- కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో హర్షం
- తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు గుత్తా కార్తీక్ నాయుడు
ముదిగుబ్బ, ఆగష్టు 7, జనస్వరం : కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హులైన ప్రజలకు పథకాల ప్రయోజనాలను వేగంగా అందిస్తోందని తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు గుత్తా కార్తీక్ నాయుడు అన్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలో మూడు కీలక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి, ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి భరోసా కల్పించే తల్లికి వందనం, పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులకు ఆర్థిక భరోసా అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్, చేనేత కార్మికుల సంక్షేమానికి చేనేత సేవలో వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. “మాటల్లో కాదు.. చేతల్లో సంక్షేమం” అన్న విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గుత్తా కార్తీక్ నాయుడు అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు.
