• మిల్లర్లకు తలొగ్గి రైతులకు అన్యాయం చేస్తున్నారు
• ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై జనసేన మండిపాటు
• రైతులతో కలసి కోరుకొండ తహసీల్దార్ కార్యాలయానికి బత్తుల బలరామకృష్ణ
రాజానగరం, (జనస్వరం) : రైతు ప్రభుత్వమని డప్పు కొట్టుకుంటున్న వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తూట్లు పొడుస్తుందని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దీనంగా తయారయ్యిందని, పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొరుకొండ మండల పరిధిలోని కాపవరం తదితర గ్రామాల రైతులతో కలసి బత్తుల బలరామకృష్ణ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రైతుల సమస్యలు తహసీల్దార్ కు వివరించారు. నెల రోజులుగా రైతులకు కనీసం గోని సంచులు కూడా దొరకడం లేదని, తక్షణం గోనె సంచులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర రైతులకు దక్కేలా చూడాలని, రైతుల ఖాతాల్లో సాధ్యమైనంత త్వరగా డబ్బు జమ అయ్యేలా చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలు గడువును మరింత పెంచాలన్నారు. ధాన్యం రవాణా ఖర్చులు అంటూ బస్తాకు రూ. 200 బారం రైతుల మీద మోపడం దురదృష్కరమన్నారు. ప్రభుత్వం మిల్లర్లకు తలొగ్గి రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో నియోజకవర్గ స్థాయిలో రైతులతో కలసి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను వైసీపీ కాలరాస్తోందని మండిపడ్డారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో జనసేన పార్టీ రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.