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేశారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్ని మూసేశారు. ఆ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగాలు వరవడి ఉంటుంది. ప్రతి ఏడాది జనవరి 1 తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తాము. 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి గారు మూడేళ్లు గడుస్తున్నా ఒక్క క్యాలెండర్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్ర ప్రభుత్వ౦లో గానీ PRC ఇస్తే జీతాలు పెరుగుతాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం జీతాలు తగ్గుతాయి. అదేంటో ఎవ్వరికీ అర్థం కాదు. అడిగితే ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నామని బెదిరింపులు. నేను అధికారంలోకి వచ్చిన వారం లోనే CPS రద్దు చేస్తాను అని చెప్పిన జగన్ రెడ్డి గారు మూడేళ్లు అవుతున్నా దాని ఊసే లేదు. పైగా CPS రద్దు హామీ ఇచ్చేటప్పుడు దాని మీద నాకు అవగాహన లేదని  యూ టర్న్ తీసుకోవడం హాస్యాస్పదం. రాష్ర్టంలో సిమెంట్, స్టీల్ రేట్లు పెంచేసి ఇసుక విషయంలో సరైన నిర్ణయం తీసులోకుండా 75 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి రోడ్డున పడేలా చేశారు. ఉప్పు నుండి పప్పు దాకా, పెట్రోల్, డీజిల్ అన్నీ ధరలు పెంచేశారు. విద్యుత్తు ధరలు పెంచారు. స్లాబ్స్ మార్చారు, ఇంటి పన్ను దగ్గర నుండి టాయిలెట్ పన్నులు కూడా వేయడం మొదలు పెట్టి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.

               పక్క రాష్ట్రాల తో పోలిస్తే మన రాష్ట్రం లో అన్నీ ధరలు ఎక్కువ. శాంతి భద్రతల విషయంలో రాష్ట్రం అట్టడుగున ఉంది. దానికి జాతీయ సంస్థలు ఇచ్చే గణాంకాలే నిదర్శనం. హత్యలు, మానభంగాలు సర్వసాధారణం అయిపోయాయి. మానభంగం జరిగితే చట్టబద్దంగా బాధితులకు వచ్చే పరిహారాన్ని ఇచ్చేసి, మేము న్యాయం చేసామని చెప్పుకోవడం హాస్యాస్పదం. అవి చట్టపరంగా బాధితులకు రావాల్సినవి. నిందితులకు మాత్రం శిక్ష పడటం లేదు. సుగాలి ప్రీతి లాంటి వారికి న్యాయం ఎక్కడ జరిగింది? పరిశ్రమల నుండి విషవాయువులు వచ్చి చాలామంది చనిపోతే, వారికి డబ్బులిచ్చి అంతా అయిపోయింది అనుకుంటే చాలా తప్పు, న్యాయం చెయ్యడం అంటే బాధితులకు డబ్బులు, ఉద్యోగం ఇవ్వడం కాదు నిందితులకు శిక్ష పడటం. ఆ తప్పు మరలా జరగకుండా చూడడం.

              జగన్ రెడ్డి గారి ఆర్థిక విధానాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ మాట సాక్షాత్తు కాగ్ ( కంట్రోల్ అండ్ ఆడిటింగ్ జనరల్ ఆఫ్ ఇండియా) వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. రాష్ట్ర అప్పులు దాదాపు 8 లక్షల కోట్లు, దొరికితే అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ, దొరక్కపోతే ప్రభుత్వ భవనాలు, పార్క్ లు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చి నవరత్నాల పేరుతో ఓటు బ్యాంకింగ్ పథకాలకు ఇవ్వడం ఆర్థిక వ్యవస్థను చంపడమే.  బడ్జెట్ లో పెట్టకుండా ఖర్చు చేయడం, కార్పొరేషన్ పేర్లతో అప్పులు చేయడం, కేంద్రం నుండి వచ్చే గ్రాంట్ లు మళ్ళించడం. అయితే తన పేరు లేకుంటే తండ్రి పేర్లు పెట్టుకుని పంచడం. ఇదేనా ఒక నాయకుడిగా చేయాల్సింది? స్వయంగా ఒక వ్యాపార వేత్త అయిన జగన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని మాత్రం ఎందుకు పాతాళంలోకి నెడుతున్నారు? 2004లో అప్పుల్లో ఉన్న జగన్ రెడ్డి గారు 2009 చివరికి వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసినట్లు రాష్ట్రాన్ని మాత్రం ఎందుకు అప్పుల్లో ముంచుతున్నారు అన్నది ఆయనే చెప్పాలి.

           రోడ్డు పక్కన టీ అమ్ముకునే వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ లు వాడుతుంటే కొన్ని వేల కోట్లు వ్యాపారం అయిన మద్యం దుకాణాల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్ లు పెట్టలేదు? పైగా ప్రభుత్వమే ఆ మద్యాన్ని అమ్ముతున్నది కూడా. పారదర్శకత ఎక్కడ? చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా కోకొల్లలు. నిజమైన నాయకుడికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే అభిమతంగా ఉంటుంది. అధికారం కోసం ఓట్ల కోసం ఓటర్లను ఆకట్టుకునే పథకాలు పెట్టి ఒకచేత్తో నేరుగా ఇచ్చి, ఇంకో చేత్తో వారికే తెలియకుండా లాక్కోవడం రాజకీయ నాయకుడి లక్షణం. ఈ లక్షణాలు జగన్ రెడ్డి గారు పుణికి పుచ్చుకున్నారు. ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా మౌలిక సదుపాయాలు చాలా అవసరం. రైల్వే వారు కొత్త రైల్వే లైన్ వేస్తాము, రాష్ట్రం నుండి మీ వాట మీరు ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేను దుస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. విశ్వవిద్యాలయ నిర్వహణ, జీతాల కోసం డిపాజిట్ చేసిన డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించడం ఎక్కడ చూడనిది. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే నిజాయితీగా, నిబద్దత ఉన్న నాయకులు అవసరం. కేవలం అధికారం కోసమే ప్రాకులాడే వారిని ఎన్నుకుంటే పాలన ఇలానే ఉంటుంది. ఆర్థికాభివృద్ధి లేని సంక్షేమం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాంటి, నిబద్దత, నిజాయితీ ఉన్న వారు రాష్ట్రానికి అత్యంత అవసరం. ఇసుక పాలసీ వలన 75 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడితే డొక్కా సీతమ్మ పేరుతో అన్నం పెట్టాడు. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో 800+ ఆక్సీజన్ సిలిండర్లు ఆయన పేరు మీద విరాళం ఇచ్చారు. ఇప్పుడు కూడా 3000 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే  వారికి 30 కోట్లు పైగా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో సాయం చెయ్యడం అనేది గొప్ప విషయం. ఓ ప్రభుత్వం చేయని పని ఓ వ్యక్తి చేస్తున్నాడు, అలాంటి వ్యక్తికి అధికారం ఇస్తే ఇంకెంత చేస్తారో అనే విషయం ఆలోచించాలి. తనతోపాటు నడిచే క్రియాశీలక కార్యకర్తలకు సొంతంగా 5 లక్షలు భీమా చేస్తున్నాడు. కార్యకర్తల విషయంలోనే ఇంత భరోసా ఇస్తూ ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచిస్తాడు. ఎంత చేయగలడో ఆలోచించుకోవాలి. 

#Written By

ట్విట్టర్ ఐడి : @BhagathChegu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way