చింతపల్లి సెప్టెంబర్ 7 (జనస్వరం): అల్పపీడన ప్రభావంతో కుంభవృష్టిగా కురిసిన వర్షానికి రెండు నివాస గృహాలు నేల కూలి రెండు గిరిజన కుటుంబాలు నిరాశ్రయులైన సంఘటన కుడుముసారి పంచాయతీలో చోటు చేసుకుంది. నిరాశ్రయులైన గిరిజన కుటుంబాలు అందించిన వివరాలు ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభ వృష్టి వర్షానికి మండలంలోని మారుమూల పంచాయతీ అయిన కుడుము సారి పంచాయతీ పరిధిలోని మండిపల్లి, కోటగున్నల గ్రామాలకు చెందిన సాగిన సన్యాసమ్మ, పాంగి నారాయణమ్మ ల నివాస గృహాలు నేలమట్టం అయ్యాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాగ్రి తడిసి ముద్ద కావడంతో కనీసం వంట వండుకునేందుకు నిలువ నీడ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులమంతా రోడ్డున పడ్డామని వారు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com