
చిత్తూరు ( జనస్వరం ) అమలు సాధ్యం కాని హామీలను గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన ప్రమాణాలను “మాట తప్పం – మడమ తిప్పం” అని పాదయాత్ర సాక్షిగా ప్రమాణం చేసి దానిని విస్మరించారని చిత్తూరు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య అన్నారు. దశలవారీగా వృద్ధాప్య పింఛన్ల పెంపునకు బదులుగా, దశలవారీగా పింఛన్లు ఎలా కోతలు విధించాలనే ఆలోచనలో తలమునకలౌతున్నది. అందులో భాగంగానే వికలాంగుల పింఛన్లు “పరిశీలన” పేరుతో కోతలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా సుమారు ఐదు లక్షల కార్డులను వివిధ కారణాలను చూపి రద్దు చేసి పేదల కడుపు కొట్టింది. విధ్యార్థుల తల్లులకిచ్చే అమ్మ ఒడికి హాజరు 75% నిబంధనతో కోతలు ప్రారంభించింది. ఇప్పుడు కరెంటు కోతలు కూడా ప్రారంభించబోతోంది. అందులో భాగంగానే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో కరెంటు కోతలు విదించబోతున్నట్లు సమాచార మాధ్యమాలల్లో వచ్చిన విషయం విదితమే. భవిష్యత్తులో ఈ కోతలు ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేయబోతున్నాయని, కోతలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలే ఈ ప్రభుత్వ అధికారానికి కోతలు విధిస్తారని ఆయన హెచ్చరించారు. “నవరత్నాలు” ఇస్తానని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వివిధ రకాల కోతలతో సామాన్యుడి జేబుకు “నవ రంధ్రాలు” పడేలా ప్రజల జీవనాన్ని ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.