
నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 131వ రోజున 50వ డివిజన్ సంతపేట ప్రాంతంలోని ఖాజీపేట, బొగ్గుల వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం కోసం తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవనన్న ప్రజాబాటలో ఇంటింటికీ తిరుగుతుంటే ప్రజలందరూ అపూర్వంగా ఆదరిస్తున్నారని, ముఖ్యంగా మహిళలు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న విధానం గురించి తమకే వివరిస్తున్నారని అన్నారు. వారి ఆదరణతో మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటికి 131 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాటలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని దాదాపు 35వేల ఇళ్ళకు వెళ్ళి సమస్యల అధ్యయనం చేయడం జరిగిందని, నియోజకవర్గంలో ఏ ఒక్క ఇంటిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్క ఇంటికీ పవనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.